దొంగకు దొంగనే సోపతి

దొంగకు దొంగనే సోపతిఇంగ్లీష్‌ల ఒక సామెత వున్నది A man is known by his friends.. అంటే మనిషి స్నేహితులు ఎవరో తెలిస్తే ఆ మనిషి గురించి తెలుసుకోవచ్చు అని. స్నేహితులు ఎక్కువ భావసారూప్యత గలవారే వుంటరు. అందుకే ‘దొంగకు దొంగనే సోపతి’ అనే సామెత పుట్టింది. ఏదన్న సమస్య వస్తే వాల్లకు వాల్లే మద్దతు తెలుపుకుంటరు. పేదరికం వల్ల దొంగతనం మొదలు పెట్టి కేసులపాలై, ఇతర పనులు దొరకక అదే ప్రవృత్తిలో వుంటరు, ఏదో ఒకటి చేయాలి కాబట్టి. ‘దొంగకు దొరికిందే చాలు’ అంటరు. ఏది దొరికితే అదే పట్టుకపోతరు. అందుకే ‘దొంగకు చెప్పే లాభం’ అంటరు. అంటే చెప్పులు మాత్రం పట్టుకపోవుడు కాదు. ఆఖరుకు చెప్పు దొరికినా తీసికుని పోవడం అన్నట్టు. ఈ వస్తువు దొంగతనాలు పూర్వకాలంలో వుండేటివి కాని ఇప్పుడు సైబర్‌ నేరాలే చేస్తున్నరు. ఏర్పడకుండ మన అకౌంట్‌లోనుండి వాల్ల ఖాతాకు పైసలు మలుపుకుంటరు. ఇలాంటి ‘దొంగలకు అందరిమీదా అనుమానమే’ అంటరు. ఊర్లల్ల దొంగ బుద్దులు ఎవలెవలకు ఉన్నాయో తెలుస్తయి. వాల్లను చూసి అందరు జగ్రత్త పడుతుంటరు. ఎందుకంటే ‘దొంగ సంగతి దొంగకే ఎక్కువ ఎరుక’. పల్లెలల్ల వీల్ల చేనుల టమాటలు, మక్కకంకులు, పండ్లు, ఫలాలు పోంగా రాంగ చెప్పక దొంగ చాటున తెచ్చుకునే వాల్లుంటరు. వాల్లకు ‘దొంగ బుద్దులోల్లు’ అనే పేరు కూడా పెడుతరు. అందుకే ‘దొంగోని చూపు అంతా ముల్లె మీదనే’ వుంటది అంటరు. ముల్లె అంటే పైసలు, ధనము కట్టినది అన్నట్టు. ఇగ వృత్తి దొంగలు కూడా వుంటరు. కొందరు సాహసకార్యంగా చేసి సక్సెస్‌ అయి ప్రవృత్తి నుంచి ఇదే వృత్తిలోకి మారుతరు. వృత్తిలోకి వచ్చిన వాల్లను చూసి మరొక సామెత వున్నది. ‘దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు’ అని. ఈ ఊరు నీది, ఆ వూరు నాది. ఎవరు హద్దుల్లో వాల్లుండాలనే నిబంధనలు. ఇదిట్ల వుండగా ‘దొంగలు పడ్డంక ఆర్నెల్లకు కుక్కలు మొరుగుతయి’ ఈ సంగతి మనందరికీ ఎరుకే.
– అన్నవరం దేవేందర్‌, 9440763479