టీఆర్టీ నోటిఫికేషన్‌పై సర్కారు నిర్లక్ష్యం

– డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వివిధ రకాల ఖాళీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నదని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీంతో టీఆర్టీ నోటిఫికేషన్‌ ఇంతవరకు విడుదల కాకపోవడం వల్ల డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్ధులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు. టెట్‌ ముగిసి ఏడు నెలలు కావస్తున్నా టీఆర్టీపై ఆర్థిక, విద్యాశాఖలు దోబూచులాడుతూ నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధం లేకుండా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీఆర్టీ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.