– మధాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యేగా ప్రమాణం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అసెంబ్లీకి రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆయన చేత ప్రమాణం చేయించనున్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీకి రానుండటం గమనార్హం. ఆ ఎలక్షన్ల అనంతరం ఆయన తుంటి విరగటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి విదితమే. వైద్యుల సూచన మేరకు అప్పటి నుంచి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటం, ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటేయాల్సి రావటంతో ఈలోపే ప్రమాణ స్వీకారం చేయాలని భావించిన కేసీఆర్, గురువారాన్ని మంచి రోజుగా నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయన… అనంతరం శాసనసభ లాబీల్లో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. పూర్తి స్థాయిలో తనంతట తాను నడిచేందుకు మాజీ సీఎంకు మరికొంత సమయం పడుతుందనీ, అందువల్ల కేసీఆర్ అసెంబ్లీకి వీల్ ఛైర్‌లోనే వస్తారని ఆయా వర్గాలు వివరించాయి.