‘మల్కాజిగిరి’పై స్పెషల్‌ ఫోకస్‌

'మల్కాజిగిరి'పై స్పెషల్‌ ఫోకస్‌– ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌
– త్వరలో కవిత, రాహుల్‌గాంధీ రోడ్‌ షోలు
– రసవత్తరంగా నియోజకవర్గం రాజకీయం
మల్కాజిగిరి నియోజకవర్గంపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాయి. రెండు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇరు పార్టీల అభ్యర్థులూ నిత్యం మాటల తూటాలతో ప్రజల్లో ఉంటున్నారు. ఇరు పార్టీల అగ్రనేతలతో త్వరలో ప్రచారం చేయించనుండటంతో ‘మల్కాజిగిరి’ రాజకీయం రసవత్తరంగా మారింది. త్వరలో ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రోడ్‌ షోలు కూడా ఉన్నట్టు సమాచారం.
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా రాజకీయం మొత్తం మల్కాజిగిరి నియోజకవర్గం చుట్టే తిరుగుతోంది. గడిచిన రెండు నెలల కాలంలో ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు మంత్రి హరీశ్‌రావుపై హాట్‌ కామెంట్స్‌ చేయడం, ఆ తర్వాత పార్టీ మారడంతో ‘మల్కాజిగిరి’ రాజకీయంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు నియోజకవర్గం లో పాగా వేసేందుకు మంత్రి మల్లారెడ్డి ఐదేండ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అవకాశం రావడంతో తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిపి పంతం నెగ్గించుకునేందుకు మంత్రి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మైనంపల్లి సైతం మరోసారి గెలుపు కోసం కష్టపడుతున్నారు. దీంతో ఇప్పుడు మల్కాజిగిరి రాజకీయం ‘మల్లారెడ్డి వర్సెస్‌ మైనంపల్లి’గా మారింది. ఐదేండ్లుగా మైనంపల్లి, మల్లారెడ్డి మధ్య గ్యాప్‌ ఉన్నా, పెద్దగా కనిపించలేదు. రాను రాను ఈ గ్యాప్‌ ముదిరి ఒకరిపై మరొకరు బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకున్నది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. రెండు నెలలుగా ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.
త్వరలో అగ్ర నేతల పర్యటనలు
నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే దాదాపు నియోజకవర్గం మొత్తం ఒక రౌండ్‌ ప్రచారం పూర్తి చేశారు. అయినా అక్కడక్కడా ప్రతికూల వాతావరణ పరిస్థితులు కనిపిస్తుండటంతో ఇరు పార్టీల అగ్ర నేతలను రంగంలోకి దించి బలాబలాలను నిరూపించుకునేందుకు ఇద్దరు అభ్యర్థులూ ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే రెండ్రోజుల కిందట మంత్రి హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ‘మల్కాజిగిరి’ని దత్తత తీసుకుంటా అని హామీనివ్వడంతోపాటు మర్రి రాజశేఖర్‌రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించి వెళ్లారు. త్వరలో ఎమ్మెల్సీ కవిత రోడ్‌ షో నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. నేరేడ్‌మెట్‌, ఆనంద్‌బాగ్‌, అనుటెక్స్‌ లాంటి ప్రధాన కూడళ్లలో రోడ్‌ షోలో ఎమ్మెల్సీ కవితతో మాట్లాడించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు సైతం అగ్రనేత రాహుల్‌ గాంధీతో నియోజకవర్గంలో రోడ్‌ షో లేదా భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరు గ్యారంటీలపై నియోజకవర్గం ప్రజలకు నమ్మకం కలిగించేలా రాహుల్‌ గాంధీతో స్పీచ్‌ ఇప్పించనున్నారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలతో కూడా సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ అగ్ర నేతల పర్యటనలు ఈ వారం రోజుల్లోపు పూర్తయ్యేలా ఇరు పార్టీల అభ్యర్థులూ ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచిన మల్కాజిగిరి నియోజకవర్గంలో అగ్ర నేతల రాకతో రాజకీయ సమీకరణాలు మరింత మారనున్నాయి.