
– అభివృద్ధి కి సంక్షేమానికి తేడా తెలువని వారు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు
– ఏఐఎఫ్బి అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్
– మేనిఫెస్టో విడుదల
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి జిమ్మే దారి నాదేనని నల్లగొండ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్ అన్నారు. అభివృద్ధికి,సంక్షేమానికి తేడా తెలియని వారు అనాదిగా నల్లగొండ నియోజక వర్గ ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారని ఇది నల్లగొండ దురదృష్టంని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ నియోజక వర్గ అభివృద్ధి కోసం ఆ రూపొందించిన మేనిఫెస్టోను ప్రతి గడపగడపకు చేరవేస్తానని వారన్నారు. శుక్రవారం అక్కలాయగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పిల్లి రామరాజు యాదవ్ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామరాజు యాదవ్ మాట్లాడుతూ ఈ మేనిఫెస్టో ప్రజలతో విద్యావంతులతో మేధావులతో చర్చించి రూపొందించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇంతవరకు ఏ ప్రధాన పార్టీ కూడా నల్లగొండ నియోజక వర్గంపై మేనిఫెస్టో రూపొందించలేదని వారికి ప్రజల పట్ల నియోజకవర్గం పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నాలుగైదు సంక్షేమ పథకాలను బూచిగా చూపించి ఇదే అభివృద్ధిఅని డబ్బా కొడుతున్నారని ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నల్లగొండ నియోజకవర్గ, పట్టణ అభివృద్ధి కోసం మేధావులతో ప్రజాసంఘాలను భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తానని, ఇల్లు లేని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తానని తెలియజేశారు. ప్రతి పేదింటి ఆడపిల్లకు పుస్తెమెట్టలు అందిస్తానని, నాణ్యమైన వైద్యం అందించడానికి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ప్రక్షాళన చేసి తిప్పర్తి, కనగల్, మాడుగులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు నోటు పుస్తకాలను బ్యాగులను పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన చోట నూతన భవనాలను నిర్మిస్తానన్నారు.25 ఏళ్లుగా నల్లగొండ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పెండింగ్ లో ఉందని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ అంగులతో డిజిటల్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపడతానన్నారు. తెలంగాణ వచ్చినాక నిరుద్యోగ యువత ఆగమైందని, వారికి ఉపాధి కల్పించడానికి ప్రతి ఏట స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు నిర్వహించడంతోపాటు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తానని వారన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ 120 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తానని,తెలంగాణ ఉద్యమ కాలంలో జైలుకుపోయిన ఉద్యమకారులకు కూడా 120 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తానని స్పష్టం చేశారు. సామాజిక చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రతి గ్రామంలో ఫూలే, అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తానన్నారు. భూమి లేని దళిత కుటుంబాలకు ఒక ఎకరం భూమి అయినా అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. జిల్లా కేంద్రం నుంచి మండలాలకు, మండల కేంద్రాల నుండి గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతానని పేర్కొన్నారు. వందల సమస్యలతో సమగ్రమైన మేనిఫెస్టో రూపొందించామని ప్రతి ఒక్కరికి చేరావేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ పందుల సైదులు, ఎంపీటీసీ సభ్యులు సరస్వతి సుధాకర్ రెడ్డి, కూతురు జానారెడ్డి, బుచ్చాల నాగరాజుగౌడ్, చిర్రా వెంకట్ రెడ్డి, ఆలకుంట్ల భూపాల్, నాగరాజు,పాండు, నారగోని నరసింహ, తదితరులు పాల్గొన్నారు.