”ఏవో కొన్ని సూత్రాలను నిజం అని నమ్మి ఆగకపోతే శాంతి లేదు. మాకు తెలిసింది ఇంతే సంగతి అన్న వాళ్ళ తెలివంతా ఉత్త అలుపు, బలహీనం. ఏదో సత్యం ఉందేమో. ఇంకా మనకు తెలీదేమో” అంటారు గుడిపాటి వెంకటాచలం ‘దోషగుణం’ కథలో. కొన్ని సంఘటనల వెనుక, కథల వెనుక మనకు తెలియని ఏదో సత్యం ఉండి తీరుతుంది. దాన్ని శోధించే శక్తి మనిషికి తక్కువ. అందుకే మనల్ని నియంత్రించే శక్తులకు లొంగిపోయి స్థిరీకరించబడిన జీవితాలకు అలవాటుపడి జీవించేస్తూ ఉంటాం. అలా పేరుకుపోయిన నమ్మకాలనే జీవితానికి ఆలంబనగా ఎంచుకుంటాం. మరో సత్యం ఉంటుందన్న ఆలొచనే మనసులోకి రానివ్వం. అందుకే ఈ సమాజంలో జీవించే మనుషులు అధిక శాతం తాము ఎలా ఉండాలని ముందే ఈ వ్యవ్యస్థ నిశ్చయించిందో ఆ సూత్రాలనే స్వీకరించి, ముందు ఇబ్బందిపడి, తరువాత సర్దుకుపోయి, వాటిని తమ జీవితాలకూ అన్వయించుకుని బతికేస్తుంటారు. పైగా ఆ సూత్రాల బాటలోనే అందరూ ఉండాలని తపన పడతారు. అలా కొందరు ఉండనప్పుడు ఏదో భూగోళం విరిగి పడిపోయినంతగా అలజడికి లోనవుతారు. అలా ఈ వ్యవ్యస్థలో మానవులందరూ ఈ స్థిరీకరణ ప్రక్రియలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ భాగం అవుతారు.
చలం కథలు ఈ స్థిరీకరణ (కండిషనింగ్) ని ప్రశ్నిస్తాయి కాబట్టే వాటిని తట్టుకోవడం కష్టం. స్త్రీని ఈ వ్యవస్థ ఓ మూసలో బిగించి ఎన్నో తరాల నుండి ఆమెను ఒకే పద్ధతిలో జీవించే విధంగా కట్టడి చేస్తే, దాన్ని నీతి అని, పాతివ్రత్యం అని అందరం సమర్ధిస్తాం. అ మూసలోకి ఒదగలేని స్తీలను భరించగలిగే ఓరిమి మన వ్యవ్యస్థలో ఉండదు. ఎన్నో క్రూరమైన మానవ తప్పిదాలను మానవ పరిణామ క్రమంలో తప్పటడుగులుగా భావించే నవనాగరికత కూడా స్త్రీ విషయంలో ఎటువంటి ఓరిమీ చూపలేకపోవడం, తాము నిర్దేశించిన మార్గానికి కట్టుపడని స్త్రీని అమానుషంగా బహిష్కరించడం నేటికీ మనం చూస్తూనే ఉన్నాం.
‘దోష గుణం’ అటువంటి ఓ స్త్రీమూర్తి కథ. దీన్నే ‘గ్రహణం’ అనే పేరుతో ఇంద్రగంటి మోహనకృష్ణ 2004లో సినిమాగా తీసారు. జయలలిత, తనికెళ్ళ భరిణి, సూర్య ముఖ్య పాత్రలు పోషించారు. ఓ చిన్న ఊరిలో డాక్టర్ గా పని చేస్తుంటాడు రాఘవరాం. ఒక రోజు ఓ రోగి తన తల్లిని చీదరించుకుని తనను చూడడానికి వచ్చిన ఆమెను గెంటివెయ్యమని నర్సులతో గొడవ చేయడం అతను వింటాడు. ఆ పేషెంట్ ను సముదాయించి అతని తల్లి కన్నీళ్ళతో వార్డు దాటి వెళ్ళిపోతుంటే అమె వెనుక వెళతాడు రాఘవ. ఆమెను ఎక్కడో చూసినట్లనిపించి ఆమె ఊరు, పేరు అడుగుతాడు. ఆమె జవాబు చెప్పకుండా, మొహం కప్పుకుని వడివడిగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె చూడాలని వచ్చిన ఆ పేషెంట్ పేరు కనుకున్న రాఘవకు ఆమె ఎవరో అర్ధం అవుతుంది.
