ప్రజా సేవకు అవకాశం ఇవ్వండి.. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి

– నామినేషన్ సందర్భంగా సిరన్ పల్లిలో ప్రత్యేక పూజలు

నవ తెలంగాణ- నవీపేట్: ప్రజా సమస్యలను పరిష్కరించి సేవ చేసుకొనే అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి భగవంతుడితో పాటు ప్రజలను ప్రార్థించారు. ఆయన స్వగ్రామం మండలంలోని సిరన్ పల్లిలోని స్వగృహంలో  పూజలు నిర్వహించి తల్లిదండ్రుల దీవెనలతో పాటు స్థానిక హనుమాన్ ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు బోధన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో చేసిన ప్రజాసేవ కంటే మరొకసారి అవకాశం ఇస్తే మరింత సేవ చేసి చూపిస్తానని అన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యలు మరింత పెరిగాయని వాటిని పరిష్కరించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేసేందుకు బోధన్ వెళ్లారు. వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ కోసం పెద్ద సంఖ్యలో బయలుదేరారు.