మాదక ద్రవ్యాలు, బెట్టింగులకు దూరంగా ఉండాలి

– ప్రముఖ వైద్యులు కూరపాటి ప్రదీప్‌
– మాదక ద్రవ్యాలు, బెట్టింగ్‌ మాఫియాలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
– డీవైఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్‌ బషీరుద్దీన్‌
-చేడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి
– రూరల్‌ ఎస్సై షేక్‌ సాకీర్‌
నవతెలంగాణ-ఖమ్మం రూరల్‌
నేటి యువతలో ఎక్కువ భాగం మద్యం, మాదక ద్రవ్యాలు, బెట్టింగ్‌ లో కొట్టుకుని పోతున్నారని వాటికి బానిసలుగా మారి తమ జీవితాలను మధ్యలోనే అర్ధాంతరంగా పాడు చేసుకుంటున్నారని వ్యసనాలకు దూరంగా ఉండి సంపూర్ణంగా జీవించాలని ప్రముఖ వైద్యులు కూరపాటి ప్రదీప్‌ యువతకు సూచించారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోని రెడ్డి ఫంక్షన్‌ హాల్‌ లో డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి పొన్నం మురళి అధ్యక్షతన బుధవారం రాత్రి ”మాదకద్రవ్యాలు-బెట్టింగ్‌-యువత” అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సెమినార్‌ కు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌ ప్రసంగించారు. మానవ జీవితం అత్యంత విలువైందని, జీవితాన్ని సంపూర్ణంగా గడుపుకొని ఇతరులకు సహాయం చేయాలని అలా సహాయం చేసిన వాళ్ళనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. డ్రగ్స్‌ వాడడం వలన ఆరోగ్యంగా, ఆర్థికంగా యువత నష్టపోతారని వాటికి దూరంగా ఉండి కుటుంబంతో సంతోషంగా గడపాలని యువతకు సూచించారు. డీవైఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్‌ బషీరుద్దీన్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే మాదకద్రవ్యాలు- మాఫియా-బెట్టింగ్‌ల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతుందని తెలిపారు. చెడు వ్యాపారాలకు యువతను వాడుకుంటూ, అదే యువతను డ్రగ్స్‌ కు బానిసలుగా చేస్తున్నారని ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డ్రగ్‌ మాఫియా విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్‌ కాలేజీలు, ఇంటర్‌ కాలేజీలు, స్కూల్స్‌, ఇలా అన్నిచోట్లకు వచ్చేసాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉచ్చులో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు ఉన్నారన్నారు. బెట్టింగ్‌ మాఫియా కూడా దేశంలో బాగా పెరిగిపోయిందని ఐపీఎల్‌ లాంటి లీగ్‌ ల సందర్భంగా పెద్ద ఎత్తున బెట్టింగ్‌ జరుగుతూ యువతను నాశనం చేస్తుందని అన్నారు. యువతను నాశనం చేస్తున్న ఈ డ్రగ్స్‌, బెట్టింగులపై చట్టాలను పకడ్బందీగా అమలు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.
రూరల్‌ ఎస్సై సాకిర్‌ మాట్లాడుతూ యువత పెడదోవలు పట్టకుండా పోలీసు వ్యవస్థే కాకుండా సభ్యసమాజం కూడా స్పందించాలని ఆయన గుర్తు చేశారు. తమవంతు కర్తవ్యంగా పని చేస్తున్నామని ప్రజల మద్దతు కూడా ఉంటే మాదక ద్రవ్యాలను, బెట్టింగ్‌ మాఫియాను అరికట్టవచ్చున్నారు. ఈ సెమినార్‌లో డీవైఎఫ్‌ఐ మండల నాయకులు తాటి వెంకటేశ్వర్లు, వట్టికోట నరేష్‌, ఊరడి విజరు, అరవింద్‌, తోట నరేష్‌, గడ్డం సిద్దు, చాంద్‌ పాషా, మల్లికార్జున్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు కూరపాటి శ్రీను, రావులపాటి నాగరాజు, నాయకులు మంగయ్య, భూక్య నాగేశ్వరరావు, సాలె ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.