సింగిల్ విండో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న చైర్మన్

నవతెలంగాణ – మంథని
పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో పంటకు మేలు జరుగుతుందని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి జీలుగ బస్తాలు వచ్చిన సందర్భంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ సోమవారం మాట్లాడుతూ,మన సంఘమునకు 417 జీలుగ బస్తాలు వచ్చినట్లు తెలిపారు.పచ్చిరొట్ట ఎరువుల వాడకం వల్ల భూ సాంద్రత అధికంగా పెరిగి పంటకు మేలు జరుగుతుందని అన్నారు. లోతట్టు,చవుడు భూముల్లో నేలకు సత్తువ కలిగించేందుకు జీలుగ విత్తనాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆయన అన్నారు. పంటల్లో అధిక దిగుబడుల సాధనకు పచ్చిరొట్ట ఎరువులు జీవామృతంలాగా ఉపయోగపడుతాయని,అన్ని రకాల నేలల్లో పచ్చిరొట్ట పైర్లసాగు వానాకాలం తొలకరితో విత్తేందుకు అత్యంత అనువుగా ఉంటుందని ఆయన అన్నారు.మంథని సహకార సంఘంలో 417జీలుగ విత్తన బస్తాలు అందుబాటులో ఉన్నాయని,సబ్సిడీ పోను రైతు రూ.850 చెల్లించి 30కిలోల జీలుగ విత్తన బస్తా పొందవచ్చని తెలిపారు.జీలుగ విత్తన బస్తాలు కావాల్సిన రైతులు తమ యొక్క ఆధార్ కార్డు,పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ సమర్పించి జీలుగ విత్తన బస్తాలు పొందాలని ఆయన కోరారు.