– నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ రాష్ట్ర విద్యుత్ అభివృద్ధి కార్పొరేషన్ (జేకేఎస్‌పీడీసీ)కు, రాజస్థాన్ ఊర్జ వికాస్ అండ్ ఐటీ సర్వీసెస్ లిమిటెడ్‌కు మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ తెలిపింది. ఈ ఒప్పందం విషయంలో వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయాలని, ఇది జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుందో వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కాలపరిమితి గరిష్టంగా 20 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ ఒప్పందం 40 సంవత్సరాల పాటు అమలులో ఉండేలా సంతకాలు చేశారు. ముందుగా నిర్ణయించిన ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తారు. అయితే ఆ ధర ఎంతో తెలియదు. ఈ ఒప్పందం ద్వారా తమ వనరులను కొల్లగొడతారేమోనని కాశ్మీర్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు’ అని ఆ ప్రకటనలో వివరించారు. ఈ నెల 3వ తేదీన రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ రాజస్థాన్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఉన్న రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ నుండి విద్యుత్ కొనుగోలుకు ఈ ఒప్పందాన్ని ఉద్దేశించారు. రాష్ట్రం తీవ్రమైన విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను విక్రయిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది.