పటాన్‌చెరు సమగ్రాభివృద్ధి కోసం…

For comprehensive development of Patancheru...– పట్టణంలో ఇంటింటి ప్రచారం
– సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లికార్జున్‌కే ఓటెయ్యండి
– పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ – పటాన్‌చెరు
పటాన్‌చెరు సమగ్రాభివృద్ధి కోసం సీపీఐ(ఎం) అభ్యర్థి జె.మల్లికార్జున్‌ను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు ఓటర్లను కోరారు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన పటాన్‌చెరు పట్టణంలోని శాంతినగర్‌, శ్రీనగర్‌ కాలనీల్లో గురువారం సీపీఐ(ఎం) అభ్యర్థి జె.మల్లికార్జున్‌తో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. పటాచ్‌చెరు నియోజకవర్గం దేశంలోనే పేరుగాంచిన పారిశ్రామిక ప్రాంతమన్నారు. ఇక్కడ వేలాది మంది కార్మికులు ఉన్నారని, ఎన్నికల సందర్భంగా పాలక పార్టీలు కార్మికుల కోసం హామీలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే నాయకులు మల్లికార్జున్‌ అని చెప్పారు. మల్లికార్జున్‌ను గెలిపించుకోవడంతో కార్మికుల తరపున అసెంబ్లీలో గొంతెత్తే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) అభ్యర్థి మల్లికార్జున్‌ మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంత కార్మికులతో పాటు ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు. ఈ ప్రచారంలో నాయకులు కె.రాజయ్య, అతిమేల మాణిక్‌, ఎం.యాదగిరి, బి.నాగేశ్వరరావు, పాండురంగారెడ్డి, అనంతరావు తదితరులు పాల్గొన్నారు.