మోడీపై ప్రజలకు సన్నగిల్లుతున్న నమ్మకం

– అది తగ్గేకొద్దీ అనుమానాలు, ప్రశ్నలు పెరుగుతున్నాయి
– నోట్ల రద్దుతో నల్లధనం వైట్‌మనీగా మారింది
– పతనం అంచున పెట్టుబడిదారీ వ్యవస్థొ సోషలిజం వైపు అడుగులు :
ప్రముఖ ఆర్థికవేత్త డి.పాపారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అనాలోచిత నిర్ణయాల వల్ల మోడీ పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతున్నదని ప్రముఖ ఆర్థికవేత్త, జర్నలిస్టు డి.పాపారావు అన్నారు. నోట్ల రద్దు వల్ల మోడీ సర్కారుకు క్లీన్‌చీట్‌ రాకపోగా ప్రజల్లో విశ్వసనీయత తగ్గిందని చెప్పారు. నమ్మకం తగ్గేకొద్దీ వ్యవస్థలు, వ్యక్తుల పట్ల ప్రజల్లో అనుమానాలు, ప్రశ్నించుకోవటం ఎక్కువ అవుతాయన్నారు. అవి ఎక్కువయ్యే కొద్దీ వాస్తవాలేంటి? అబద్ధాలేంటి? అనే వాటిని నిర్ధారించుకోవటం జరుగుతుందన్నారు. ఈ పరిణామాలు కొత్త వ్యవస్థల వైపు అడుగులు వేసేందుకు దారులు తీస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో ఉందనీ, సోషలిజం వైపు వేగంగా అడుగులు పడుతున్నాయని నొక్కి చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘నోట్ల రద్దుతో క్లీన్‌చిట్‌ సాధ్యమేనా?’ అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు. ఈ అంశంపై పాపారావు మాట్లాడారు. నోట్ల రద్దుతో ఎన్ని ఇబ్బందులు పడ్డా మోడీ సర్కారు తమ కోసం ఏమో చేస్తుందనే భ్రమల్లో ప్రజలు మునిగిపోయారని చెప్పారు. ప్రజలకు చివరకు నిరాశే మిగిలిందన్నారు. నోట్ల రద్దు సమయంలో దేశంలో పది లక్షల కోట్ల రూపాయల విలువైన రూ.500,1000 నోట్లు రద్దు అయ్యాయనీ, వాటిలో 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు తిరిగి రావని ఆర్బీఐ భావించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, వాస్తవ పరిస్థితుల్లో ఆ డబ్బునంతా వైట్‌మనీగా మార్చుకునేందుకు డీమానిటైజేషన్‌ దోహదపడిందని వివరించారు. ప్రభుత్వమే చేసిన అతి పెద్ద మనీల్యాండరింగ్‌ కేసు అని ఫోర్బ్‌ పత్రిక ఆనాడే ప్రచురించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత మోడీ డిజిటల్‌ ఎకానమీ పల్లవి ఎత్తుకున్నారని చెప్పారు. దాని ద్వారా పన్నుల ఎగవేత తగ్గుతుందనీ, లావాదేవీల్లో పారదర్శకత ఏర్పడుతుందని చెప్పారు. ఆ క్రమంలోనే ఆన్‌లైన్‌ లావాదేవీలు ఇటీవల బాగా పెరగాయన్నారు. కాగితం కరెన్సీ వాడకం కూడా తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలో నోట్ల ముద్రణ తగ్గాల్సి ఉండగా..వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉందన్నారు. 2016లో రూ.15 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉండగా ఆర్బీఐ లెక్కల ప్రకారమే ఇప్పుడు అది రూ. 32 లక్షల కోట్లు ఉందని వివరించారు. వాడకం లేకున్నా సర్క్యూలేషన్‌ ఎందుకు పెరిగింది? అది ఎక్కడ ఉంది? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో రెండు ఎకనామీలున్నాయని చెప్పారు. ఎక్కువస్థాయిలో ప్రజలు వాడుతున్న డిజిటల్‌ ఎకనామీలో లావాదేవీల ట్రాన్ఫరెన్సీ చాలా బాగుందనీ, తెల్లడబ్బు ఎకనామీలో ప్రజలున్నారని చెప్పారు. దీనికి సమానంతరంగా రెండో ఎకానమీ మనకు తెలియకుండానే నడుస్తున్నదని తెలిపారు. కార్పొరేట్లు, ఎక్కువ మంది రాజకీయ నేతలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, మాఫియా వ్యక్తులు రెండో ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారనీ, లావాదేవీలు కనపడకుండానే చేతులు మారిపోతున్నాయని వివరించారు. వారంతా నల్లడబ్బు ఎకనామీలో ఉన్నారని చెప్పారు. దేశంలో నల్లడబ్బు లేకుండా పోయిందనేది అవాస్తవమన్నారు. బీజేపీ శ్రేణులు రూ.2 వేల నోట్ల ముద్రణపై అనేక కట్టు కథలు చెప్పి ప్రజల్ని మైమరిపించాయన్నారు. బీజేపీ శ్రేణులు కూడా మోడీ మాయజాలంలో ఉన్నాయన్నారు. వారంతా అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. రూ.2 వేల నోటు రద్దును ఆర్బీఐ ప్రకటించినప్పటికీ దాని వెనుక రాజకీయ ఒత్తిడి కూడా దాగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కర్నాటక ఎన్నికల ఫలితాల చర్చ లేకుండా మరిచిపోయేలా చేసిందా? రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల వద్ద డబ్బులు లేకుండా చేయడంలో భాగంగా చేసిందా? ఇతర రాష్ట్రాల్లో ఆయా పార్టీల నేతలకు కేసీఆర్‌, జగన్‌ డబ్బులు సమకూరుస్తున్నారన్న ప్రచార నేపథ్యంలో జరిగిందా? ఇలా అనేక అనుమానాలకు రూ.2 వేల నోటు రద్దు అంశం అవకాశమిస్తున్నదన్నారు. తాను అవినీతికి పాల్పడననీ, ఎవ్వరినీ పాల్పడనివ్వనని మోడీ చెప్పింది అవాస్తవమని తేలిందన్నారు. కర్నాటకలో ఆపార్టీ ఓటమికి 40 శాతం కమిషన్‌ కూడా ఒక కారణమేనని చెప్పారు. అబద్దాలతో కూడిన రాజకీయాలకు కాలం చెల్లబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.2 వేల మార్పిడి కోసం ఎక్స్‌ట్రా 20 శాతం ఇచ్చి బంగారం కొంటున్నారనీ, లగ్జరీ వస్తువుల కొనుగోలు ఇటీవల బాగా పెరిగిందని చెప్పారు. దీనిని బట్టే ఆ డబ్బు ఎక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు.