ఇద్దరు కాశ్మీరీ రచయితల రచనలు ఔట్‌

–  రెండు ప్రముఖ కాశ్మీర్‌ విశ్వవిద్యాలయాల తీరు
–  ఎలాంటి వివరణా లేకుండానే తొలగింపులు
శ్రీనగర్‌: విమర్శకుల ప్రశంసలు పొందిన ఇద్దరు కాశ్మీరీ రచయితల రచనలను కాశ్మీర్‌లోని రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలు వివరణ లేకుండా పాఠ్యాంశాల నుంచి తొలగించాయి. లోయలోని ప్రధాన ఉన్న విద్యా సంస్థగా ఉన్న యూనివర్శిటీ ఆఫ్‌ కాశ్మీర్‌ (యూఓకే) ఆంగ్లంలో పోస్ట్‌-గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ పాఠ్యాంశాల నుంచి రచయిత, పాత్రికేయుడు బషరత్‌ పీర్‌ జ్ఞాపకాలతో పాటు కాశ్మీరీ-అమెరికన్‌ కవి అఘా షాహిద్‌ అలీ మూడు కవితలను తొలగించింది.
షాహిద్‌ ప్రసిద్ధ పద్యాలు ‘పోస్ట్‌కార్డ్‌ ఫ్రమ్‌ కాశ్మీర్‌’, ‘ఇన్‌ అరబిక్‌’, ‘ది లాస్ట్‌ సఫ్రాన్‌’, పీర్‌కు చెందిన ‘కర్ఫ్యూడ్‌ నైట్‌’ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (ఇంగ్లీష్‌) కోర్సు యొక్క మూడో సెమిస్టర్‌లో బోధించబడ్డాయి. అయితే, ఈ ఏడాది నుంచి ఇవి పాఠ్యాంశాల్లో భాగంగా ఉండవని విశ్వవిద్యాలయానికి చెందిన వర్గాలు తెలిపాయి. మార్చిన సిలబస్‌ త్వరలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించాయి. అయితే, ఈ తొలగింపులపై యూఓకే వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ నీలోఫర్‌ ఖాన్‌ నుంచి సరైన స్పందన రాకపోవటం గమనార్హం.
ఇక, షాహిద్‌ రెండు కవితలు, ‘ఐ సీ కాశ్మీర్‌ ఫ్రమ్‌ న్యూ ఢిల్లీ ఎట్‌ మిడ్‌నైట్‌’, ‘కాల్‌ మి ఇస్మాయిల్‌ టునైట్‌’ అనే రెండు కవితలను నిలిపివేయాలని క్లస్టర్‌ యూనివర్సిటీ శ్రీనగర్‌ (సీయూఎస్‌) అధికారులు తెలిపారు. అయితే, ఈ తొలగింపులపై ఎలాంటి అధికారిక వివరణా లేకపోవటం గమనార్హం. వర్సిటీ యంత్రాంగాల తీరును విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. ఎలాంటి కారణాలు లేకుండానే ఇలాంటి చర్యలకు దిగటం ఏ మాత్రమూ సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు సమాజంలో ప్రతికూల సందేశాన్ని తీసుకెళ్తాయని హెచ్చరిస్తున్నారు.

Spread the love