ముంబయి : భీమా కోరేగాన్ కేసులో నిందితుడిగా ఉన్న మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్‌లాఖాకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుపై గౌతమ్‌కు బెయిల్ ఇస్తూ జస్టిస్ గడ్కరీ, జస్టిస్ దిగేతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు మూడు వారాల గడువు ఇస్తూ బెయిల్ ఆదేశాలపై స్టే ఇచ్చింది. బెయిల్ ఉత్తర్వులపై ఆరు వారాల పాటు స్టే ఇవ్వాలని అంతకుముందు కోర్టును ఎన్‌ఐఏ కోరింది. 2018లో పూనే సమీపంలోని ఓ గ్రామంలో చెలరేగిన కుల ఘర్షణల కేసులో గౌతమ్ ప్రమేయమున్నదని అభియోగాలు మోపారు. హింసకు కుట్ర పన్నారన్న ఆరోపణపై గౌతమ్ సహా 16 మందిని అరెస్ట్ చేశారు. గౌతమ్‌ను 2018 ఆగస్టులో అరెస్ట్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ని గత సంవత్సరం నవంబర్ 19 నుండి గృహనిర్బంధంలో ఉంచారు. తన ఆరోగ్యం సరిగా లేదని, జైలులో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని గౌతమ్ పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గౌతమ్ బెయిల్ పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టు గతంలో రెండుసార్లు తోసిపుచ్చింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితులైన హక్కుల కార్యకర్తలు అరుణ్ ఫెరైరా, వెర్నన్ గాన్‌సాల్వ్స్, ఆనంద్ తెల్తుంబ్డే, రచయిత వరవరరావు, న్యాయవాది సుధా భరద్వాజ్‌కు ఇప్పటికే బెయిల్ లభించింది. గిరిజన హక్కులపై ఉద్యమించిన స్టాన్‌స్వామి కస్టడీలోనే చనిపోయిన విషయం తెలిసిందే.