నవతెలంగాణ- అశ్వారావుపేట: చేతి వృత్తి దారులు, అసంఘటిత కష్టజీవులు పక్షాన నికరంగా పనిచేసే కమ్యూనిస్టు అభ్యర్ధులను గెలిపించడం ద్వారా వారి సమస్యలు పై చట్టబద్దంగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా 19 స్థానాల్లో ప్రస్తుతం సీపీఐ(ఎం) అభ్యర్ధులు పోటీ చేస్తున్నారని కావున వీరిని ఆదరించి ఓటు వేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట నియోజక వర్గం కార్మిక సంఘాలు బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శి బి.చిరంజీవి నేతృత్వంలో సోమవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని పలు కాలనీల్లో, మండలంలోని దబ్బ తోగు, వడ్డిరంగాపురం పురం, కోయ రంగాపురం, గుమ్మడవల్లి గ్రామాల్లో విస్త్రుత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం బాలరాజు, చిరంజీవి లు కరపత్రం పంచుతూ, గుర్తును పరిచయం చేస్తూ, సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల ప్రాధాన్యతను వివరిస్తూ, సీపీఐ(ఎం) కు ఓటు వేసే ఆవశ్యకతను వివరించారు. వారు మాట్లాడుతూ పూట కో పార్టీ, రోజు కో కండువా మార్చే నాయకులతో ప్రజలకు ఏమి ప్రయోజనం లేదని అన్నారు. ఏళ్ళతరబడి ప్రజా సమస్యలు పరిష్కారం ఎనలేని కృషి చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు గుర్తు సుత్తి కొడవలి చుక్క పై మీ అమూల్యం అయిన ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వీరన్న, మండల కమిటీ సభ్యులు ముళ్ళ గిరి గంగరాజు, సోడెం ప్రసాద్, తగరం జగన్నాధం లు పాల్గొన్నారు.