వీణవంక కాంగ్రెస్ లో కాక

 – మొదలైన వర్గపోరు-ఒక్కో మండలానికి ఇద్దరేసి అధ్యక్షులు
– గ్రూపులతో సతమతమవుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి
– అయోమయంలో కార్యకర్తలు- ఇబ్బందుల్లో ప్రణవ్ బాబు
నవతెలంగాణ- వీణవంక: వీణవంక కాంగ్రెస్ లో కాక మొదలైంది. గ్రూపు పోరు రోడ్డెక్కింది. దీంతో ఓ మండల అధ్యక్షుడు ఎన్నికల ప్రచార రథం దిగి వెళ్లియిన ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గతంలో కొన్నేళ్లుగా ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు లేకపోవడంతో గత ఉప ఎన్నికల తర్వాత కార్యకర్తలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే వర్గపోరు ఎక్కువవడంతో గత జులైలో మండల కేంద్రానికి చెందిన సాహెబ్ హుస్సెన్ ను మండల అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మండలంలోని ఇరు గ్రూపులు కలిసి పార్లమెంట్ ఇన్చార్జి కిష్టోపర్ తిలక్ తో పాటు జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వద్ద మొర పెట్టుకునానరు. దీంతో ఆ ఉత్తర్వులను బయటకు రాకుండా నిలుపుదల చేశారు. అలాగే గత నెల రోజుల క్రితం మళ్లీ అదే పార్టీ రాష్ష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరో ఉత్తర్వులో మామిడాలపల్లికి చెందిన చింతల రాజిరెడ్డి (శ్యాంసుందర్ రెడ్డి)ని నియమించినట్లు పేర్కొన్నారు. దీంతో వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు పోటాపోటీగా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు, మీటింగ్ లు పెట్టుకుంటూ వచ్చారు. ఈ సంఘటనలు సాధారణ ఎన్నికల సమయంలో టికెట్ల దరఖాస్తుల్లో సైతం వీరి సమస్య రాష్ట్ర స్థాయి నేతల వరకు ఫిర్యాదులు వెళ్లాయి. ఎట్టకేలకు హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రణవ్ బాబుకు కేటాయించడంతో సమస్య సద్దుమణుగుతుందని పార్టీ కార్యకర్తలు భావించారు. కానీ సమస్య రోజురోజుకు జఠిలమవుతూ వస్తోంది.

ప్రచార రథం దిగి వెళ్లిపోయిన శ్యాం సుందర్ రెడ్డి
మండలంలోని కొన్ని గ్రామాల్లో ప్రచార కార్యక్రమం జరిగినా చింతల శ్యాంసుందర్ రెడ్డితోపాటు సాహెబ్ హుస్సెన్ తానంటే తానే మండల ప్రెసిడెంట్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రచార సభలో అభ్యర్థి ప్రణవ్ బాబు ప్రచార రథంపై కార్యకర్తలనుద్దేశించి మాట్లాడే క్రమంలో ఆ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు భయటపడ్డాయి. ప్రచారం ముగిసిన తర్వాత శ్యాసుందర్ రెడ్డి అభ్యర్థి ప్రణవ్ ను సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, ప్రచారంలో సాహెబ్ హుస్సెన్ తీరుతో పాటు తన అధ్యక్ష పదవిని తక్కువ చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో వారి మధ్య కొంత వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ప్రచార రథాన్ని శ్యాసుందర్ రెడ్డి దిగి వెళ్లిపోయి కొన్ని గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదు. గమనించిన ప్రణవ్ స్నేహితుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి వెంటనే శ్యాంసుందర్ రెడ్డి వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతడితో పాటు అతడి అనుచరులు కొంతమందితో మాట్లాడారు. కొన్ని గ్రామాల ప్రచారం ముగిసిన తర్వాత మళ్లీ శ్యాంసుందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కానీ నేతల తీరుతో కార్యకర్తల్లో భయాందోళన నెలకొందని, అధిష్టానం త్వరగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించి పార్టీని కాపాడాలని పలువురు కోరుతున్నారు.