ప్రభుత్వాస్పత్రికి తాళం వేసి నిరసన

– అందుబాటులోలేని పుల్కల్‌ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది
– ప్రమాదంలో గాయపడిన చిన్నారికి వైద్యం అందించని ప్రభుత్వ వైద్యులు
– ప్రయివేటులో చికిత్స చేయించిన బాలిక తల్లిదండ్రులు
నవతెలంగాణ-పుల్కల్‌
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన పుల్కల్‌ గ్రామంలోని ఓ కుటుంబం ఆటోలో సింగూరు గ్రామానికి వెళ్తుండగా.. ఆ కుటుంబానికి చెందిన మౌనిత(4) మార్గమధ్యలో ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు ఆ బాలికను పుల్కల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఏ ఒక్క వైద్యుడూ అందుబాటులో లేకపోవడంతో బాలిక కుటుంబీకులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆస్పత్రికి తాళం వేసి రెండు గంటలపాటు బైటాయించారు. ఈ విషయాన్ని సంగారెడ్డి డీఎంఅండ్‌హెచోవో, జిల్లా కలెక్టర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జయపాల్‌రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లకు ఫోన్‌లో వివరించారు. ఈ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించినా ఏ మాత్రం ఫలితం లేకుండా పోతోందని వాపోయారు. వైద్యులు స్పందించకపోవడంతో చేసేదేమీ లేక బాలికను సంగారెడ్డిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి ఈ ఆస్పత్రినిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.