– ప్రజలకు కష్టనష్టాలు లేకుండా చూడాలి..
– రైల్వేలో ప్రోటోకాల్ పాటించడం లేదు..
– దిశ కమిటీ చైర్మన్, ఎంపీ నామ నాగేశ్వరరావు
– రోడ్ల అభివృద్ధి, లైటింగ్ కోసం ఎమ్మెల్యేల విజ్ఞప్తి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా ప్రజలకు ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా సమూల మార్పుతో పాపటపల్లి-మిర్యాలగూడ నూతన రైలు మార్గాన్ని నిర్మించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ చైర్మన్ నామ నాగేశ్వరరావు రైల్వే ఉన్నతాధికారులను కోరారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన దిశ కమిటీ సమావేశంలో జాతీయ రహదారులు, పంచాయతీ రాజ్, ఇర్రిగేషన్, విద్యుత్, మునిసిపల్, రైల్వే, డీఆర్డీఏ, వైద్య ఆరోగ్యం, పరిశ్రమల శాఖల కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించారు. తొలుత ప్రతిపాదించిన మిర్యాలగూడెం నూతన రైలు మార్గం అలైన్ మెంట్ వల్ల ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లోని 12 గ్రామ పంచాయతీల చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రజలు, పార్టీల విజ్ఞప్తి మేరకు తాను కేంద్ర రైల్వే మంత్రికి, రైల్వే బోర్డు చైర్మన్, జనరల్ మేనేజర్లకు లేఖలు రాయడంతోపాటు రైల్వే మంత్రితో స్వయంగా మాట్లాడిన ఫలితంగా, తొలుత ప్రతిపాదించిన అలైన్ మెంట్ మార్చేందుకు అంగీకరించారని తెలిపారు. అయితే మళ్ళీ సర్వే చేసి, సామాన్య ప్రజలకు, రైతులకు ఇబ్బంది లేకుండా కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు వివరించారు. వీలుంటే ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా రైలు మార్గాన్ని నిర్మించే యోచన చేయాలని కోరారు. రైల్వేలో ప్రోటోకాల్ పాటించడం లేదని, పనుల ప్రారంభం, ఇతర విషయాల గురించి సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకొని, దిశ కమిటీ సమావేశానికి హాజరుకావాలని తెలిపారు. ఏయే ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నది, ఎప్పటికి పూర్తి అయ్యేది వివరాలు సమర్పించాలన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలో సరిపోను చెక్ డ్యాం ల నిర్మాణం చేసుకున్నట్లు తెలిపారు. అనధికార లే అవుట్లు, కాల్వల పూడ్చివేతపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇండ్లపై హై టెన్షన్ తీగలు, విద్యుత్ స్తంభాలు కావాల్సిన చోట ఏర్పాటు, ట్రాన్స్ ఫార్మర్స్ షిఫ్టింగ్ తదితర సమస్యలు వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచే విధంగా కషి చేయాలన్నారు. కంటివెలుగు, ఆరోగ్య మహిళ పథకాలు ఆదర్శనీయం అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. జిల్లాలో కొత్త రహదారులు, బైపాస్, రోడ్ సేఫ్టీ, నిర్వహణ కోసం రూ. 1259 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపామన్నారు. అవి ఏ దశలో ఉన్నవి, ఎన్ని మంజూరు అయినవి నివేదిక సమర్పించాలన్నారు. ఖమ్మం-కురవి జాతీయ రహదారి అభివద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని, కేంద్ర మంత్రులకు లేఖలు రాయడం వల్ల రూ. 124.80 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. త్వరలో ఖమ్మంలో సీఐఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బెస్ట్ ఇండిస్టియల్ పాలసీతో, దేశంలో రాష్ట్రం నెం. 1 స్థానంలో ఉన్నట్లు, రాష్ట్రంలో ఖమ్మం జిల్లాను నెం. 1 స్థానంలో నిలపాలని దిశ చైర్మన్ కోరారు. గోల్డ్ రిఫైనరీలు రాష్ట్రానికి వస్తున్నాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. జిల్లాలో మధిర నియోజకవర్గంలో రైల్వేలైన్ ఎక్కువగా ఉన్నట్లు జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్ తెలిపారు. మధిర పట్టణంలో పాతర్లపాడు, రాంపురం క్రాస్ రోడ్ తదితర ప్రాంతాలలో రైల్వే అండర్ బ్రిడ్జిలు అవసరం ఉన్నట్లు తెలిపారు. రిజర్వ్ నియోజకవర్గం వైరా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కోరారు. బ్రౌన్ కళాశాల నుండి తనికెళ్ళ స్టేజి, పల్లిపాడు రహదారులు అభివృద్ధి పర్చాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. నాయుడుపేట చౌరస్తా నుండి రాపర్తినగర్, పొన్నెకల్ నుండి మద్దులపల్లి వరకు రోడ్డు విస్తరణ చేయాలని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. మండల హెడ్ క్వార్టర్స్ లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. రైల్వే లైన్ ఏర్పాటులో రైతుల భూములు కోల్పోకుండా చూడాలన్నారు. కామంచికల్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోగా గేట్ మూసివేశారని అన్నారు. ఆసరా పెన్షన్లలో మరణించిన భర్త స్థానే భార్యకు వెంటనే పెన్షన్ లు మంజూరు చేయాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి మాట్లాడుతూ గిరివికాసం పథకం కింద బోర్లు, విద్యుత్ లైన్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వరరావు, జాయింట్ కమిషనర్ ఎస్‌ఎల్‌ఎన్‌ఏ, దిశ కమిటీ సభ్యులు ఎం. శేషుకుమార్, దిశ కమిటీ నామినేటెడ్ సభ్యులు, జిల్లా అధికారులు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.