తీవ్ర మతతత్వం దిశలో మోడీ సర్కార్‌

తీవ్ర మతతత్వం దిశలో మోడీ సర్కార్‌పంచతంత్రమంటూ మీడియా నామకరణం చేసిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మార్కు రాజకీయ వ్యూహాలు మరింత తీవ్రమవడం యాదృచ్చికం కాదు. గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ బీసీ, ఎస్టీ, బ్రాహ్మణ ముఖ్యమంత్రు లను ఎంపిక చేసి తన తరహా సామాజిక తంత్రం అమలు ఒక వైపు, మూల సిద్ధాంతమైన మౌలిక హిందూత్వ రాజకీ యాలు మరో వైపు జోడు వ్యూహాలుగా పరిగెత్తించాలని మోడీ అమిత్‌ షా నడ్డా త్రయం హడావుడి పెంచింది. వాస్తవానికి శాసనసభ ఎన్నికల పోరాటంలోనే హిందూత్వ అస్త్రాన్ని గరిష్టంగా ఉపయోగించడం దేశప్రజలు గమ నించారు. అదే సమయంలో ఆశించిన మేరకు ఆ రాష్ట్రా ల్లో ప్రధాన ప్రత్యర్థిగా వున్న కాంగ్రెస్‌ ఆశించిన మేరకు విశాల లౌకిక వేదిక ఏర్పాటు చేయలేకపోవడం బీజేపీ వ్యూ హాలకు తోడైంది. ఆఖరుకు తప్పక గెలుస్తామన్న ఛత్తీస్‌గఢ్‌ కూడా కాంగ్రెస్‌ చేజార్చుకుంది. అయితే ఈ విజయాల ప్రభావాన్ని ఆ రాష్ట్రాలకే పరిమితం చేయడం పొరబాటవుతుంది. దక్షిణాదిన తెలం గాణలో కాంగ్రెస్‌ గెలిచినా బీజేపీ మూలపీఠాల్లాంటి కీలకమైన పెద్ద రాష్ట్రాలను కాపాడుకోవడం మోడీ బృందానికి కొమ్ములు తెచ్చింది. ఈ స్వల్పకాలంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ బృందం ఎంత పకడ్బందీగా రాజకీయం నడిపేది తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలోనే బీజేపీ నేతలు అయోధ్యకు ఉచిత బస్సులు వేయించడం, ఉచిత దర్శనం వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆలయ సంప్రోక్షణ సందడి సాగుతున్నది. ఆలయాన్ని గురించి నిరంతర వార్తలు నిండిపోతున్నాయి. వచ్చిన విరాళాలలో రూ.3 వందల కోట్లు మిగిలాయంటూ హిందూత్వ కూటమి వనరుల సమృద్ధిని చెప్పకనే చెబుతున్నారు. మరో వైపున ఇదే సమయంలో కాశ్మీర్‌లో ఆక్రమిత కాశ్మీర్‌ విముక్తి గురించి లోక్‌సభలో చర్చ తెచ్చి నాటి పుల్వామా, సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తరహా వాతావరణానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
కాశ్మీర్‌ తీర్పు, నెహ్రూపై దాడి
