ఈ లోకంలో నిజంగా దేనికి గ్యారంటీ వుందో కాని మనుషులకు గ్యారంటీ మీద నమ్మకం గ్యారంటీ. గ్యారంటీ అన్నమాట వింటే చాలు చాలామందికి కొండంత ఆనందం కలిగే మాట గ్యారంటీగా గ్యారంటీ.
ఓ అబ్బాయి వున్నాడు. అబ్బాయి గదిలో వున్నాడు. గదిలో టేబిల్ వుంది. టేబిల్ మీద కంప్యూటర్ వుంది. దానిమీద స్క్రీన్ వుంది. అది వెలుగుతూ వుంది. గోడ గడియారం పన్నెండు గంటలు బాదింది. కొడుకు గదిలో లైటు వెలుగుతుండడం చూసి తండ్రి గది తలుపుల దగ్గర నిలబడి ”ఇంకా పడుకోలేదురా! ఎంతసేపు చదువుతావు!’ అన్నాడు. కొడుకు చదవడం లేదు, చూస్తున్నాడు. అతను చూస్తున్న దృశ్యం తండ్రి చూస్తే చావగొట్టడం గ్యారంటీ. కానీ ఆ కుర్రాడు కంగారుపడకుండా ”చదవాలి కద డాడీ. ఈసారి తప్పక పాసు గ్యారంఈ” అన్నాడు. ”ఇంతగా చదివేస్తున్నావు. పాసు కాదురా, ఫస్టుక్లాసు గ్యారంటీ అనాలి” అంటూ వెళ్లిపోయేడు తండ్రి, కొడుకు ఫస్టుక్లాస్ కొట్టేస్తాడని గ్యారంటీగా నమ్ముతూ.
ఒక బట్టల షాపు. షాపు నిండా బట్టలున్నాయి. బట్టలకంటే ఎక్కువ మనుషులున్నారు. చీరల కౌంటర్లో రంగురంగుల చీరలున్నాయి. అనేక గాజుల చేతులు వాటిని పైకీ కిందకీ ఊపి చూస్తున్నాయి. కౌంటర్‌లో వున్న పాపం మగాడు చీరల రంగుకి గ్యారంటీ ఇస్తున్నాడు. మన్నికకు మరీ మరీ గ్యారంటీ ఇస్తున్నాడు. కానీ ఒకదాని తర్వాత ఒకటిగా అనేక చీరలు మడతలు విప్పిచి గుట్టలుగా పేరుకున్న చీరల్లో గ్యారంటీగా తమకేదీ నచ్చదని చెప్తున్నారు, షాపువాడి గ్యారంటీని గ్యారంటీగా నమ్మడం లేదు వాళ్లు. వాళ్లని తన దగ్గర చీరలు గ్యారంటీగా బాగున్నాయని నమ్మించడానికి చెమటలు కక్కుతున్నాడు షాపువాడు.
బట్టల షాపులోనే కాదు మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు, ఫ్రిజ్జులు అమ్మే షాపుల్లోనూ గ్యారంటీ అనేది గ్యారంటీగా ఉపయోగించబడుతుంది. కిరాణాషాపుల్లో కూడా గ్యారంటీ అనే మాటనే అందరూ గ్యారంటీగా నమ్ముతారు. ఎవరు ఏ వస్తువు కొన్నా గ్యారంటీ వుందా, గ్యారంటీ ఎంత? అనే కదా ముందస్తు గ్యారంటీగా అడిగేది. ‘అగ్ మార్క్’, ‘ఐఎస్‌ఐ’, ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ’ అనే మాటలకు అసలు అర్ధం ఏమిటి? గ్యారంటీగా గ్యారంటీ అనే కదా. జ్యూలరీ షాపుల్లో అయితే అంతా గ్యారంటీ మీదే సాగుతుంది. గ్యారంటీ అనగా నమ్మకం. నమ్మకమే గ్యారంటీ కదా. గ్యారంటీయే బంగారం కద.
