ఆర్టీసీ సేవలను మరిచిపోలేరు

– ఎమ్మెల్యే, టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌
– ప్రముఖ గాయకులు రామ్‌ మిరియాల స్వరపరచిన ”తెలంగాణ ఆన్‌ ట్రాక్‌” పాట ఆవిష్కరణ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
ఆర్టీసీతో ప్రజలకు ఎంతో అనుబంధం ఉంటుందని, ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా ఆయా సందర్భాల్లో ఆర్టీసీ సేవలను వినియోగించుకున్న రోజులను మరిచిపోలేరంటూ టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి.సజ్జనార్‌ అన్నారు. రవాణాకు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. టీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రాముఖ్యతను వివరిస్తూ వైట్‌ థాట్స్‌ రూపకల్పనలో ప్రముఖ గాయకులు రామ్‌ మిరియాల ఆలపించిన ”తెలంగాణ ఆన్‌ ట్రాక్‌” పాటను వారు బుధవారం హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మెన్‌ మాట్లాడుతూ.. ప్రయాణీకులకు భద్రత విషయంలో ఎలా అయితే భరోసా ఇస్తున్నామో.. అలాగే ఉద్యోగుల సంక్షేమానికీ తగిన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. త్వరలో కొత్తగా 300 ఎలక్ట్రిక్‌ బస్సులు రాబోతున్నాయని, ఈ వారాంతంలో 50 కొత్త బస్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. స్లీపర్‌ కోచ్‌ ఎసీ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ.. ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన సందర్భాలు అనేకం అన్నారు. ప్రయివేటు వాహనాల వినియోగం పెరిగినా చాలా మంది ప్రజా రవాణా వ్యవస్థను ఆదరిస్తున్నారని తెలిపారు. బస్సు ప్రయాణ అనుభూతి వేరుగా ఉంటుందని, అందుకే టీఎస్‌ఆర్టీసీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ పాటను తీసుకొచ్చామని చెప్పారు. ప్రముఖ గాయకులు రామ్‌ మిరియాల మాట్లాడుతూ.. ఆర్టీసీ సేవలను పాట రూపంలో చెప్పడం చాలా ఆనందంగా ఉందని, ప్రజలందరితో ఆర్టీసీకి ఉన్న అనుబంధమే ఈ పాట అన్నారు. ఎంతో కాలంగా ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకుంటున్న ఉత్తమ ప్రయాణీకులను ఈ సందర్భంగా శాలువా, మెమెంటోతో ఘనంగా సన్మానించారు. వెంకట్‌ రామిరెడ్డి, సాయి కుమార్‌, ఎ.రాంబాబు, వేణుగోపాల్‌, జహాన్‌ బేగం, దండ భాని, మంగిలాల్‌, సుజాత, సాజీదా బేగం, ఆశన్న గౌడ్‌, గౌసుద్ధీన్‌ సన్మానం అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రవిందర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు పురుషోత్తం నాయక్‌, యాదగిరి, ముని శేఖర్‌, సీటీఎం (ఎంఅండ్‌సి) విజయ కుమార్‌, సీటీఎం ప్రసాద్‌, రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ శ్రీధర్‌, వైట్‌ థాట్స్‌ ప్రతినిధులు రాజు, ప్రదీప్‌, సుశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.