విజ్ఞాన వికాసాల సమాహారం మన ఊరు – మన చెట్లు

విజ్ఞాన వికాసాల సమాహారం
మన ఊరు - మన చెట్లుసమాజం నుంచే సాహిత్యం పుట్టుకొస్తుంది. సామాజిక కోణంలో వచ్చిన సాహిత్యం సమాజంపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వృత్తుల ధ్వంసం, మానవీయ సంబంధాల విధ్వంసం జరుగుతుంది. దీనిపై చాలా సాహిత్యం వచ్చింది. అందులోని కథలు ప్రముఖ పాత్ర పోషించాయి. నేడు సమాచార విప్లవంతో ‘రిలయన్స్‌ రిలేషన్స్‌’ పెరిగిపోయి.. ‘రియల్‌ రిలేషన్స్‌’ తగ్గిపోతున్న కాలంలో పిల్లలకు, ప్రకృతికి మధ్య రిలేషన్‌ ఏర్పడితేనే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. తెలంగాణ సాహితి అకాడమీ తలపెట్టిన ‘మన ఊరు – మన చెట్లు’ అనే ప్రకృతి యజ్ఞం సమాజానికి బాల సాహిత్యకారులను అందించింది. ఏకకాలంలో 5 లక్షల మంది విద్యార్థులతో చెట్లకు అక్షర నీరాజనాలు పలికించింది.