అప్పులవాడు ఇంటి మీదికి వచ్చాడు. మీదికి అంటే ఇంటి లోపలికి అన్నమాట. వడ్డీ కట్టలేదేమని మీసం మెలేశాడు. బాకీ పడ్డవాడికి అంతకంటే పెద్ద మీసం వుంది. అయితే బాకీ పడ్డవాడు గనక మీసం తిప్పడానికి వీల్లేదు. తను గనక బొద్దుమీసం వుంది కదా అని మీసం మెలేస్తే అప్పిచ్చినవాడు ‘ఇన్‌సల్ట్’గా భావించడం గ్యారంటీ. ఆ తర్వాత గ్యారంటీగా అంత ఎత్తున ఎగిరిపడ్డం కూడా గ్యారంటీ. అందువల్ల బాకీపడ్డవాడు వినయంగా చేతులు జోడించి ‘ఈ నెల కొంచెం టైట్‌గా వుందన్నా, వచ్చే ఫస్టుకి తప్పకుండా ఇచ్చేస్తా, పూవుల్లో పెట్టి ఇస్తా, పూల ఖర్చు నాదే’ అంటాడు. ‘ఈసారికి వదిలేస్తున్నా ఫస్ట్‌నాడే వస్తా. గ్యారంటీగా ఇస్తావా? ఇస్తావని గ్యారంటీ ఏమిటి’ అంటాడు మళ్లీ మీసం తిప్పుతూ అప్పిచ్చినవాడు. ‘గ్యారంటీ అన్నా. ఒట్టు అన్నా’ అంటూ తల మీద చెయ్యి పెట్టుకుంటాడు బాకీ పడ్డవాడు. ‘అవాళ ఇవ్వకపోయావా, నీ కాళ్లు విరగ్గొట్టడం మాత్రం గ్యారంటీ’ అంటూ వెళ్లిపోతాడు. గ్యారంటీ ఇచ్చిన బాకీ పడ్డవాడు అప్పులవాడు వెళ్లిపోయాక మీసం దువ్వుకుంటాడు, బాకీ పడ్డవాడి మీసానికి విలువలేదని మనసులో అనుకుంటూనే.
ఆసుపత్రి వుంది. ఆసుపత్రిలో మంచాలున్నాయి. మంచాల మీద మూలుగులున్నాయి. ఆ మూలుగుల తాలూకు మనుషులున్నారు. డాక్టర్లున్నారు, నర్సులున్నారు. ఆసుపత్రి అంతా మందుల వాసన వుంది. ఏడ్చేవాళ్లున్నారు, ఏడవని వాళ్లు కూడా వున్నారు. ఓ బెడ్డు మీద పేషెంటున్నాడు. పక్కన భార్యా, తమ్ముడూ, కొడుకూ వున్నారు. డాక్టర్ నవ్వుతూ పేషెంట్ కనపడని గుండె చప్పుడు స్టెత్‌తో విన్నాడు. పేషెంట్ మాత్రం నవ్వలేదు. పక్కన వున్నవాళ్లు కూడా నవ్వలేకపోయారు. డాక్టర్ గదిలోకి వెళ్లాడు. ఎక్స్‌రే రిపోర్టు చూస్తూ కూచున్నాడు. పేషెంట్ తాలూకా వాళ్లు వచ్చారు. ఈసారి డాక్టర్ నవ్వలేదు. ఆపరేషన్ చెయ్యాల్సిందేనన్నాడు. ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్పాడు. పేషెంట్ భార్య చీరచెంగుతో కళ్లు వత్తుకోసాగింది. ఆమెను బయటకు పంపించి వచ్చాడు కొడుకు. ఆపరేషన్ చేస్తే బతుకుతాడా గ్యారంటీగా అనడిగాడు తమ్ముడు, గ్యారంటీ అనే మాటను బాగా బలంగా ఒత్తి పలుకుతూ. ‘గ్యారంటీయా… గ్యారంటీ ఎలా ఇవ్వగలం? ఆపరేషన్ మాత్రమే మేం చేస్తాం. గ్యారంటీ సంగతి పైవాడికే తెలియాలి. మా చేతుల్లో కత్తులూ, కటార్లు, బిల్లులూ తప్ప మరేం వుండవు’ అన్నాడు డాక్టర్. ఎంత ఖచ్చు పెట్టినా గ్యారంటీగా గ్యారంటీ ఇవ్వలేమన్నమాట’ గట్టిగా చెప్పేశాడు. ఈ లోకంలో దేనికైనా గ్యారంటీగా గ్యారంటీ ఇవ్వగలరెవ్వరైనా కాని ప్రాణాలకు మాత్రం గ్యారంటీగా గ్యారెంటీ ఇవ్వలేరు ఎవరూ అంటూ ఆకాశంలోకి చూశాడు తమ్ముడు గ్యారంటీ ఇచ్చేవాడు అక్కడ కనబడతాడేమోనని.
