డెడ్‌ స్టోరేజ్‌లో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు

– 517 అడుగులకు పడిపోయిన నీటి మట్టొం గతేడాది 530 అడుగులకుపైగా నీరు
–  నేటికీ ఎగువ నుంచి రాని వరద
– దుక్కులు దున్ని.. నార్లు పోసుకొని రైతుల ఎదురుచూపు
–  ఏటా 2 నుంచి 3 టీఎంసీలు తగ్గుతున్న నీటి నిల్వ సామర్థ్యం
నవతెలంగాణ- నాగార్జునసాగర్‌
సాగర్‌ నుంచి ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేసే అవకాశాలు ఇప్పట్లో కానరావడం లేదు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కనీస నీటి మట్టానికి చేరువలో ఉంది. గతేడాది జులై 20న 530 అడుగులకు పైగా నీరు నిల్వ ఉండటంతో సాగునీటికి ఎలాంటి ఢోకా లేదు. గతేడాది జులై 20న శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 55 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం పై నుంచి వరద లేక.. సాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 517 అడుగుల వద్ద ఉన్నది. ఇది 144.0402 టీఎంసీలకు సమానం. జలాశయం గరిష్టస్థాయి నీటిమట్టం 510 అడుగులు కాగా, 7అడుగులు తగ్గితే డెడ్‌ స్టోరేజ్‌కి వెళ్తుంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాల్లేకపోవడంతో కృష్ణానది పరివాహక ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులో సైతం నీటిమట్టం పడిపోయింది.
నాగార్జునసాగర్‌ ఎడమకాలువ రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైతులు నార్లు చల్లుకున్నారు. బోర్లు, బావుల కింద ఉన్న రైతులు ముందస్తుగానే నార్లు పోసుకొని నాటుకు సిద్ధమవుతున్నారు.
కాగా ఏ ఆధారం లేని రైతులు సాగర్‌ కాల్వల నీరు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 23 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీనితోపాటు హైదరాబాద్‌ జంట నగరాలకు తాగునీటి అవసరాలు కూడా తీర్చుతోంది. అలాంటిది ఇప్పుడు డెడ్‌ స్టోరేజ్‌కు చేరువకావడం ఆందోళన కలిగిస్తోంది.
గతేడాది జులై 20న ప్రాజెక్టుకు వరద
గతేడాది భారీ వర్షాల కారణంగా జులై 20వ తేదీన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 55 వేల క్యూసెక్కుల వరద నీరు నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌లోకి వచ్చి చేరింది. అదే నెల 28వ తేదీన ఎడమ కాల్వకు మంత్రి జగదీశ్‌ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది జులై గడుస్తున్నా సరైన వర్షాల్లేక.. నీటి నిల్వలు అడుగంటిపోయాయి. గట్టి వానలు పడి కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వస్తేనే జలాశయంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. అప్పటిదాకా సాగర్‌ ఆయకట్టు కాలువలకు నీరు విడుదల చేసే పరిస్థితి లేదు. దీంతో వానాకాలం సాగు ఆలస్యం అవుతున్నది. జులై మొదటి వారంలో యేటా వరి నారు పోసుకొని ఆగస్టులో నాట్లు వేసేవారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. మరోవైపు ఇక్కడ వరి సాగు తప్ప మెట్ట పంటలు పండే పరిస్థితి లేదు.
రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని పొలాలను చదును చేసి పెట్టుకొని నీటి కోసం ఎదురుచూస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు ఎడమకాల్వ పరిధిలో మొత్తం 6.50లక్షల ఎకరాలు ఉండగా.. అందులో నల్లగొండ జిల్లాలో 1,45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో ఎత్తిపోతలతో కలుపుకుని 2,41,000 వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది.
ఏటేటా తగ్గుతున్న నీటి నిల్వ సామర్థ్యం
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ఏటేటా పూడిక పేరుకుపోయి రెండు నుంచి మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. పూడికపై మేధావులు, నిపుణులు హెచ్చరిస్తున్నా పాలకులు కనీసం పట్టించుకోవడం లేదు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు కలిగిన ప్రాజెక్టు నేడు 300 టీఎంసీల నీటి నిల్వకే పరిమితమైంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం పడిపోతోందని ఇప్పటికే నిపుణులు నిర్ధారించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే 2010లో ఏపీ ఇంజినీర్స్‌ లేబోరేటరీ ఆధ్వర్యంలో సర్వే చేశారు. అప్పట్లో శాటిలైట్‌ ద్వారా ఈ పరిశీలన చేశారు. ఆ సర్వే రిపోర్ట్‌ ప్రకారం కేవలం 312 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకోగలుగుతున్నట్టు నిర్ధారించారు. సుమారుగా 100 టీఎంసీల వరకూ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని ధృవీకరించారు. ఏటా పూడిక వల్ల 2 నుంచి 3 టీఎంసీల వరకూ నీటి నిల్వ తగ్గిపోతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. రిజర్వాయర్‌ పరిసరాల్లో కూడా మట్టి పేరుకుపోతున్న తరుణంలో డ్యామ్‌, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు నష్టం వస్తుందని, తగిన సాంకేతికత ఉపయోగించి పూడిక తగ్గించేందుకు ప్రయత్నించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
కొనసాగుతున్న స్పిల్‌వే పనులు
ప్రాజెక్టు స్పిల్‌వే దశాబ్దకాలంగా మరమ్మతులకు గురవుతోంది. దీంతో నాలుగు నెలలుగా గుత్తేదారులు చేపడుతున్న పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జులై చివరి నాటికి స్పిల్‌ వే పనులను పూర్తి చేస్తామన్న అధికారులు చేయించలేకపోయారు. శుక్రవారం నుంచి 8వ రేడియటల్‌ క్రస్ట్‌ గేట్‌ వద్ద పడిన గుంతలను పూడుస్తున్నారు. కొన్ని క్రస్ట్‌ గేట్ల వద్ద పెద్ద, పెద్ద గుంతలు అలాగే ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగమవ్వడంతో స్పిల్‌ వే పనులకు కూలీలు దొరక్క కొంత జాప్యం జరుగుతోంది.

Spread the love