మార్కుల మానసిక ఒత్తిడి

 తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

– ఒత్తిడి చేయొద్దంటూ సూసైడ్‌ నోట్
నవతెలంగాణ-మీర్‌పేట్‌
ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్న కాలేజీ యాజమాన్యం మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓం సాయినగర్‌ కాలనీకి చెందిన కృష్ణవేణి- ఆనంద్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎం. వైభవ్‌(16) చైతన్యపురిలోని నారాయణ కాలేజ్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని.. ఇంకా ఎక్కువ చదవాలంటూ లెక్చరర్స్‌ నుంచి ఒత్తిడి పెరిగింది. మానసిక ఒత్తిడికి గురైన విద్యార్థి.. మంగళవారం ఉదయం వైభవ్‌ సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టి.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న మీర్‌పేట్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నారాయణ కాలేజ్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే వరకు మృతదేహాన్ని తరలించబోమని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. అయితే పోలీసులు వారికి సర్దిచెప్పి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కిరణ్‌ తెలిపారు.
సూసైడ్‌ నోట్‌లో ఏం ఉందంటే..
”వైభవ్‌ అనే నేను చైతన్యపురిలోని నారాయణ కాలేజ్‌లో చదువుతున్నాను. ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని కళాశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ నాపై ఒత్తిడి పెడుతున్నారు. నా సోదరుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నారాయణ కాలేజ్‌లో చేర్చొద్దు. నా జీవితంలో ఇదే చివరి రోజు. విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేయకండి.. నా సోదరున్ని మంచి కాలేజ్‌లో చేర్పిస్తారని నేను ఆశిస్తున్నాను. అతని భవిష్యత్‌ బాగుండాలని కోరుకుంటున్నాను. సారీ మమ్మీ, డాడీ, సోదరా… సారీ టు ఆల్‌” అంటూ సూసైడ్‌ నోట్‌లో వైభవ్‌ పేర్కొన్నాడు.