ఈ ఎన్నికల్లో నేను గెలిచి తీరుతాను. నాకు టిక్కెట్టు ఇవ్వాల్సిందే అన్నాడు ఎనభైదాటిన ‘చిన్నవాడు’. ఇదివరకు చాలాసార్లు గెలిచిన గ్యారంటీ వున్నదతని దగ్గర. సిట్యుయేషన్ అర్ధం కావడం లేదు తమకు అంటూ నసిగాడు ‘బిఫామ్’ ఇచ్చేవాడు. నా సంగతి నీకు తెలీదు. యాభైయేళ్ల అనుభవం ఇక్కడ. ఎలాగైనా గెలిచితీరుతా గ్యారంటీ ఇస్తున్నా గ్యారంటీగా’ అన్నాడాయన. ఆయనే కాదు, చాలామంది నాయకులు భక్తి చూపి, భయపెట్టీ, అలిగి, కోప్పడి, తిట్టి, కొట్టినంత పనిచేసి టికెట్లు కొట్టేస్తారు గ్యారంటీగా గెలుస్తామని గ్యారంటీ ఇచ్చి.
కుర్రాడు బాల్కనీలో నిలబడి ప్రహరీ గోడవైపు చూస్తున్నాడు. గోడమీద ఓ పిల్లి అటూ ఇటూ అసహనంగా తిరుగుతున్నది. కుర్రాడు ‘మమ్మీ ఈ గోడమీది పిల్లి ఇటువైపు దూకుతుందా లేక అటువైపా? అనడిగాడు. మమ్మీ అన్నది… ‘ఆ పిల్లి అటువైపు దూకదు, ఇటువైపే దూకుతుంది గ్యారంటీగా’ అంది. ‘గ్యారంటీగానా అదెలా?’ అన్నాడు కుర్రాడు. ‘గోడకు ఆవైపు ఇంట్లో డాబర్ మ్యాన్ వుంది అందుకే అది గ్యారంటీగా ఇటే దూకుతుంది’ అన్నది తల్లి. పిల్లి ఇటే దూకింది. ఆమె ఇచ్చిన గ్యారంటీ గ్యారంటీ అయింది.
మనుషుల జీవితంలో గ్యారంటీకి ఇంత చరిత్రా, భూగోళం వుందా అనే ‘డవుటు’ వద్దు. ఈ లోకమే గ్యారంటీ చుట్టూ గ్యారంటీగా తిరుగుతున్నది. ఆరంటే ఆరు గ్యారంటీలు ఇచ్చి జనాన్ని నమ్మించి ఒక పార్టీ రాష్ట్రాన్ని ఏలబోతున్నది. కనుక గ్యారంటీని గ్యారంటీగా నమ్మాల్సిందే. ఆ ‘గ్యారంటీలకు గ్యారంటీ వుందా?’ అని మాత్రం అడగకండి.
– చింతపట్ల సుదర్శన్
9299809212