ఆర్టీఐ చట్టం ‘డెడ్‌ లెటర్‌’గా మారుతుంది

RTI Act becomes a 'dead letter'– సమాచార కమిషన్లలో ఖాళీలను భర్తీ చేయాలి
– కేంద్రానికి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్‌లోని ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్రాలను, కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటి ఖాళీలు కొనసాగడం సమాచార హక్కు చట్టంలోని లక్ష్యాన్ని ఓడిస్తుందని కోర్టు పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ సమాచార కమిషన్‌లలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర సమాచార కమిషన్‌తో పాటు పలు రాష్ట్ర సమాచార కమిషన్‌లలో ఖాళీలపై ఫిర్యాదు చేస్తూ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ”ఈ ఖాళీలను భర్తీ చేయడంలో రాష్ట్రాలు విఫలమైతే ఆర్టీఐ చట్టం లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. చట్టం డెడ్‌ లెటర్‌ అవుతుంది. రాష్ట్ర సమాచార కమిషనర్ల ఎంపిక ప్రక్రియను ప్రారంభించే వరకు అన్ని రాష్ట్రాలు వెంటనే చర్యలు తీసుకోవాలి” అని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాల స్పందనలను కోరాలని భారత అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటిని ఆదేశించారు. అన్ని కమీషన్లలో ఎన్ని ఖాళీలు ఎన్ని అప్పీళ్లు/ఫిర్యాదులు వచ్చాయనే దానిపై చార్ట్‌ సిద్ధం చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ)ని కోర్టు ఆదేశించింది. ఇంకా, ఖాళీల భర్తీకి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది.
తెలంగాణ వంటి రాష్ట్రాలు కమిషన్‌ను రద్దు చేశాయి :ప్రశాంత్‌ భూషణ్‌
పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ, తెలంగాణ వంటి రాష్ట్రాలు దాదాపు రాష్ట్ర సమాచార కమిషన్‌ను రద్దు చేశాయని, చాలా రాష్ట్రాలు అలాంటి కేసుల్లో అప్పీలు కూడా తీసుకోవడం లేదని పేర్కొన్నారు.