– ముందస్తు పరీక్షలతో సంరక్షణ : డాక్టర్ పి.విజయ్ ఆనంద్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అపొలొ క్యాన్సర్ సెంటర్లలో రొమ్ము క్యాన్సర్లను రోగ నిర్ధారణ చేస్తున్నట్టు హైదరాబాద్ అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పి.విజయ్ ఆనంద్ రెడ్డి తెలిపారు. రొమ్ము క్యాన్సర్ చైతన్య మాసం అక్టోబర్‌ను పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని అపోలో క్యాన్సర్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలిదశలో గుర్తించడం, రాకముందే పసిగట్టడం ద్వారా సులువైన చికిత్స ద్వారా బయటపడే అవకాశముందని తెలిపారు. వక్షోజాల ఆరోగ్యాన్ని కచ్చితంగా అంచనా వేయడంలో మమోగ్రఫీ, ఆల్ట్రాసౌండ్, బయాప్సీలతో కూడిన ఆధునాతన రోగ నిర్ధారణ సాంకేతికతలతో 24 గంటల్లోనే ఫలితం పొందే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. వక్షోజాలను కాపాడటంలో తాము 60 శాతం విజయం సాధించామనీ, వంద శాతం విజయం సాధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. క్యాన్సర్లలో గతంలో గర్భాశయ క్యాన్సర్లు అధికంగా వచ్చేవనీ, గత పదేండ్ల కాలంలో రొమ్ము క్యాన్సర్లు పెరిగాయని తెలిపారు. పట్టణీకరణ, నాగరికత, శారీరక శ్రమ తగ్గడం, వ్యాయమం, ఆటలు ఆడకపోవడం వంటివి ఇవి పెరగడానికి కారణాలుగా తెలుస్తున్నాయన్నారు. కుటుంబ ఆరోగ్య చరిత్రలో రొమ్ము క్యాన్సర్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచంచారు. అందరికి రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో అపోలో 50 శాతం తక్కువకే అందిస్తున్నదని చెప్పారు.
సర్జికల్ ఆంకాలజీ సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ టీపీఎస్ భండారి మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్లను నివారించలేమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 1.8 లక్షల మంది మహిళలు దీని బారిన పడుతుండగా, 2030 నాటికి ఈ సంఖ్య 2.5 లక్షలకు పెరగనుందని హెచ్చరించారు. ప్రస్తుతం డే కేర్ సర్జరీ అందుబాటులో ఉందన్నారు. రేడియాలజీ ఆంకాలజిస్ట్ డాక్టర్ రష్మీ సుధీర్ మాట్లాడుతూ 3డీ మమోగ్రఫీ వంటి ఆధునాతన ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ గంటల వ్యవధిలోనే వక్షోజాల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తున్నామనీ, తద్వారా చికిత్సలో జాప్యం లేకుండా రోగికి మేలు కలుగుతుందన్నారు.