నవతెలంగాణ మాజీ సీజీఎం పీవీ శ్రీనివాస్‌కు ఘన నివాళి

– ముగిసిన అంత్యక్రియలు
– సంతాపం ప్రకటించిన సీపీఐ(ఎం) తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర నాయకులు
– ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసిన నేత పీవీ : సంతాప సభలో నేతలు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
విద్యార్థి ఉద్యమ మాజీ నేత, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు, నవతెలంగాణ దినపత్రిక మాజీ సీజీఎం కామ్రేడ్‌ పీవీ శ్రీనివాస్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన శనివారం గుండెపోటుతో మృతిచెందిన విషయం విదితమే. కాగా శనివారం రాత్రి మృతదేహాన్ని స్వగ్రామం భద్రాచలం తీసుకొచ్చారు. మృతదేహాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన సీపీఐ(ఎం), సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు ఆదివారం సందర్శించి నివాళి అర్పించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌ మాట్లాడారు. భద్రాచలం ఏజెన్సీలో పుట్టి మన్నెంలో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడంలో పీవీ కీలక పాత్ర పోషించారని సాగర్‌ అన్నారు. ప్రజాతంత్ర ఉద్యమ అవసరాలరీత్యా ఖమ్మం, హైదరాబాద్‌ ప్రాంతాలకు తరలివచ్చి.. భద్రాచలం ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌ కేంద్రం వరకు విద్యార్థి యువజన ఉద్యమాలు నడిపారని చెప్పారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కేంద్రంలో పీవీ శ్రీనివాస్‌తో కలిసి పని చేసిన జ్ఞాపకాలను సాగర్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితో భద్రాచలం ఏజెన్సీలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావటమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని, శ్రీనివాస్‌ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.
పీవీ తండ్రి కృష్ణారావు పంచాయతీ రాజ్‌ శాఖలో ఉద్యోగ విధులు నిర్వహించినప్పటికీ అతనికి బండారు చందర్రావుతో ఉన్న సాన్నిహిత్యంతో తన కుమారుడైన శ్రీనివాస్‌ను ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమంలోకి ప్రోత్సహించారని బండారు రవికుమార్‌ చెప్పారు. శ్రీనివాస్‌ భార్య స్వర్ణ జ్యోతి తల్లిదండ్రులు కూడా పార్టీ కుటుంబానికి చెందిన వారేనని, ఆ విధంగా పీవీ శ్రీనివాస్‌కి పార్టీకి విడదీయలేని అనుబంధం ఏర్పడిందని అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏజే రమేష్‌, డీసీసీబీ మాజీ చైర్మెన్‌ యలమంచి రవికుమార్‌ మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్‌లో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన పీవీ శ్రీనివాస్‌ అంచలంచెలుగా ఎదుగుతూ డీవైఎఫ్‌ఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యునిగా వెళ్లారని చెప్పారు. నవతెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేశారన్నారు. పీవీ శ్రీనివాస్‌ సతీమణి జ్యోతి ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేస్తున్నారని చెప్పారు. ఆయన మృతి పార్టీకి, కుటుంబానికి తీరని లోటన్నారు. అనంతరం అంతిమయాత్రలో నాయకులు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ కమిటీ సంతాపం
పీవీ మృతికి సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంతాపం ప్రకటించారు. అలాగే, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. పీవీ మృతదేహానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల కాశి పూలమాల వేసి నివాళులర్పించారు. పీవీ శ్రీనివాస్‌తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ యువజన ఉద్యమంలో కలిసి పనిచేసిన అనుభవాన్ని బాలకాశి గుర్తు చేసుకున్నారు.
పలువురి నివాళి
శ్రీనివాస్‌ మృతదేహాన్ని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చావ రవికుమార్‌ సందర్శించి నివాళి అర్పించారు. మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డాక్టర్‌ మిడియం బాబురావు పీవీ మృతికి తమ సంతాపాన్ని, కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు ఎం.సుబ్బారావు, నవతెలంగాణ ఉమ్మడి ఖమ్మం జిల్లా మేనేజర్‌ జావీద్‌, విలేకరులు, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సీపీఐ నాయకులు నివాళి అర్పించారు.

Spread the love