– బీజేపీ నేతలు ఈటల, లక్ష్మణ్ విమర్శ
నవతెలంగాణ-హైదరబాద్‌బ్యూరో
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు కల్వకుంట్ల కుటుంబసభ్యులే ముఖ్యమంత్రులాగా ఉంటారనీ, ఆపార్టీలో మరొకరిని ఆ స్థానంలో చూడలేమని బీజేపీ సీనియర్ నేతలు డాక్టర్ కే లక్ష్మణ్, ఈటల రాజేందర్ అన్నారు. శనివారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశానికి ఓబీసీ ప్రధానిని అందించిన ఘనత బీజేపీదే అని అన్నారు. బీఆర్‌ఎస్ గతంలో దళితుడు ముఖ్యమంత్రి అని ప్రకటించి, అమలు చేయలేదన్నారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ధైర్యంగా ప్రకటించామని చెప్పారు. బీఆర్‌ఎస్‌లో పార్టీ అధ్యక్ష పదవిలోనూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉంటారని విమర్శించారు. తెలంగాణ వస్తే బడుగులకు అధికారం, జీవితాల్లో వెలుగు వస్తుందన్నారనీ కానీ ఒక్క కుటుంబంలో మాత్రమే వెలుగు వచ్చిందన్నారు. వారికి అధికారం ఇచ్చిన ప్రజల బతుకులు ఆగమయ్యాయన్నారు. బీసీల పట్ల బీఆర్‌ఎస్‌కు చులకనభావం, చిన్నచూపు ఉందన్నారు. గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే అనీ, కేంద్రంలో 70 శాతానికి పైగా అణగారిన వర్గాలకు చోటుదక్కిందని చెప్పారు. కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలనీ, అవినీతి రహిత పాలన కోసం బీజేపీని గెలిపించాలని కోరారు.