– ఒకవైపు మామ గెలుపునకు ప్రచారం..
– మరోవైపు సొంత చరిష్మా పెంచుకునేందుకు దృష్టి
– వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి
– మేడ్చల్ జిల్లాను ఏలేదీ మేమే.. నెక్ట్స్ ఎమ్మెల్యే నేనే..!? అంటూ ప్రచారం
– ద్వితీయ శ్రేణి నాయకులు, కులసంఘాలకు ప్రలోభాలు
– ఏం కావాలన్నా.. ‘ఎస్‌వీఎం’కు రండి!! అని నేతలకు పిలుపు
– స్థానిక ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా నేరుగా ఎంట్రీ
– తీవ్ర అసహనంలో నాయకులు
మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడినా.. ఏ వేదిక ఎక్కినా అక్కడున్న వారంతా ఈలలు, కేరింతలు కొట్టాల్సిందే.!! ఆయన వచ్చిండంటే చాలు.. ఎంత పెద్ద ప్రోగ్రామైనా ఎంటర్‌టైనింగ్ కార్యక్రమంగా మారాల్సిందే. సభికులతో పాటు వచ్చినవారిని సంతోషంగా ఉంచడమే ఆయన పని. అసెంబ్లీ ఎన్నికలు హాట్‌హాట్‌గా మారుతున్న తరుణంలో మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గమంతా కలియ తిరుగుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రచారంలో భాగస్వామయ్యారు. అయితే ఈ సమయంలో మల్లారెడ్డి కోడలు తీవ్ర చర్చనీయాంశమవుతుండటం రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఒకవైపు మామకు మద్దతుగా ప్రచారం చేస్తూనే మరోవైపు వ్యక్తిగతంగా చరిష్మా పెంచుకునేపనిలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలను, ప్రజలను తనవైపునకు తిప్పుకునేందుకు సొంతంగానే ఎక్కడికక్కడ ప్రలోభాల పర్వానికి తెరతీశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై బీఆర్‌ఎస్ పార్టీలోని నేతల్లో ఒకటే గుసగుసలు. నెక్ట్స్ ఎమ్మెల్యే తానేనని.. మేడ్చల్ జిల్లాను ఏలేది మేమేనంటూ చెబుతుండటం సీనియర్ నాయకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ విషయం గులాబీపార్టీలో చర్చనీయాంశమైంది.
నవతెలంగాణ-బోడుప్పల్
మేడ్చల్ నియోజకవర్గంలో గట్టిపట్టున్న నాయకుడికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, బీఆర్‌ఎస్ కీలక నేతలంతా ‘హస్తం’తో జతకట్టడం, ఆ పార్టీ క్యాడరంతా ఏకతాటిపైకి రావడంతో బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లారెడ్డిలో గుబులు మొదలైంది. గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కుటుంబమొత్తం తిరుగుతోంది. ఆయన కోడలు సైతం నేరుగా రంగంలోకి దిగి ప్రజలను కలుసుకుంటున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె తన మామ మల్లారెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తుందేమోనని భావించారంతా. కానీ గత రెండువారాలుగా జరుగుతున్న తంతుచూసి స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు విస్తుపోతున్నారు.
ప్రలోభాల పర్వం.. ఎస్‌వీఎం ద్వారం
మల్లారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తూనే.. అంతకుమించి మల్లారెడ్డి కోడలు సొంత ప్రచారం చేసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సొంత టీంను ఏర్పాటు చేసుకుని స్థానిక కార్పొరేటర్లు, నాయకులకు తెలియకుండా నేరుగా ఆయా ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఘట్‌కేసర్ మండలంతో పాటు మేడిపల్లి మండలంలోని పీర్జాదిగూడ, బోడుప్పల్ నాయకులకు సమాచారం లేకుండా ఆమె వస్తుండటం స్థానిక నేతల్లో అసహనానికి దారితీస్తోంది. అసంతృప్తులు, పార్టీ బలహీనంగా ఉన్నచోట ఫోకస్ చేస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఫీర్జాదిగూడ ప్రధాన రహదారిపైనున్న ఎస్‌వీఎం గ్రాండ్ హౌటల్‌కు రమ్మంటూ పిలుపులు వెళ్తున్నాయి. కాంగ్రెస్ నాయకులను, కార్పొరేటర్‌గా ఓటమి చెందినవాళ్లను, కులసంఘాలు, కాలనీ సంఘాలను పిలిపిస్తూ వారి డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. ఇది స్థానికంగా ఉన్న నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయంగా తమను ఇబ్బందులకు గురిచేసే అంశంగా భావిస్తున్నారు. తమను సంప్రదించకుండా, కలుపుకోకుండా గల్లీస్థాయి లీడర్ల నెంబర్లు తీసుకుని నేరుగా ఫోన్లు చేయడమేంటనే అభిప్రాయం వారిలో ఉంది.
మేమున్నది సేవకేనా..?
రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఘట్‌కేసర్ లేదా మేడిపల్లి నియోజకవర్గమయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది… అక్కడ కూడా మల్లారెడ్డి కుటుంబ సభ్యులే ఫోకస్ చేస్తున్నారంటూ ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాలపై పూర్తిస్థాయి దృష్టిసారించిన మల్లారెడ్డి కోడలు.. ఏ అవసరం ఉన్నా తన దగ్గరకు రావాలని చెబుతుండటం సీనియర్ నేతలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ డాక్టర్ అయివుండి మందు పార్టీని ప్రోత్సహించడం కూడా విమర్శలకు దారి తీసింది. ఇది చివరకు ఓ స్థానిక నాయకుడిని ఇబ్బందుల పాల్జేసిందని తెలిసింది.
ఈ పరిణామాలు లోకల్ లీడర్లను నివ్వెరపరుస్తుం డగా.. తమ రాజకీయ భవితవ్యంపై ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. మంత్రి మల్లారెడ్డికి తెలిసే జరుగుతుందా అన్న సందేహాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం జీవితాన్ని ధారబోసి నిలబడితే అటు మల్కాజిగిరి, ఇటు మేడ్చల్, ఇప్పుడు ప్రీతిరెడ్డి జోక్యం.. పూర్తిగా వాళ్ల అజమాయిషీలోనే మగ్గిపోవాలా అంటూ మదనపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని మంత్రికి చెప్పడానికి కొందరు నాయకులు సాహసించడం లేదు. ఏదీఏమైనా మంత్రి మల్లారెడ్డి కుటుంబం నుంచి కోడలు జోక్యం మరో ఎంటర్‌టైనింగ్ ప్రోగ్రాంగా మారుతుందా? స్థానిక నేతలకు నష్టం జరుగుతుందా అన్నది వేచిచూడాలి.