– రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
– కొడుకు మృతి తెలిసి బయలుదేరిన కుటుంబీకులకూ ప్రమాదం
– క్రిస్మస్ పండుగ నాడు నిడమనూరులో మృత్యుఘోష
– అంతా ఒకే కుటుంబీకులు
నవతెలంగాణ- నిడమనూరు
తెల్లవారితే క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆశపడిన బతుకుల్లో చీకటి కమ్మేసింది. రాత్రివేళ పొగమంచు దారులను మూసేయడంతో దగ్గరికి వచ్చే వరకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం.. అతివేగం వల్ల ప్రమాదాలు జరిగి ఆరుగురు ప్రాణం కోల్పోయారు.ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢ కొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన ఆ ద్విచక్ర వాహనదారుని కోసం ట్రాలీ ఆటోలో బయలుదేరిన కుటుంబీకులను లారీ ఢకొీట్టడంతో అక్కడికక్కడే నలుగురు ప్రాణం కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
ఈ ఘటనలు నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
పెద్దవూర మండలం పుల్యా తండాకు చెందిన రమావత్ నాగరాజు(28) కుటుంబీకులు సోమవారం క్రిస్మస్ సందర్భంగా చర్చికి వెళ్లాలనుకున్నారు. దాంతో ఆదివారం రాత్రి సుమారు 10 గంటలకు నాగరాజు మిర్యాలగూడ నుంచి హాలియా వైపు ద్విచక్ర వాహనంపై అతివేగంగా వస్తున్నాడు. వెంపాడ్ స్టేజీ వద్ద కిరాణా దుకాణం నడుపుతున్న బలుగూరి సైదులు రోడ్డు దాటుతుండగా నాగరాజు ద్విచక్ర వాహనం ఢకొీట్టింది. దీంతో సైదులు(55) అక్కడికక్కడే మృతిచెందాడు. రమావత్ నాగరాజు తలకు తీవ్ర గాయం అవడంతో 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
మృతదేహాన్ని చూసేందుకు వస్తూ… కుటుంబ సభ్యులూ మృతి
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నాగరాజు కోసం హైదరాబాద్ నుంచి కుటుంబసభ్యులు, బంధువులు హుటాహుటిన టాటా ఏసీ ట్రాలీ వాహనంలో బయల్దేరారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో నిడమనూరు మండల కేంద్రం పరిధిలోని చౌదరి హోటల్‌కి సమీపంలోకి రాగానే.. మిర్యాలగూడ నుంచి హాలియా వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఆటోను ఢకొీట్టింది. అందులో ప్రయాణిస్తున్న రమావత్ పాండ్య(40), రమవాత్ గణ్యా(40), రమావత్ బుజ్జి(38), రమవత్ కేశవులు(19) అక్కడికక్కడే మృతిచెందారు.
మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హాలియా సీఐ గంది నాయక్, ఎస్‌ఐ గోపాల్ రావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మండలంలో ఒకే ప్రాంతంలో గంటల వ్యవధిలో ప్రమాదాలు జరిగి ఒకే కుటుంబీకులు ఐదుగురు మృతిచెందడంపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుల్యా తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.