– కమ్యూనిస్టు యోధుడు రాఘవరెడ్డి
– ఆరు పర్యాయాలు ఎమ్మెల్యే
– డాంబికాలు లేని సాధారణ జీవితం
– అసెంబ్లీలో పిట్టకథలతో ప్రజావాణి వినిపించిన ప్రజ్ఞాశాలి
నర్రా రాఘవరెడ్డి ప్రజా జీవితం అత్యంత పారదర్శకం. కమ్యూనిస్టు యోధుడు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ప్రజల మనిషిగా.. అతి సాధారణ జీవితం గడిపారు. డాంబికాలు, అహంభావాలు లేని శాసనసభ్యునిగా ఆయన పేరొందారు. ప్రజా సమస్యలను పిట్టకథల రూపంలో శాసనసభలో లేవనెత్తి.. పరిష్కా రానికి కృషి చేశారు. ఆయన పట్ల మరెవరూ వేలెత్తిచూపేవారు కాదు. ప్రజా ఉద్యమాలే జీవితంగా బతికిన ప్రజల మనిషి. కమ్యూనిస్టు ప్రమాణాలను ప్రాణంగా భావించిన ఆదర్శమూర్తి.
నవతెలంగాణ- నకిరేకల్
నర్రా రాఘవరెడ్డి 1924 సంవత్సరంలో చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన నర్రా కమలమ్మ, రాంరెడ్డిలకు జన్మించారు. చిన్నవయసులోనే తల్లి కమలమ్మ మృతిచెందడంతో పెదనాన్న నర్రా వెంకటరామిరెడ్డి పెంచుకున్నారు. ఆ తర్వాత నర్రా బతుకుదెరువు వెతుక్కుంటూ బొంబాయికి వలస వెళ్లి బట్టల మిల్లులో కార్మికుడిగా చేరారు. కార్మికుల బాధలు తీర్చడానికి కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న లాల్ బావుట కార్మిక సంఘంలో సభ్యుడుగా చేరిన నర్రా చురుకైన పాత్ర పోషించారు. ఎనిమిదేండ్ల తర్వాత నర్రా తిరిగి సొంత ఊరు వచ్చారు. సీపీఐ(ఎం)లో క్రమశిక్షణ, పట్టుదల, కార్యదక్షిత కలిగిన నర్రా అంచలంచెలుగా ఎదిగి ప్రజాఉద్య మాలకు నాయకత్వం వహించారు. రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రాజెక్టులు, పథకాల రూపకల్పనలో ప్రభుత్వానికి నర్రా పలు సలహాలు, సూచనలు చేసి ప్రజాసంక్షేమానికి పాటుపడ్డారు.
ప్రజాప్రతినిధిగా..
1950లో సీపీఐ జిల్లా కార్యాలయ కార్యదర్శిగా పనిచేసిన నర్రా 1959 పంచాయతీ ఎన్నికల్లో చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1964 ఎన్నికల్లో తిరిగి సర్పంచ్‌గా గెలిచిన నర్రా మరోసారి జిల్లా పరిషత్‌లో ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. సీపీఐ(ఎం)పై అప్పటికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేత చర్యలకు పూనుకోగా 1964 డిసెంబర్‌లో అరెస్టయిన ఆయన 1966లో విడుదలయ్యారు. 1967 ఎన్నికల్లో తొలిసారిగా నకిరేకల్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా నర్రా రాఘవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.కమలమ్మపై గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. 1972లో జరిగిన ఎన్నికల్లో ఉగ్రవాదుల వల్ల ఓడిపోయారు. ఆ తర్వాత వెనుతిరగకుండా 1978, 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా ఐదుసార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో 1999లో శాసనసభకు పోటీ చేయలేదు కానీ, ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ అభ్యర్థి విజయానికి విశేష కృషి చేశారు.
బహుముఖ సేవలు
నర్రా రాఘవరెడ్డి కళాకారునిగా, పార్టీ నిర్మాణ బాధ్యుడిగా, ప్రజా సమస్యల్ని అధికారుల వద్ద రిప్రజెంటేషన్ చేసేవారు. 1973లో బీబీనగర్ నడికుడి రైలుమార్గం సాధనలో నర్రా ముఖ్యపాత్ర పోషించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు సాధనకు కృషి చేశారు. గీతకార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నర్రా ఎన్నికై ఎక్సైజ్ విధానానికి, కాంట్రాక్టు పద్ధతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి గుర్తింపు తెచ్చారు. గ్రామ సేవకుల సంఘాన్ని జిల్లాలో ఏర్పాటు చేసి రాష్ట్ర ఉద్యమంగా తీర్చిదిద్దడంలో నర్రా పాత్ర ఎంతో ఉంది. చేనేత కార్మిక సంఘాన్ని ముందుకు నడిపారు. గొల్ల సుద్దులు, పిట్టలదొర ఇలా అనేక కళారూపాలు ప్రదర్శించి ప్రజల ఆదరణ పొందారు.
కడవరకు ప్రజానాయకునిగా..
నర్రా రాఘవరెడ్డి తన రాజకీయ పోరాటంలో 1972లో మినహా ఎప్పుడూ అపజయాన్ని చవిచూడలేదు. సీపీఐ(ఎం) శాసనసభాపక్ష నేతగా, ఉపనేతగా పనిచేసిన నర్రారాఘవరెడ్డి నాల్గో తరగతి వరకు చదివినా చిన్ననాటి నుంచే విప్లవ భావజాలాన్ని ఒంటపట్టించుకున్నారు. ప్రపంచ రాజకీయాలను విశ్లేషించగల మేధస్సును సాధించారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించేవారు. అనారోగ్యంతో బాధపడిన నర్రా ఏప్రిల్ 9, 2017న కన్నుమూశారు. కమ్యూనిస్టు పోరాట యోధునిగా, ప్రజానాయకునిగా నర్రా రాఘవరెడ్డి జీవితం ఎప్పటికీ అందరికీ ఆదర్శప్రాయం.