అదానీ చేతికి ‘ఐఎఎన్‌ఎస్‌’ న్యూస్‌ ఎజెన్సీ

అదానీ చేతికి 'ఐఎఎన్‌ఎస్‌' న్యూస్‌ ఎజెన్సీ–  మెజారిటీ వాటా స్వాధీనం
న్యూఢిల్లీ: భారత మీడియా కార్పొరేట్‌ గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోతో0ది. అంబానీ, అదానీలు పోటా పోటీ గా కొనుగోళ్లు చేస్తున్నాయి. అదానీ గ్రూపు మీడియా రంగంలో తాజాగా ఐఎఎన్‌ఎస్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌ న్యూస్‌ ఎజెన్సీలో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసి స్వాధీనం చేసుకుంది. ఇదే విషయాన్ని అదాని ఎంటర్‌ప్రైజెస్‌ శనివారం రెగ్యూలేటరీ సంస్థలకు వెల్లడించింది. గతేడాది మార్చిలో బిజినెస్‌, ఫైనాన్షియల్‌ న్యూస్‌ అందించే క్వింటిలియన్‌ బిజినెస్‌ మీడియాను కొనుగోలు చేసి మీడియా రంగంలోకి ప్రవేశించిన అదాని.. ఇటీవల ఎన్‌డిటివిని ఒత్తిడి చేసి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్‌డిటివిలోని 65 శాతం మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. తాజాగా అదానీ గ్రూప్‌నకు చెందిన ఎఎంజి మీడియా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌ ద్వారా 50.50 శాతం వాటాను కొనుగోలు చేసింది. కాగా.. ఎంత మోత్తానికి ఈ వాటాను స్వాధీనం చేసుకున్న విషయం వెల్లడించకపోవడం గమనార్హం. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో ఐఎఎన్‌ఎస్‌ ఆదాయం రూ.11.86 కోట్లుగా నమోదయ్యింది. తాజా ఒప్పందంతో ఇకపై ఐఎఎన్‌ఎస్‌ కార్యకలా పాలు, నిర్వహణ వ్యవహారాలను ఎఎంఎన్‌ఎల్‌ చూడనుంది. ఆ సంస్థలో కొత్త డైరెక్టర్లను నియమించనుంది. మరోవైపు డిస్నీ ఇండియాను స్వాధీనం చేసుకోవడానికి ముకేష్‌ అంబానికి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ వేగంగా కసరత్తు చేస్తోంది. రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18, డిస్నీ హాట్‌స్టార్‌ ఇండియా సంస్థల విలీనానికి సంబంధించి చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై ఇరు సంస్థలు ఓ అవగాహనకు రాగా.. వచ్చే ఏడాది జనవరి నాటికీ విలీన ప్రకటన వెలువడే అవకాశం ఉందని రిపోర్టులు వస్తోన్నాయి. ఒప్పందం ఖరారు అయితే డీస్నిలో రిలయన్స్‌ వాటా 51 శాతానికి చేరుకుంటుంది.ప్రస్తుతం డిస్నీకి చెందిన స్టార్‌ ఇండియాకు 77 న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానళ్లు ఉండగా.. వయాకామ్‌కు 38 ఛానళ్లు ఉన్నాయి. డిస్నీకి డిస్నీ హాట్‌స్టార్‌, రిలయన్స్‌కు జియో సినిమా స్ట్రీమింగ్‌ వేదికలు ఉన్న విషయం తెలిసిందే.