2019 లోక్‌సభ ఎన్నికల తరుణంలో అయోధ్య తీర్పు వచ్చి నట్టుగా 2024 ఎన్నికల తరుణంలోనే సుప్రీం కోర్టులో కాశ్మీర్‌ 370 రద్దు తీర్పు రావడం కూడా వారికి బాగా కలసి వచ్చినట్టు చెప్పాలి. స్వయంగా దేశ ప్రధాని ఆ తీర్పు వచ్చిన రోజునే దేశంలోని అన్ని భాషల పత్రికల్లోనూ దాన్ని స్వాగతిస్తూ వ్యాసం రాయడమే దీనికి నిదర్శనం. చారిత్రాత్మకమైనదేదో జరిగినట్టు సాధించినట్టు చూపించడమే ఆ వ్యాసం లక్ష్యం. మీడియా వాడకం ఏ స్థాయిలో వుందో దీన్ని బట్టి విదితమవుతుంది. నిజానికి కాశ్మీర్‌పై తీర్పు రాష్ట్రాల హక్కులపై గొడ్డలి పెట్టులాంటిది. ఇప్పుడు ఏ రాష్ట్రాన్నయినా కేంద్రపాలితం చేసేందుకు, విడగొ ట్టేందుకు కేంద్రానికి ఏకపక్ష అధికారం సంక్రమించినట్టే. ఇప్పటి వరకూ కనీసం ఆ రాష్ట్ర శాసనసభకు తెలియపర్చాలన్న నిబంధనైనా వుండేది. భవిష్యత్తులో ఆ శాసనసభను రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టిన సమయంలోనే రాష్ట్రాల విభజన ప్రతిపత్తి మార్పు చేయొ చ్చన్నమాట. సమాఖ్య విధానానికి పూర్తి విరుద్ధమైన ఈ తీర్పు బీజేపీ కోరుకునే కేంద్రీకృత ఆధిపత్యానికి చాలా అవసరం. కాశ్మీర్‌పై సభలో ఆమోదించిన శాసనం సుప్రీంలో వచ్చిన తీర్పు కలగలిపి తామేదో దేశం కోసం గొప్ప విజయం సాధించినట్టు చెప్పుకోవడం తదుపరి వ్యూహంగా వుండబోతుంది. ఇప్పటికే సోషల్‌ మీడి యాలోనూ, ఛానళ్లలోనూ ఆవిధమైన చర్చ మొదలైంది కూడా. ఎవ రైనా ఇందుకు భిన్నంగా ఆ తీర్పు లోతుపాతులు, కాశ్మీర్‌ చరిత్ర పూర్వపరాలు చెప్పబోతే వెంటనే వారు దేశద్రోహులు తదితర ముద్రలు సిద్ధం చేయబడ్డాయి. తన వ్యాసంతో మోడీ స్వయంగా అందుకు రంగం సిద్ధం చేశారు. తీర్పు రావడానికి ముందే పార్లమెం టులో నెహ్రూ కాశ్మీర్‌కు ద్రోహం చేశాడని అమిత్‌ షా పెద్ద ప్రచారం ఎత్తుకున్నారు. వాస్తవానికి దేశ విభజన సమయంలో కాశ్మీర్‌ మన వైపునే వుండేలా చేయడంలో నెహ్రూ నుంచి షేక్‌ అబ్దుల్లా వరకూ ఎంత రాజనీతిని ప్రదర్శించారో దానంతటినీ తప్పుగా చిత్రించేందుకు చాలా పెద్ద ప్రయత్నం జరుగుతున్నది. మీడియా సోషల్‌మీడియాలో ఇందుకోసం టన్నుల కొద్ది విషం కుమ్మరిస్తున్నారు.
ఆలయాల రాజకీయం
హిందీ రాష్ట్రాల ఫలితాల తర్వాత మౌలిక హిందూత్వ ఎజెండా వేగం పెంచుతారని పరిశీలకులు సరిగానే వూహించారు. ఇందుకు కాశ్మీర్‌ తీర్పుపై హడావుడి ఒకటైతే మందిరాల రాజకీయం మరొకటి. అయోధ్యకు యాత్రీకుల తరలింపు దాని గురించి స్థానికంగా ప్రచా రం రకరకాల రూపాల్లో భాగస్వాములను చేయడం జరుగుతున్నది. అందుకు దానమిచ్చిన దాతల వివరాలు చాలా ప్రముఖంగా ప్రచా రమవుతున్నాయి. ఫలానా వారికి అక్కడ పూజల్లో స్థానం లభించిందనీ, ఫలానా వారికి ఆహ్వానం వచ్చిందనీ ఏవేవో కథలు చలామణి అవుతున్నాయి. అయోధ్య కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోడీ పాల్గొన డంలో బహుముఖ రాజకీయముంది. ఈ లోగా యూ పీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆ ప్రాంతాల