– అది భూమాత కాదు..భూమేత
– దొంగ మాటలు నమ్మితే గోస తప్పదు
– పదేండ్ల ప్రభుత్వంలో తెలంగాణ ప్రగతి బాట
– ఆటో కార్మికులకు ఫిట్‌నెస్ చార్జీలు రద్దు చేస్తాం..
– పదేండ్ల తలరాతను మార్చేది ఓటే : ప్రజా ఆశీర్వాదసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
నవతెలంగాణ-కరీంనగర్,వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/ తిమ్మాపూర్/మిర్యాలగూడ/నకిరేకల్/స్టేషన్‌ఘనపూర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే తెస్తామంటున్నది భూమాత కాదు.. అది భూమేత అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ధరణికి బదులు భూమాత పోర్టల్ పెడతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, దానివల్ల దళారీల, పైరవికారుల రాజ్యం వస్తుందని చెప్పారు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్ కన్నా దొడ్డుగా ఎత్తుగా ఉన్న వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రి అయ్యారు.. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న నల్లగొండ జిల్లాకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేదని అన్నారు. నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఇంకా తీరలేదని, నా దత్తత ఇంకా అయిపోలేదని, బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అది కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మానకొండూర్, స్టేషన్‌ఘనపూర్, జనగామ, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు.కరీంనగర్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ నడ్డివిరుస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆటోకార్మికుల పన్నులను రద్దు చేశామని, ఇప్పుడు కూడా వారు ఏడాదికి కడుతున్న ఫిట్‌నెస్ చార్జీలనూ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మానకొండూర్ నియోజకవర్గంలో ప్రతి ఎస్సీ కుటుంబానికీ దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్నమే లేదని, తినేందుకు సరిగా తిండిలేక, పశువులకూ గడ్డి లేక తెగనమ్ముకున్నామని వివరించారు. రైతుబంధును పుట్టించిందే కేసీఆర్ అని, రైతు ఎక్కడా అప్పు చేయకుండా పంట పెట్టుబడి ఇస్తున్నదీ తామేనన్నారు. ప్రగతి వైపు నిలుస్తారా? లేదంటే మునుపటి దౌర్భాగ్య రోజులు తేస్తామంటున్న కాంగ్రెస్ వైపు ఉంటారా? అన్నది ఆలోచించుకోవాలన్నారు.
ఇందిరమ్మ రాజ్యమంటే కరెంట్ లేకపోవడమా?
కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెబుతున్నారని, ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీ, ఎన్‌కౌంటర్లు జరగడం, మంచినీరు, కరెంటు లేకపోవడమేనా ? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం సక్కగుంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టిండన్నారు. రూ.2లకే కిలో బియ్యం ఎందుకిచ్చిండ్రు ? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి పేదల కడుపులు నింపారని గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ఒగ్గు కళాకారుడు చుక్కా సత్తయ్య 58 బోర్లు వేసినా ఇక్కడ చుక్క నీళ్లు పడలేదన్నారు. ‘కడియం’కు టిక్కెటిచ్చినమని, ఎమ్మెల్యే రాజయ్యను చిన్నచూపు చూడమని, మంచి పదవిలో వుంటారన్నారు. ‘ఈ ఎన్నికల్లో మనం వేయబోయే ఓటే వచ్చే ఐదేండ్ల మన తలరాతను మారుస్తుంది. మాయమాటలు ఎవరు చెబుతున్నారు? ప్రగతి బాటను ఎవరు చూపుతున్నారో? విచక్షణతో ఆలోచించాలి. పదేండ్లలో ప్రగతిబాట వేసుకున్నాం.. మళ్లీ అధికారంలోకి రాగానే ఆటోలకు ఫిట్‌నెస్ చార్జీలు రద్దు చేస్తాం..’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.