తన డాక్టర్ మిత్రుడికి ఆమె కథను వినిపిస్తాడు. కొన్ని ఏళ్ళ క్రితం శారదాంబ అనే ఆ బ్రాహ్మణ స్త్రీ ఊరందరికీ తలలో నాలుకలా పదిమంది కడుపు నింపే దేవతగా జీవించిన రోజులలోకి కథ నడుస్తుంది. శారదాంబ అందమైన ఓ బ్రాహ్మణ స్త్రీ. అమె ఇంట వారాలు చేసుకుంటూ బతికే యువకులు ఎందరో. అమెది ధనవంతుల కుటుంబం, ఆమె భర్త నారాయణ స్వామికి ఆ ఉరిలో ఎంతో పేరు, పరపతి. వీరికి వాసుదేవ అనే ఓ కొడుకు ఉంటాడు. శారదాంబను ఊరంతా గౌరవంగా చూస్తారు. ఆమె చేసే దాన ధర్మాల గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. అందరికీ తోచిన సాయం చేస్తూ ఎంతో హుందాగా బతుకు వెళ్లదీస్తూ ఉంటుంది ఆమె. ఆ ఇంట వారాలు చేసుకునే ఒక అబ్బాయి పేరు కనకయ్య. కనకయ్య చురుకైన కుర్రాడు. తెలివిగలవాడు. మంచి విద్యార్ధి అని బాగా చదువుకుంటున్నాడు అని అందరు అతన్ని ఇష్టపడతారు. అతనిపై శారదాంబకు ప్రత్యేకమైన అభిమానం. కనకయ్యకూ శారదాంబ అంటే అంతే గౌరవం. ఆమె కోసం ఏం అడిగినా చేస్తాడు. ఆమె అంటే ప్రతి నిముషం ఎంతో భక్తితో మసలుతూ ఉంటాడు. కనకయ్య అతి చిన్న అవసరాలను కూడా శ్రద్దగా గమనించి తీరుస్తుంటుంది శారదాంబ. అతనిపై ఆమె చూపే ప్రత్యేకమైన ప్రేమను అందరూ గమనిస్తారు. శారదాంబ కోసం పెద్ద చెట్లెక్కి పండ్లూ, కాయలు కోసి తేవడం నుంచి ఇంటికి సంబంధించిన చిన్న చిన్న పనుల వరకు అన్నీ చేసుకొస్తాడు కనకయ్య. మధ్యాహ్నం శారదాంబ విశ్రాంతి తీసుకునే సమయంలో ఆమె అరికాళ్లకు నూనె రాసి మర్ధన చేయడం కూడా ఎంతో భక్తిగా కనకయ్య చేస్తూ ఉండడం ఆ ఇంట పని చేసే వారందరికీ తెలుసు.
ఒక రోజు కనకయ్యను జ్వరం వస్తుంది. ఊరి వైద్యుడు ఎన్ని మందులు మార్చినా జ్వరం పెరుగుతూ పోవడంతో కనకయ్య అపస్మారక స్థితికి చేరుకుంటాడు. అతని తల్లి తండ్రులు బిడ్డ దక్కడని భయపడతారు. విషయం తెలుసుకుని తానే బండి కట్టించుకుని స్వయంగా కనకయ్య ఇంటికి వెళ్ళి వైద్యం కోసం డబ్బు సహాయం చేసి వస్తుంది శారదాంబ. ఆ మత్తులో కనకయ్య శారదాంబ పేరే కలవరిస్తూ ఉంటాడు. ఊరి వైద్యుడి మందు పని చేయట్లేదని కనకయ్య మేనమామ కొత్త పద్ధతిలో వైద్యం చేస్తున్న పక్క ఊరి వైద్యుడు గోపయ్యను పిలుచుకు వస్తాడు. పెద్ద డాక్టర్లు ఆశ వదిలేసిన రోగులను కూడా నయం చేసాడన్న పేరుంది గోపయ్యకు. గోపయ్య కనకయ్యను చూసి అతనికి దోషగుణం తగిలిందని దానికి విరుగుడు చేయకపోతే బతకడని తేల్చి చెబుతాడు.