న్నిటా బుల్‌డోజర్‌ న్యాయమంటూ రాజకీయ వ్యతిరేకు లపై విరుచుకుపడుతూ విపరీత ప్రచారం పొందుతు న్నారు. అయోధ్యకు తోడు కాశీ మధుర కూడా సుప్రీం కోర్టును చేరాయి. వారణాసిలో గ్యాన్‌వ్యాపీ మసీదులో తవ్వకాలకు వివిధ రూపాల్లో అనుమతినిచ్చిన న్యాయ వ్యవస్థ ఇప్పుడు మదురలో కృష్ణ జన్మస్థానం పేరిట ఈద్గా మసీదు లోనూ తవ్వకాలకు అనుమతినిచ్చింది. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు మసీదును కృష్ణ జన్మభూమి శిథిలాల మీద కట్టారా లేదా అని తేల్చేందుకు ఈ తవ్వకాలు దారితీస్తాయంటు న్నారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తే సాంకేతిక కారణాలతో స్టే ఇవ్వడానికి నిరాకరించింది. వారణాసి విషయంలో గతంలోనే వివాదం పరాకాష్టకు చేరింది. ఆరెస్సెస్‌, బీజేపీలు ముందుకు తెచ్చిన మూడు ప్రార్థనా మందిరాల వివాదాలు మోడీ పాలనా కాలంలోనే మాట్లాడుకున్నట్టు ఒకే విధమైన ముగింపునకు దారి తీయడంలో ఆశ్చర్యం లేదు. ప్రత్యక్షంగా చేయలేనిది పరోక్షం గానూ చేయరాదన్నది న్యాయసూత్రాల్లో ముఖ్యమైంది. అయితే ఈ సూత్రాన్ని తలకిందులు చేయడంలో ఈ సర్కారు ఆరితేరింది. అందుకే తన వ్యూహాన్ని అటూఇటూ తిప్పి అమలు చేస్తుంది. అందుకు అన్ని వ్యవస్థలను దుర్వినియోగ పరుస్తుంది. దానికి మతం నమ్మకం ముద్రవేస్తుంది. కేరళలోని శబరిమలైలో గతంలో మహిళలను అనుమతించే విషయమై దుమారం లేవనెత్తేందుకు దుస్తంత్రాలు పన్ని విఫలమైన పరివార్‌ ఇప్పుడు మరో విధంగా వివాదం రగిలించేందుకు తంటాలు పడుతున్నది. భక్తుల సదుపా యాల లోపమంటూ పినరాయి విజయన్‌ సర్కారుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నది.హైదరాబాద్‌లో భాగ్యలక్ష్మి ఆలయ రాజకీయాలు ఏపీలో టీటీడీపై లేనిపోని వివాదాలు అన్నీ ఈ మత వ్యూహాలలో భాగంగానే చూడవలసి వుంటుంది. తమిళనాడులో సనాతనధర్మం వివాదం ఒకటైతే పూజారుల నియామకం, మంత్రుల వ్యాఖ్యానాలు ఏదో ఒక సాకుతో మతపరమైన ఉద్రిక్తత పెంచడం పరిపాటిగా మారింది. రాజకీయంగా చొరబడలేని దక్షిణా దిలో మతం కార్డు మరింత ఎక్కువగా ఉపయోగించడం ఒక ఎత్తు గడ. తెలంగాణలో ఓట్లు సీట్లు పెరగడం ఒక ముందంజగా చెప్పుకుంటున్న బీజేపీ త్వరలోనే మరోసారి కేంద్రీకరించ బోతున్నది. తెలంగాణ బీఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత అయోధ్య రామమందిరంపై భక్తి ట్వీట్‌ పెట్టడం, కాంగ్రెస్‌ నాయకులు కొందరు తామూ రామ మందిరానికి విరాళాలి చ్చామని గొప్పగా ప్రచారం చేసుకోవడం కూడా రాజకీయ ప్రయోజనాల కోసమేనా అన్న సందేహాలున్నాయి.