అనగనగా కథలు.. బాల్యంలో సృజనను పెంచే మాలికలు.. అమ్మమ్మ, బామ్మా.. తాతయ్యలు లేని చిన్న కుటుంబాల్లో చిన్నారుల చింత తీర్చేది బాలసాహిత్యమే. చిన్ననాడు చందమామ, బాలమిత్ర సాహిత్య పఠనంతో పెద్దయ్యాక సృజనాత్మక రచన చేస్తున్న వారెందరో వున్నారు. పిల్లల పట్ల ప్రేమతో రాసినవే నాడూ నేడూ మేలైన కథలు. భాషపై మమకారం పెంచేది బాలసాహిత్యమే. బాలసాహిత్యం అంటే పిల్లల గురించి పెద్దలు రాసే సాహిత్యంగా ఇప్పటి వరకు ఉన్న ముద్రను చెరిపేస్తూ మేము సైతం మీకు తగ్గట్టు సాహిత్య సృజన చేయగలమని కథలు రాసి నిరూపించారు బడి పిల్లలు. ఇది బాల సాహిత్యవేత్తలు నిజంగా గర్వించదగ్గ సందర్భం. ఎందుకంటే పిల్లలు వీరి సాహిత్య వారసులు కాబట్టి.
పసివాళ్లుగా బడిలో ప్రవేశించే పిల్లలు బడి వదిలే సమయానికి భవిష్యత్తు జీవితానికి కావలసిన ప్రాథమిక జ్ఞానాన్ని నేర్చుకుంటారు. చుట్టూ ఉన్న సమాజం గురించి అవగాహన చేసుకుంటారు. తమదైన వ్యక్తిత్వాన్ని కూడా ఏర్పరచుకుంటారు. ఈ అడుగులు నేర్పిన టీచర్ల ప్రభావం వారి జీవితాలపైన ఎంతగా ఉంటుందో మనకు తెలుసు. అమ్మా, నాన్నలు చెప్పినదానికంటే టీచర్‌ చెప్పిన మాట పిల్లలకి వేదవాక్కు. పొద్దున్నుంచీ సాయంత్రం వరకు తోటి పిల్లలందరితో కలిసిమెలిసి బడిలో గడిపిన బాల్యపు రోజులు ఎవరికైనా అద్భుతమైనవే.
”మొక్కై వంగనిది మానైవంగునా” అన్నట్టు పిల్లల పసి హృదయాల్లో ప్రకృతిపై ప్రేమను కల్పిస్తే ఆ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. చెదిరిపోదు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించి ఎవరైనా ప్రోత్సాహం అందిస్తే ఆ చిన్నారులు అద్భుతాలు చేయగలరు. అందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ చేసిన అక్షర యజ్ఞమే అతి పెద్ద నిదర్శనం. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్‌ సంకల్పానికి పిల్లల ప్రేమికుడు, పిల్లలు ఏ చిన్న పని చేసినా సంతోషపడే గరిపెల్లి అశోక్‌ తోడవడంతో ఈ కథల యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. పిల్లల చేతిలో కథలు బంగారంలా నగిషీలు దిద్థుకున్నాయి.
ఐదు లక్షల మంది పిల్లలు ఏకకాలంలో ఈ మహోత్సవంలో పాల్గొన్నడం సామాన్యమైన విషయం కాదు. ఇంతమంది పిల్లల ఊహాశక్తి, సృజన తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప సంపద. ఆదిలాబాద్‌ మొదలుకొని మహాబుబ్‌నగర్‌ వరకు తెలంగాణ రాష్ట్రమంతా 33 జిల్లాల బడి పిల్లలు కథా ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ‘మన ఊరు – మన చెట్లు’ బాలల కథల పుస్తకాలను 33 జిల్లాల వారీగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించింది. పిల్లలు రాసిన ఈ కథలు చదువుతుంటే వారి సృజన అందరినీ అబ్బుర పరిచింది. చెట్లపై 1016 కథలు వచ్చాయి. అవన్నీ కూడా వేటికి అవే ప్రత్యేకం. ఒకొక్క విద్యార్థి ఆలోచన ఎంతో గొప్పగా ఉంది. ఈ కథలకు చదివించే గుణం కూడా ఉంది.
అపురూపమైన పుస్తకాల్లోని ప్రతి అంశం చదువరి గుండెలను తాకుతుంది. కథాంశంపై వస్తువు, శిల్పం, ప్రారంభం, ముగింపు ఎలా ఉండాలన్న స్పష్టత ఉంది. టీచర్‌ను అడిగి తెలియని విషయాలు తెలుసుకోవడాన్ని కూడా కథలుగా మలిచారు. అడవుల నరికివేత వలన కలిగే నష్టాలు చెప్పారు. చెట్లు పెంచడం వలన కలిగే ప్రయోజనాలను తెలిపే కథలున్నాయి. కబ్జాకోరుల స్వార్ధాన్ని ప్రశ్నించే కథలున్నాయి. కథకు చివరిలో కవిత్వంతో ముగించే కథలున్నాయి. పర్యావరణ ఇతివృత్తంపై చెప్పిన కథలు, సైన్స్‌ కథలు, సైన్స్‌ టీచర్‌కు విద్యార్థులకు మధ్య జరిగే ఆసక్తికరమైన చర్చ ఇలా వేటికి అవి విన్నూతమైనవి.
తన పాఠశాల, తన ఊరు, ఊళ్లో చెట్లు, వాటి చుట్టూ అల్లుకున్న అనుభూతులను జోగులాంబ గద్వాల జిల్లా 8వ తరగతి విద్యార్ధిని నందిని పంచుకుంటే, చెట్లు నరకడం వలన కలిగే అనర్ధాలను తన సైన్స్‌ టీచర్‌ నుంచి తెలుసుకోవడాన్ని కథగా మలిచింది ఖమ్మం జిల్లా విద్యార్ధిని గద్దపాటి రాజశ్రీ. మంచిర్యాల జిల్లా విద్యార్ధి మారుపాక చెన్నకేశవ్‌ చెట్ల మధ్య వైరుధ్యాలు ఉంటే ఎలా ఉంటుందని తెలియజేస్తాడు. కామారెడ్డి జిల్లా గర్గుల్‌ విద్యార్థి లోకోటి వినరు పచ్చని గుట్టను త్వవి ఊరిని స్మశానంగా మారుస్తారా అని తన కథలో ప్రశ్నిస్తాడు. అంటే పిల్లలలో అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉందని అర్థం అవుతుంది. ఆ కథ ఇతివృత్తం, నడిపిన తీరుకు నిజంగా హేట్సాఫ్‌ చెప్పాలి.
మెదక్‌ జిల్లా విద్యార్ధిని డి.మహేశ్వరి చెట్ల గురించి తన తండ్రికి ఉన్న అపోహలు తొలగించడాన్ని కథగా మలిచింది. అదే జిల్లాకు చెందిన మరో విద్యార్ధిని కె.రేవతి చెట్లకు కోపంవస్తే ఏం జరుగుతుందో తెలుపుతుంది. భార్యాభర్తలిద్దరూ తమ తమ తల్లిదండ్రులను ప్రేమగా చూడాలే కానీ, తేడాలు చూపకూడదని చక్కని సందేశాన్ని ఇస్తుంది. రంగారెడ్డి జిల్లా విద్యార్ధిని బి.రమ్య చెట్లు నరికిన వారు ఎలాంటి శిక్ష ఉంటుందో తన కథలో తెలుపుతుంది. వనపర్తి జిల్లా ఇంగ్లీష్‌ మీడియం ఆరో తరగతి విద్యార్ధిని మేఘన తన ‘చెట్టు తల్లి’ కథలో ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య జరిగే సంభాషణను కథగా మలిచింది. చెట్లు లేని భవిష్యత్తును ఊహించడం చాలా కష్టం. అలాంటిది తల్లిదండ్రులు లేని ఒక చిన్నారి కొత్తగా వేస్తున్న రోడ్డు కారణంగా చెట్లను తొలగించడాన్ని ప్రశ్నించింది తన కథలో ఖమ్మం జిల్లాకు చెందిన డి.శ్రావణి. ఇలా 33 జిల్లాల విద్యార్థులు రాసిన కథలను పుస్తకరూపంలో తీసుకురావడం తెలంగాణ సాహిత్య అకాడమీ చేసిన చాలా గొప్ప పని. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతుంటే విద్యార్థులు సాహిత్య సృజన చేస్తారు. ఎప్పుడైతే పిల్లల ఆలోచన మారుతుందో అప్పుడు మంచి సమాజం అభివృద్ధి చెందుతుంది.
మనం ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి చెట్లే వస్తాయి. బాల్యం నుండే మంచి సాహిత్యం అందిస్తే, మంచి వ్యక్తిత్వం గల బాలలు తయారవుతారు. చందమామ అలాంటి సాహితీ సేద్యం చేసింది. దానివల్ల మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు బతికాయి. ఇప్పుడు చందమామ లేదు. బాలసాహితీవేత్తలే ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ క్రమంలో మరో అడుగు ముందుకు వేసిన తెలంగాణ సాహిత్య అకాడమీ వెయ్యి మంది బాల కథకులను తీసుకువచ్చింది. ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో కూడా ఈ పుస్తకాలు అనువాదం అవడం గొప్ప విషయం. ఈ కృషి అభినందనీయం.
– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417

Spread the love