దెబ్బ మీద దెబ్బ

Blow upon blow– ఒక్కొక్కటిగా ఊడుతున్న కమలం రేకులు
– నేతల మధ్య చిచ్చుపెట్టిన తొలి జాబితా
– కమలానికి రాజీనామా యోచనలో పలువురు సీనియర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికల వేళ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. జాతీయ నాయకత్వం ప్రకటించిన తొలి జాబితా ఆ పార్టీ నేతల మధ్య అగ్గి రాజేసింది. టిక్కెట్‌ దక్కక కొందరు, తాము ఆశించిన స్థానం వేరే వారికి కేటాయించటంతో మరికొందరు ఆ పార్టీని వీడుతున్నారు. ఇంకొందరు తమ అనుయాయులు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామంటూ చెబుతున్నారు. తాజాగా నిర్మల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షులు రమాదేవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ముధోల్‌ సీటును ఆశించి భంగపడిన ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కన్న తల్లిలా భావించిన పార్టీలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అందుకే బీజేపీని వీడుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఆ పార్టీకి బై బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తే తాను గెలవనని సర్వేల్లో తేలడంతో ఆయన కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్‌రెడ్డి మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు స్రవంతి రెడ్డితో మంతనాలు జరిపారు. తనకు మద్దతనిచ్చి.. సహకరిస్తే భవిష్యత్తులో మంచి పదవి ఇప్పిస్తానంటూ గ్యారెంటీ ఇచ్చినట్టు సమాచారం. మునుగోడు నుంచే కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న మరో నేత చలమల కృష్ణారెడ్డితోనూ ఫోన్లో సంప్రదించేందుకు రాజగోపాల్‌ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో రాజగోపాల్‌ ఏ క్షణంలోనైనా కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ధర్మపురి (మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు) నుంచి టిక్కెట్‌ ఆశించిన మాజీ ఎంపీ వివేక్‌కు బీజేపీ అక్కడ కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూర్‌ స్థానాన్ని కేటాయించింది. దీంతో ఆయన పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో అటు రాజగోపాల్‌, ఇటు వివేక్‌ ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయి… త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించే అవకాశముందని సమాచారం.
మరోవైపు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ కూడా బీజేపీని వీడనున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. మునుగోడు లేదా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి తనకు టిక్కెట్‌ కేటాయించాలంటూ ఆయన కోరారు. ఆ మేరకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. దీనికి బీజేపీ అధిష్టానం అంగీకరించకపోవటంతో నర్సయ్య ఇప్పుడు అలకబూనారు. ఇక మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ పడుతున్న మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి… ఇద్దరూ పార్టీకి తలనొప్పిగా మారారు. గద్వాలలో సీనియర్‌ న్యాయవాది అయిన వెంకటాద్రి రెడ్డిని నిలబెట్టి… తనకు ఎంపీగా అవకాశమివ్వాలని అరుణ కోరుతున్నారు. ఇదే సమయంలో తన కుమారుడు మిథున్‌రెడ్డికి షాద్‌నగర్‌ అసెంబ్లీని కేటాయించి, తనకు లోక్‌సభకు అవకాశం కల్పించాలంటూ జితేందర్‌రెడ్డి కోరుతున్నారు. కానీ ఆయన్ను శాసనసభకు పోటీ చేయాలంటూ కమలం పార్టీ ఢిల్లీ పెద్దలు ఆదేశించారు. వారి ఆదేశాన్ని పాటించలేనంటూ ఆయన తిరస్కరించినట్టు సమాచారం. ఈ క్రమంలో డీకే, జితేందర్‌ ఏం చేస్తారో చూడాలి. ఇక హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని గోషామహల్‌ నుంచి పార్టీ టికెట్‌ ఆశించి భంగపడిన విక్రమ్‌గౌడ్‌ కూడా బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడిన బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలా కీలక నేతలందరూ అలకలు, అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో బీజేపీకి మరిన్ని దెబ్బలు తగలటం ఖాయంగా కనబడుతున్నది. తెలంగాణలో సీన్‌ రివర్సని తేలిన తర్వాత కమలం పార్టీ పరిస్థితి ఈ విధంగా మారటం గమనార్హం.