కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు

రవాణా సమస్యతో కాంటాలు పెట్టని నిర్వాహకులు
కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతుల పడిగాపులు
తాలుపేరుతో ధాన్యం దిగుమతి చేసుకోని రైస్‌మిల్లర్లు
పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ-శాయంపేట
రైతులు ఆరుగాలం శ్రమించి అప్పులు తెచ్చి పంట సాగు చేసి, పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించడానికి వెళ్లగా నిర్వాహకులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు జారీ చేసిన టోకెన్ల ప్రకారం గన్ని సంచుల కోసం అవస్థలు పడుతుండగా, మరోవైపు లారీల సమస్యతో నిర్వాహకులు కాంటాలు పెట్టకపోవడంతో కేంద్రాల వద్ద పడి గాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఎట్టకేలకు లారీల్లో ధాన్యం బస్తాలను ఎగుమతి చేస్తే తాలు పేరుతో మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు. ఇంత జరుగుతున్న అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మండలంలోని శాయంపేట, పత్తిపాక, ప్రగతిసింగారం, కాట్రపల్లి, పెద్దకోడపాక గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయగా, మైలారం, తహరాపూర్‌, నేరేడుపల్లి గ్రామాలలో పిఎసిఎస్‌ ఆధ్వర్యంలో, గట్లకానిపర్తి, కొప్పుల, సూర్య నాయక్‌ తండా గ్రామాలలో ఒడిసి ఎమ్మెస్‌ ఆధ్వర్యంలో, వసంతపూర్‌ గ్రామంలో నవయుగ సొసైటీ, రైతు సొసైటీ ఆధ్వర్యంలో మొత్తంగా 13 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి ఆరబెట్టుకుంటున్నారు. గన్ని సంచుల కోసం పడరాని పాట్లు పడి సంచులు సంపాదించి ధాన్యాన్ని నింపినప్పటికీ, కేంద్రం నిర్వాహకులు లారీల కొరతతో కేవలం 1000 బస్తాల వరకు మాత్రమే తూకం వేసి మీన్నకుంటున్నారు. దీంతో కేంద్రాలలో వరి ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. లిరవాణా సమస్యతో తూకం పెట్టని నిర్వాహకులు కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు ధాన్యం బస్తాలను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం రవాణా కాంట్రాక్ట్‌ టెండర్‌ పిలిచింది. గత మూడేళ్ల నుండి రవాణా కాంట్రాక్ట్‌ చేస్తున్నాడు. ఏడాది టెండర్‌ దక్కించుకున్న రాజేశ్వరరావు శాయంపేట, దామెర, నడికూడ మండలాలలోని ధాన్యం బస్తాలను ఎగుమతి చేస్తున్నాడు. కొనుగోలు కేంద్రంలో లోడ్‌ చేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తీసుకెళ్లగా వేసవిలో ఉదయం, సాయంత్రం వేళల్లోనే హమాలీలు ధాన్యం దిగుమతి చేసుకుంటు ఉండడంతో, ధాన్యం దిగుమతి కావడానికి రెండు నుండి మూడు రోజులు వేచి చూడాల్సి పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వెయ్యి బస్తాల వరకు తూకం వేస్తున్నారని, తూకం వేసిన బస్తాలను లారీలో ఎగుమతి చేశాకే మరొక వెయ్యి బస్తాలు తూకం వేస్తున్నారు.
దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తూకం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి ముద్దయ్యే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. లితాలు పేరుతో బస్తాలను దిగుమతి చేసుకొని రైస్‌ మిల్లర్లులి తూకం వేసిన వరి ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు ఎలాంటి కోత లేకుండా దిగుమతి చేసుకోవాలని పరకాల ఏసీపీ శివరామయ్య రైస్‌ మిల్లర్లకు హెచ్చరికలు జారీ చేయడంతో తాహారాపూర్‌ లోని శ్రీనివాస రైస్‌ మిల్లు యజమాన్యం వెంట వెంటనే ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. రాంపూర్‌ లోని సూర్య తేజ రైస్‌ మిల్లు యజమాన్యం మాత్రం తాలు పేరుతో ధాన్యపు బస్తాలను దిగుమతి చేసుకోకపోవడమే కాక, కొనుగోలు కేంద్రాలకు తిరిగి పంపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్యాడి క్లీనర్‌ లో వడ్లు పట్టకపోవడం వల్ల తాలు ఉన్న ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదని రవాణా కాంట్రాక్టర్‌ రాజేశ్వరరావు తెలిపారు. మండలంలోని నేరేడుపల్లి, పత్తిపాక, ప్రగతిసింగారం, దామెర మండలంలోని పసరుగొండ, కౌగిలివాయి కొనుగోలు కేంద్రాల నుండి పంపిన దాన్యం బస్తాలను రైస్‌ మిల్లర్లు దిగుమతి చేసుకోక ధాన్యంలో తాలు ఉందని తిరిగి పంపించినట్లు తెలిపారు. లిపట్టించుకోని అధికారులు కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యం లారీల కొరతతో ఎగుమతి కాకపోవడంతో ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయి. కేంద్రం నుండి తూకం వేసిన ధాన్యం బస్తాలు ఎగుమతి అయితేనే మరల వెయ్యి నుండి 1500 వరకు నిర్వాహకులు కాంటాలు పెట్టిస్తున్నారు. రవాణా కొరతతో నిర్వాహకులు తూకం వేయకపోవడంతో రైతులు కేంద్రం వద్ద పడికాపులు కాస్తూ ఆందోళన చెందుతున్నారు.
తాలు పేరుతో రైస్‌ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అధికారులు కూడా రవాణా కాంట్రాక్టర్‌ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ధాన్యాన్ని తిరిగి పంపిస్తున్న రైస్‌ మిల్లర్లపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అకాల వర్షాలను దష్టిలో పెట్టుకొని వెంట వెంటనే ధాన్యాన్ని తూకం వేసి రైస్‌ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకొని, తమ కష్టాలు తొలగించాలని రైతులు వేడుకుంటున్నారు.