– మిగతా స్థానాల్లో ప్రజాస్వామ్యవాదులు, కమ్యూనిస్టు విప్లవకారులకు మద్దతు : న్యూడెమోక్రసీ పార్టీల నేతలు సాధినేని వెంకటేశ్వరరావు, ఎ.మధు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారనీ, మిగతా స్థానాల్లో ప్రజాస్వామ్యవాదులకు, కమ్యూనిస్టు విప్లవకారులకు మద్దతు తెలుపుతామని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రెండు పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీల రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర సహాయ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడారు. ఇల్లందు(ఎస్టీ)- మోకాళ్ల కృష్ణ, పినపాక(ఎస్టీ)-ఈసం కృష్ణ, మహబూబాబాద్(ఎస్టీ) బట్టు భిన్నమ్మ, ములుగు(ఎస్టీ)-సమ్మక్క, నర్సంపేట-మొగిలి ప్రతాప్‌రెడ్డి, మంచిర్యాల -అందె మంగ, నిజామాబాద్ అర్బన్-మసాల్కర్ శివకుమార్ తమ అభ్యర్థులుగా పోటీచేస్తారని తెలిపారు. వారిని గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ వనరులను, సహజ సంపదలను కాపాడుకునేందుకు, దున్నేవాడికే భూమి దక్కాలని పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ హిందూత్వ సర్కారు మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తున్నదని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తున్నదన్నారు. ఆటవీ సంరక్షణ నియమాల పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టి సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేననీ, బిల్లులు, చట్టాల రూపకల్పన, కీలక సమయాల్లో ఆ రెండు పార్టీలూ పరస్పరం మద్దతు తెలుపుకున్నాయని పలు ఉదంతాలను వివరించారు. ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.