దోషగుణం తన కన్నా పెద్ద వయసున్న స్త్రీతో సంభోగిస్తే యువకులకు వచ్చే జబ్బు. దీనికి విరుగుడు ఆ సంభోగం జరిపిన స్తీ తొడ భాగం నుండి రక్తం తీసుకొచ్చి ఆ రోగి కంట్లో ఆ రక్తపు చుక్కలు వేయడం. ఇది చేయకపోతే కనకయ్య దక్కడని అతని తల్లి తండ్రులకు చెబుతాడు గోపయ్య. ఈ మాటకు ముందు వాళ్లకు కోపం వచ్చినా, పెరుగుతున్న కనకయ్య జ్వరం, కశిస్తున్న అతని స్థితి చూసి, అతను నిద్రలో శారదాంబ పేరే కలవరించడం విని అతనికి శారదాంబకు శారీరక సంబంధం ఉందని నమ్ముతారు కనకయ్య తల్లిదండ్రులు.
ఈ విషయం ఊరంతా పాకుతూ నారాయణ స్వామి చెవికి చేరుతుంది. నారాయణ స్వామి శారదాంబను నిలదీస్తాడు. భర్త మాటల్ని ఆ అభిమానవతి భరించలేకపోతుంది. ఆమె కోపాన్ని నారాయణ స్వామి తప్పు కప్పిపుచ్చుకునే నైజంగా అర్ధం చేసుకుంటాడు. కనకయ్య తల్లి కూడా శారదాంబ దగ్గరకు వచ్చి, తన బిడ్డ ప్రాణాలు కాపాడమని, తొడ భాగం నుండి రక్తం ఇవ్వమని అడుగుతుంది. శారదాంబ అవమానంతో దహించుకుపోతుంది. కనకయ్య తల్లిని అక్కడి నుండి బైటకు నెట్టేస్తుంది. కాని నారాయణ స్వామిలో చిన్నగా మొదలైన అనుమానం పెరిగి భూతమై పోతుంది.
కనకయ్య పరిస్థితి ఇంకా ముదిరిపోవడంతో అతని తల్లిదండ్రులు, మేనమామ, వైద్యం చేస్తున్న వైద్యునితో పాటు నారాయణ స్వామి ఇంటికి వచ్చి బిడ్డను కాపాడడానికి రక్తం కావాలని పట్టు పడతారు. నారాయణ స్వామి తన అనుమానాన్ని తీర్చుకునే అవకాశం ఇదే అని నమ్ముతాడు. భార్యను కొట్టి ఆమె స్పృహ తప్పిన తరువాత ఆమె తొడ పై గాయం చేసి రక్తం సేకరించి వైద్యునికి ఇస్తాడు. ఒకవేళ ఆ రక్తంతో పని జరగకపోతే శారదాంబను నిందించినందుకు వాళ్ల అంతు చూస్తానని బెదిరిస్తాడు. ఆ రక్తం చుక్కలు కనకయ్య కంట్లో వేస్తాడు వైద్యుడు.
మెల్లిగా కనకయ్య కోలుకుంటాడు. శారదాంబ పై పడిన నింద నిజం అని పూర్తిగా రూఢి అయినట్లు భావిస్తాడు నారాయణ స్వామి. దాని ఫలితం శారదాంబ ఇంటి నుండి, ఊరి నుండి గెంటివేయబడుతుంది. జబ్బు నుండి కోలుకున్న కనకయ్య ఊరి వారి ప్రశ్నలతో జరిగినది అర్ధం చేసుకుంటాడు. కాని అతన్ని ఇప్పుడు ఎవరూ నమ్మరు. ఊరంతా శారదాంబతో అతనికి శారీరక సంపర్కం ఉందనే నమ్ముతారు. కోపంతో కనకయ్య ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.
ఈ కథ విని తానేం అనుకుంటున్నాడో చెప్పమని మిత్రుడిని అడుగుతాడు రాఘవ. కనకయ్య జ్వరం ఆ రక్తం కంట్లో వేయడంతో తగ్గింది కాబట్టి దోషగుణం నిజమే అని ఆ ఇద్దరి మధ్య సంబంధం ఉండి ఉండవచ్చని బదులిస్తాడు మిత్రుడు. ఆ జ్వరం తగ్గడం కాకతాళియం అయి ఉండవచ్చు కదా అని రాఘవ మిత్రుడిని తిరిగి ప్రశ్నిస్తూ, తానే కనకయ్యనని ఊరు వదిలి మద్రాసు చేరి పేరు మార్చుకుని అక్కడే చదివి డాక్టర్ని అయ్యానని చెబుతాడు రాఘవ. పైగా తనకూ శారదాంబకూ మధ్య ఏమీ సంబంధం లేదని కూడ స్పష్టపరుస్తాడు.