పార్లమెంటుపైనే దాడి
సరిగ్గా ఇలాటి తరుణంలోనే పార్లమెంటులో ఆగంత కుల ప్రవేశం, పొగ వదలడం దేశాన్ని కలవరపరిచింది. మాట్లాడితే దేశ భద్రత రక్షణ అనే బీజేపీ అగ్రనేతలు ఈ విషయమై నిగూఢ నిశ్శబ్దం పాటిస్తున్నారు. ప్రధాని స్పందించలేదు. హోంమంత్రి సభలో సమగ్ర ప్రక టన చేయలేదు. ఆగంతకుడు సాగర్‌శర్మ మైసూరు బీజేపీ ఎంపి ప్రతాప సింహ సిఫార్సుపైనే వారు లోపలకి వచ్చారని వివరాలు వెల్లడైనా అధికార పార్టీ అందుకు బాధ్యత తీసుకోలేదు. సాగర్‌ శర్మ ప్రతి కదలికనూ తాను పర్యవేక్షణలో వుంచానని చెప్పిన ఆ ఎంపీ అసలెలా ఎందుకు అనుమతినిచ్చారు? వారిని భద్రతా సిబ్బంది ఎందుకు ఆపలేకపోయారు? ఆ సమయంలోనే బయట కూడా అలజడి ఎందుకు అనుమతించారు? వీటిలో వేటికీ జవాబు లేదు. వారు నియంత్రృత్వం నశించాలని నినాదమిచ్చారని, నిరుద్యోగంపై నిరసన తెలిపారని కథనాలు వస్తున్నాయి. అవన్నీ ఒకటైతే అసలు వారికి అంత తేలిగ్గా అవకాశం ఎలా వచ్చింది? దీన్ని పారదర్శకంగా తేల్చకుండా ఇప్పుడు వారు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు కూటమికి చెందిన వారని ఇప్పుడు పాట ఎత్తుకున్నారు.వారిని పంపింది బీజేపీ ఎంపీ అయితే ఇతర పార్టీలను నిందించడం ఎలా కుదురుతుంది? ఏది ఎలా వున్నా రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వం, భద్రతా విభాగం కదా? అత్యున్నతమైన పార్లమెంటులో ఇంత వైపరీత్యం జరిగితే బాధ్యత తీసుకుని ప్రకటన చేయని హోంమంత్రి టీవీ చర్చల్లో మాత్రం ప్రతిపక్షాలపై నిందలు గుప్పించారు. దీన్ని తీవ్ర ఉల్లంఘనగా తీసుకోవలసిన స్పీకర్‌ ఓం బిర్లా అంతా నేనే చేయిస్తానని నెత్తిన వేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా బీజేపీ బృహత్‌ వ్యూహంలో భాగాలుగా కనిపిస్తే చేయగ లిగింది లేదు. రైతు ఉద్యమ సమయంలోనూ ఒక పంజాబీ నటుడు ఎర్రకోటపై ఏదో చేశాడని గగ్గోలు పెట్టారు. మరి తనను ఎందుకు అనుమతించారనేదానిపై జవాబు లేదు.ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు కూడా కాస్త ముందుగా ఫిబ్రవరిలోనే జరిపించాలనుకోవడం, దాని కన్నా ముందే ఎన్నికల సంఘం నియమాక సూత్రాలను కూడా రాజ్యాంగ సవరణ చేయడం అన్నీ రాజకీయ ఉద్దేశాలతో జరిగినవే. ప్రజా సంఘాలనూ, ప్రతి పక్షాలనూ దేశభద్రతకు ముప్పుగా చూపించడం, లౌకిక శక్తులపై మతపరమైన దుష్ప్రచారం చేయడం సంఘ పరివార్‌ వ్యూహంలో కీలకాంశాలుగా వున్నాయి. వారిని ఎదుర్కొనే మహాశక్తిగా తనను తాను చూపించుకోవడానికి పన్నిన పన్నాగాల్లో భాగాలుగా ఇవన్నీ కనిపిస్తే ఆశ్చర్యపోవలసింది లేదు. ఎన్నికల నాటికి ఇవి మరింత ముదరడం ఖాయం. అవకాశవాదంతో ఈ తరహా మత వ్యూహాలకు వంతపాడే పార్టీలకు మేలు కన్నా కీడే జరుగుతుంది. కాకపోతే ఈ క్రమంలో దేశ లౌకిక సంప్రదాయాలు మత సామరస్యం పునాదులు దెబ్బతినకుండా చూడటం పెద్ద సవాలు.
తెలకపల్లి రవి