న్యూఢిల్లీ : అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 16న తీర్పు వెలువరించనుంది. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబరు 17న తీర్పు వాయిదా వేసింది. ఈ అంశంతో ముడిపడిన రెండు కేసుల విచారణ (ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు) ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నందున సుప్రీంకోర్టు వాటికంటే ముందు 17-ఎపై నిర్ణయాన్ని వెలువరించనుంది. రెండు కేసులనూ అక్టోబరు 17కి వాయిదా వేసింది. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఈనెల 16న వెలువడనుంది.