నవతెలంగాణ – ధూల్ పేట్:
తెలంగాణ శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని ఈ నెల 3 తేదీ నుండి ప్రారంభం కానున్న అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చార్మినార్ శాసనసభ నియోజకవర్గ -66 ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిహెచ్ఎంసి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న తెలిపారు. గురువారం మొగల్ పురాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమ ఏర్పాట్లు ను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ నుండి 10 తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. మధ్యలో వచ్చే ఒక ఆదివారం సెలవు దినంగా ఉంటుందని తెలిపారు. అభ్యర్థి వెంట నలుగురు మాత్రమే కార్యాలయంలోకి నామినేషన్ వేసేందుకు రావాలన్నారు. నామినేషన్ కార్యాలయం నుండి 100 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటాయని, కేవలం అభ్యర్థికి సంబంధించిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని మిగతావారు 100 మీటర్లకు దూరంగా ఉండాలని తెలిపారు. అభ్యర్థికి ప్రతిపాదించేవారు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఓటరై ఉండాలి. అభ్యర్థి దేశంలో ఎక్కడైనా ఓటరై ఉండాలి. నామినేషన్ ఫీజు 10వేలు అని, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 5వేల రూపాయలు, కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలని తెలిపారు. నామినేషన్ గడువుకు 48 గంటల ముందు జాతీయ బ్యాంకుల్లో అభ్యర్థి ఖాతా తెరవాలని సూచించారు. తన కుటుంబ సభ్యుల పేరిట లేదా ఎలక్షన్ ఏజెంట్ పేరిట జాయింట్ అకౌంట్ ఉండవచ్చని స్పష్టం చేశారు. నామినేషన్లు వేసేటప్పుడు ర్యాలీలు ప్రదర్శనలకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి ఉండాలని చెప్పారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఒక అభ్యర్థి నాలుగు నామినేషన్ సెట్ లు వేయవచ్చని చెప్పారు. అదేవిధంగా రెండు అసెంబ్లీ స్థానాలలో కూడా పోటీ చేయవచ్చని, ఆ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని వివరించారు. అభ్యర్థులు ఏ ఫారం బీఫారం అందజేయాలని చెప్పారు. అభ్యర్థులు పై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ఏదైనా కోర్టులో శిక్షలు పడితే వాటికి సంబంధించిన వివరాలను తెలియజేయాలన్నారు. అదేవిధంగా రుణాలు వాటికి సంబంధించిన వివరాలను కూడా అందజేయాలని చెప్పారు. ఈ నెల 13న స్క్రూట్ని, 15 న ఉపసంహారణ ఉంటుందన్నారు. మొత్తం 92 భవనాల్లో 198 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పోలింగ్ కేంద్రాలలో వీడియో ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను చిత్రీకరిస్తామని చెప్పారు.
అసెంబ్లీలో ఓటర్ల వివరాలు..
చార్మినార్ నియోజకవర్గం మొత్తం 2,24,179 ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 1, 17,553 మంది, స్త్రీలు 1, 06,598 మంది.. 28 మంది థర్డ్ ట్రాన్స్ జెండర్స్ ఉన్నారని చెప్పారు.
– నామినేషన్ తో పాటు జత పర్చవలిసిన పత్రములు, సూచనలు..
1, నామినేషన్ ఫారం -2 బి. (అన్ని కాలములు పూర్తిగా నింప వలెను ).
2, రూ.10ల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన నోటరీ అఫిడవిట్ ఫారం – 26 ( అన్ని కాలంబు పూర్తిగా నింపవలెను).
3, 2 స్టాంపు సైజు ఫోటోలు (2×2.5 సెంటి మీటర్లు).
4, డిపాజిట్ పైకం రూపాయిలు 10వేలు జనరల్ కేటగిరి, రూపాయిలు 5వేలు ఎస్సి ఎస్టీ, కేటగిరి ( కుల దృవీకరణ పత్రం తో సహా )
5, పోటీ చేసే అభ్యర్థి వేరే నియోజక వర్గం నకు చెందిన ఓటరునట్లయితే సంబంధిత ఈ ఆర్వో నుండి ఓటరు ధృవీకరణ పత్రం
6, నామినేషన్ వేసే రోజుకు ఒక రోజు ముందుగా జాతీయం చేయబడిన బ్యాంకు నందు తెరిచిన బ్యాంకు అకౌంట్ వివరములు, మొదటి పేజి జిరాక్స్ కాపీ సమర్పించ వలెను.
7, జాతీయ లేదా రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయితే ఒక ప్రతిపాదిత ఓటరు.
8, ప్రతిపాదిత ఓటరు ఖచ్చితంగా ఈ నియోజక వర్గం నకు సంబందించిన ఓటరు అయి ఉండవలెను.
9, గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థులు మరియు స్వతంత్రులు గా పోటీ చేసి అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదిత ఓటర్లు (చార్మినార్ నియోజక వర్గపు ఓటర్లు గా నమోదు అయి ఉండవలెను )
10, ఫారం-26 నందలి ఐటెం 8 వర్తించు అభ్యర్థి అయితే ప్రభుత్వ బకాయిలు లేనట్లు సంబంధిత అధికారి చేత జారి చేయబడిన దృవీకరణ పత్రం.
11, గుర్తింపు పొందిన జాతీయ / రాష్ట్ర పార్టీ అభ్యర్థి అయినట్లయితే ఫారం – ఏ, ఫారం బీ లు సమర్పించ వలెను..