ఒక మూఢనమ్మకం కలిగించిన అనుమానం కారణంగా శారదాంబకు పేరు, ప్రతిష్ట, కుటుంబ గౌరవానికి దూరం అయి ఊరి విడిచి వెళ్ళే పరిస్థితి కలుగుతుంది. ఆ ఊరి వాతావరణంలో, తల్లిని నిరంతరం ద్వేషించే తండ్రి దగ్గర పెరిగిన శారదాంబ కొడుకు ఆ కసి, కోపంతోనే తల్లిని అసహ్యించుకుంటాడు. అందుకే తనకు జబ్బుగా ఉందని చూడవచ్చిన తల్లిని దగ్గరకు కూడా రానివ్వడు. తన కంటే ఎంతో చిన్న వయసున్న ఓ మగపిల్లవాడిపై ఇష్టాన్ని పెంచుకున్నందుకు శారదాంబ జీవితాంతం సమాజ బహిష్కరణకు గురవుతుంది. కనిపించే సత్యం మరుగున మరో కోణం ఉండి ఉండవచ్చనే ఆలోచన ఎవరికీ కలగకపోవడం, స్త్రీ లైంగికత పట్ల, స్త్రీ జీవన నియమాల పట్ల సమాజం ప్రదర్శించే ఆధిపత్య భావజాలానికి సూచన. ఆ ఆధిపత్య భావమే శారదాంబ జివితాన్ని అతలాకుతలం చేసింది.
ఆమెతో కలిసి అప్పటిదాకా ఆనందంగా జీవించిన ఆమె భర్త, ఆ భార్య ద్వారా పొందిన సౌఖ్యలనూ మర్చిపోతాడు. ఆమె పట్ల ఏర్పడిన ఒకే ఒక అనుమానం ఆమె అస్థిత్వాన్నే సమూలంగా నాశనం చేస్తుంది. ఇల్లాలుగా ఉన్న ఆమెను బజారులోకి లాగి ఆమె స్థానాన్ని ఒక్క అనుమానం అధారంగా అందరూ కూల్చివేయడం, కుటుంబంలో స్త్రీకి ఉండే రక్షణ వెనుక అసలు నిజాలను చర్చిస్తుంది.
వాసుదేవకి జబ్బు ముదిరిందన్న కబురు విని రాఘవ హాస్పిటల్ కు వెళతాడు. వాసుదేవకు వైద్యం చేస్తాడు. అతనికి ప్రమాదం తప్పిందని నిర్ధారించుకుంటాడు. అతన్ని చూడడానికి శారదాంబ మళ్ళీ ఎప్పుడన్నా హాస్పిటల్‌కి వస్తుందేమో అన్న ఆశతో ఆమెను చివరి సారి చూసిన చోటుకు వెళ్ళి కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోతాడు.
స్త్రీ లైంగికత చూట్టూ కంచెలా ఓ కాపలాకోటను పాతివ్రత్యం, ధర్మం పేరుతో నిర్మించిన పితస్వామ్య వ్యవ్యస్థలోని స్వార్ధాన్ని, అందులోని ఆధిపత్య ధోరణులను చలం ప్రతి కథ ప్రశ్నిస్తుంది. అయితే తెలుగు చిత్ర సీమలో చలం కథను ఆధారం చేసుకుని సినిమా తీసే ప్రయత్నం మాత్రం 2004 వరకు జరగకపోవడం ఆశ్చర్యం కలగచేస్తుంది. నేటికి కూడా ఎంతో ఇష్టాన్ని, ఇంకెంతో కోపాన్ని పాఠకులనుండి సరిసమానంగా అందుకున్న ఏకైక తెలుగు రచయిత చలమే. అతని స్థానం తెలుగు సాహితీ ప్రపంచంలో అచంచలం అని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా. సినిమాను పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో తీస్తూ దర్శకుడు ఓ వింత గాంభీర్యాన్ని ఈ సినిమాకు తీసుకువచ్చారు. ప్లాష్ బాక్ ను రెండో సారి మననం చేసుకుంటున్న రాఘవ నేపద్యంలో ఓ రెండు షాట్లు తప్ప సినిమా పూర్గిగా బ్లాక్ అండ్ వైట్ లో నడుస్తుంది. కొన్ని అవార్డులు, రివార్డులు, ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, తెలుగు చిత్రసీమలో స్త్రీ వాద దృక్కోణంతో వచ్చిన మంచి సినిమా. శారదాంబ పాత్రలో జయలలిత తానూ ఓ మంచి నటి అని నిరూపించుకున్న సినిమా ఇది.
– పి.జ్యోతి,
98853 84740