ఆ ఇద్దరు ఉంటే.. భారతే ఫేవరేట్‌!

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌పై
ఇయాన్‌ చాపెల్‌
న్యూఢిల్లీ : ప్రపంచ క్రికెట్‌ ప్రియ ప్రత్యర్థులు భారత్‌, ఆస్ట్రేలియా. ఈ రెండు జట్లు ఏ ఫార్మాట్‌లో పోటీపడినా సమవుజ్జీల సమరమే. ఐసీసీ 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌, ఆస్ట్రేలియా సమరానికి సిద్ధమవుతున్నాయి. జూన్‌ 7-11న లండన్‌లోని ది ఓవల్‌ మైదానం ప్రతిష్టాత్మక ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వేదిక. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16 సీజన్‌ ముగిసిన వెంటనే ఇరు జట్లు ఇంగ్లాండ్‌కు చేరుకోనున్నాయి. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ప్రాక్టీస్‌ లేకుండానే అంతిమ పోరులో ఢకొీట్టనున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌, ఆస్ట్రేలియా విజయావకాశాలు, ఇరు జట్లను ప్రభావితం చేయగల అంశాలపై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ ఓ వ్యాసంలో రాశారు. ‘ ఐపీఎల్‌ అనుభవం తక్కువ చేయడానికి వీల్లేదు. ప్రత్యేకించి ఐపీఎల్‌లో బ్యాటర్లకు నాణ్యమైన సాధన లభిస్తుంది. 2009లో రవి బొపార ఇది నిరూపించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక ది ఓవల్‌. ఇంగ్లాండ్‌ పరిస్థితులు ఆస్ట్రేలియాకు కాస్త అనుకూలం. పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ , జోశ్‌ హాజిల్‌వుడ్‌ పేస్‌ త్రయం భారత్‌కు సవాల్‌ విసరగలదు. మహ్మద్‌ షమి, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌లతో కూడిన భారత పేస్‌ త్రయం సైతం బాగుంది. కానీ వికెట్ల వేటలో ఆసీస్‌ త్రయం ముందుంటుంది. టెస్టుల్లో మానసిక ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుంది. గాయాల బెడదల లేని ఆస్ట్రేలియా ఈ విషయంలో మెరుగ్గా ఉంది. భారత్‌కు గాయాల బెడద ఎక్కువ. గాయాలతో విలువైన ఆటగాళ్ల సేవలను రోహిత్‌సేన కోల్పోయింది. రిషబ్‌ పంత్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా ఫైనల్‌కు అందుబాటులో ఉండి ఉంటే.. కచ్చితంగా టీమ్‌ ఇండియా హాట్‌ ఫేవరేట్‌. కానీ ఇద్దరు మ్యాచ్‌ విన్నర్ల సేవలు కోల్పోయిన భారత్‌పై ఆ ప్రభావం ఉంటుంది. శుభ్‌మన్‌ గిల్‌, అజింక్య రహానెలు ఆసీస్‌కు సమస్య సృష్టింగలరు.
భారత్‌ ఇద్దరు స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌తో బరిలోకి దిగితే.. ఆసీస్‌ ఏకైక స్పిన్నర్‌ నాథన్‌ లయాన్‌ మాయను నమ్ముకోనుంది. ఓవల్‌లో పదునైన పేస్‌ బౌలర్‌ కామెరూన్‌ గ్రీన్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యం ఆసీస్‌కు అదనపు బలం. భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య టెస్టు క్రికెట్‌ ఆడకపోటం సైతం ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ. పంత్‌, బుమ్రా, శ్రేయస్‌, రాహుల్‌ గాయాలతో దూరమయ్యారు. ఆ ప్రభావం భారత జట్టుపై ఉంటుంది. మ్యాచ్‌కు ముందు అంచనాలను ఎలాగున్నా.. మ్యాచ్‌ ఫలితం కచ్చితంగా ఆసక్తికరంగా ఉండనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ విజేతను అంత సులువుగా తేల్చలేమని’ ఇయాన్‌ చాపెల్‌ రాసుకొచ్చారు. భారత కీలక బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజారా, ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఇంగ్లీష్‌ కౌంటీ సీజన్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.