కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పండి

– ప్రజల పక్షపాతి సీపీఎం అభ్యర్థి కనుక రెడ్డిని గెలిపించండి
– సీపీఎం రాష్ట్ర నాయకులు ఆముదాల మల్లారెడ్డి
నవతెలంగాణ-జనగామ
బూర్జువ పార్టీలైనా బిజెపి, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర నాయకులు సిద్దిపేట జిల్లా కార్య దర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంసిపిఎం జిల్లా కార్యాలయంలో జనగామ నియోజకవర్గ సీపీఎం ఎమ్మెల్యే అభ్యర్థి మోగు కనుకరెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బూర్జవ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ పాలనలో దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. ఎవరు, ఏపూట, ఏ పార్టీలో ఉంటారో తెలియదు అన్నారు.ఈ పార్టీల వారికి ప్రజలపట్ల నిబద్ధత లేదు అని విమర్శించారు.డబ్బు ప్రమేయం పెరిగిందని, ప్రజా సమస్యల పట్ల నిజాయితీ కొరబడిందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో భ్రమలు కల్పించి ఓట్లు కాజేయటం అలవాటుగా మారుతున్నది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నప్పటికీ, ప్రజల జీవితం మీద దీర్ఘకాలిక ప్రభావం చూపే వాగ్దానాలు నిలబెట్టుకోలేదు అని తెలిపారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, దళితులకు మూడెకరాల సాగుభూమి, ఖాళీ పోస్టుల భర్తీ, కనీస వేతనాల వంటి వాగ్దానాలు అమలు చేయలేదు అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెసులు సంక్షేమ పథకాలను ఓట్ల పథకాలుగా మార్చాయి అని విమర్శించారు. బీజేపీ సంక్షేమ పథకాలకే వ్యతిరేకం అన్నారు. ఉచితాల పేరుతో సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకుడే కేసు వేసారు అని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం అదే వైఖరి తీసుకున్నది అన్నారు. పేదలకు ఉపయోగపడే సంక్షేమ చర్యలు అమలు జరపాల్సిన స్కీం వర్కర్లను వదిలించుకోడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది అని విమర్శించారు. ప్రజాసంక్షేమం విషయంలో కేరళలో సీపీఐ(ఎం) నాయకత్వంలో వామపక్ష, ప్రజాతంత్ర కూటమి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు. స్వార్థ ప్రయోజనాలే తప్ప, రాష్ట్ర సమగ్రాభివద్ధి బూర్జువా పార్టీలకు పట్టదు అన్నారు. పట్టణీకరణ సమస్యలు, గ్రామీణాభివద్ధి సోయి లేదు, పరిశ్రమలు, వ్యవసాయం, విద్యా, వైద్యం, రవాణా తదితర సేవల సమగ్రాభివద్ధి ప్రణాళిక ఏ పార్టీకి లేదన్నారు. ప్రజాసమస్యల పరిష్కరానికి, రాష్ట్ర సమగ్రాభివద్ధి, ప్రజాస్వామ్య హక్కులు, లౌకిక విలువలు, రాజ్యాంగం పునాదుల పరిరక్షణ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, కేంద్ర ప్రభుత్వంతో పోరాడటానికి శాసనసభలో కమ్యూనిస్టులు అవసరం అని గుర్తు చేశారు. అందుకే సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటు వేసి సీపీఐ(ఎం) అభ్యర్థి మోకు కనకా రెడ్డి ని గెలిపించాలని కోరారు.