రష్యా వ్యవసాయంలో కృత్రిమ మేథ!

Artificial intelligence in Russian agriculture!మాస్కో: కృత్రిమ మేథతో స్వయం చాలకంగా నడిచే ట్రాక్టర్లను రష్యా వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టినట్టు, ‘కోగ్నిటివ్‌ పైలట్‌’ పేరుతో ఇది జరుగుతున్నట్టు టాస్‌ వార్తా సంస్థ రిపోర్టు చేసింది. కృత్రిమ మేథ ఆధారిత సాంకేతికతతో తయారైన కోగ్నిటివ్‌ ఆగ్రో పైలట్‌ స్వయం చాలక డ్రైవింగ్‌ వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదని ఈ సాంకేతికతను తయారు చేసిన కంపెనీ ప్రకటించింది. స్వయంచాలకంగా నడిచే ట్రాక్టర్‌ తనకుతానే భూమిని దున్నటంవల్ల వ్యవసాయోత్పత్తి 25శాతం పెరుగుతుందని, 20శాతం నుంచి 40శాతం వరకు ఎరువులు, విత్తనాలు ఆదా అవుతాయని సదరు కంపెనీ తెలిపింది. కోగ్నిటివ్‌ పైలట్‌ సాంకేతికతతో ఇప్పటివరకు 23లక్షల ఎకరాల భూమిని దున్నినట్టు కంపెనీ ప్రెస్‌ సర్వీస్‌ టాస్‌ వార్తాసంస్థకు వివరించింది. మార్చి నుంచి నవంబర్‌ మధ్యకాలంలో 312 ట్రాక్టర్లకు కోగ్నిటివ్‌ ఆగ్రో పైలట్‌ వ్యవస్థను బిగించి వ్యవసాయ క్షేత్రాలను దున్నించటం జరిగిందని టాస్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఇలా చేయటంవల్ల ఒక్కో 1000 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో రైతుకు 28700 డాలర్లు(దాదాపు 23లక్షల రూపాయలకు సమానం) ఆదా అవుతుంది. మొత్తంగా చూస్తే 448కోట్ల రూపాయల(56మిల్లియన్‌ డాలర్లు) వరకు రైతులకు వ్యయం తగ్గింది. రష్యాలో ట్రాక్టర్లకు ఇంతటి స్థాయిలో కృత్రిమ మేథను ఉపయోగించటం ఇదే తొలిసారని కోగ్నిటివ్‌ పైలట్‌ సిఇఓ ఓల్గా ఉస్కోవా ప్రకటించింది. 2019 నవంబర్‌ నెలలో రష్యా ప్రభుత్వ సబర్‌ బ్యాంక్‌, కోగ్నిటివ్‌ టెక్నాలజీస్‌ సంస్థ కోగ్నిటివ్‌ పైలట్‌ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రవాణా, వ్యవసాయ రంగాలలో కంప్యూటర్‌ విజన్‌, కృత్రిమ మేథను ఉపయోగించి సాంకేతికతలను అభివృద్ధి చేయటంలో ఈ కంపెనీకి ప్రావీణ్యత ఉంది. ఈ ఒప్పందం ప్రకారం సబర్‌ బ్యాంక్‌ కోగ్నిటివ్‌ టెక్నాలజీ కంపెనీలో 30శాతం వాటాను తీసుకుంటుంది. మిగిలిన 70శాతం వాటా సదరు కంపెనీ స్థాపకులకు, ఆ కంపెనీ మేనేజ్‌మెంటుకు ఉంటుంది. 2022 నుంచి రష్యా ఆర్థిక వ్యవస్థలోని ప్రముఖ వ్యూహాత్మక కంపెనీల్లో కోగ్నిటివ్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఒకటిగా ఉంది. ఈ కంపెనీ ఉత్పత్తులు రష్యాలోనే కాకుండా మరో 12దేశాల్లో ఉపయోగిస్తున్నారు. ఈమధ్యకాలంలో రష్యా అతి పెద్ద ఆహార ధాన్యాల ఎగుమతిదారుగా ఎదిగింది. 2000సంవత్సరం నుంచి ప్రపంచ గోదుమ మార్కెట్‌ లో రష్యా వాటా నాలుగు రెట్లు పెరిగింది. రానున్న సంవత్సరాలలో కూడా రష్యా తన ఆధిక్యతను నిలబెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.