నేడు లండన్‌కు భారత క్రికెటర్లు

– ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌
ముంబయి : ఐసీసీ 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సన్నద్ధత కోసం భారత క్రికెటర్లు నేడు ఉదయం లండన్‌కు బయల్దేరనున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ప్లే ఆఫ్స్‌కు చేరని ఆరు జట్లకు ఆడుతున్న క్రికెటర్లు నేడు తొలి విడతగా ఇంగ్లాండ్‌కు చేరుకోనున్నారు. పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, శార్దుల్‌ ఠాకూర్‌ సహా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ లండన్‌కు వెళ్లనున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌లో మోకాలి గాయానికి గురయ్యాడు. అతడు లండన్‌కు మరో 2-3 రోజుల్లో చేరుకునే అవకాశం ఉంది. ఇక ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం తొలి విడత బ్యాచ్‌తో కలిసి లండన్‌కు వెళ్లటం లేదు. అతడు కూడా కోహ్లితో కలిసి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్లే ఆఫ్స్‌లో ఆడుతున్న భారత క్రికెటర్లు ఐపీఎల్‌ ఫైనల్‌ అనంతరం మే 29న ఇంగ్లాండ్‌కు బయల్దేరనున్నారు. ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్న చతేశ్వర్‌ పుజార అక్కడితో జట్టుతో ఈ వారాంతంలో కలునున్నాడు. రిజర్వ్‌, నెట్‌ బౌలర్లు ముకేశ్‌ కుమార్‌, అనికెత్‌ చౌదరి, ఆకాశ్‌ దీప్‌, యర్రా పృథ్వీ రాజ్‌లు సైతం నేడు రాహుల్‌ ద్రవిడ్‌, సహాయక సిబ్బందితో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నారు. భారత్‌, ఆస్ట్రేలియా నడుమ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జూన్‌ 7-11న లండన్‌లోని ది ఓవల్‌ మైదానంలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఇక ఆడిడాస్‌ జెర్సీలు : భారత క్రికెట్‌ జట్టు అధికారిక జెర్సీ భాగస్వామిగా ప్రముఖ స్పోర్ట్స్‌వేర్‌ బ్రాండ్‌ ఆడిడాస్‌ వ్యవహరించనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత క్రికెటర్లు ఆడిడాస్‌ జెర్సీలతోనే బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోమవారం ట్విట్టర్‌ వేదికగా తెలిపాడు.