చారిత్రాత్మక తీర్పు : సీపీఐ(ఎం)

Historic Verdict: CPI(M)న్యూఢిల్లీ : ఎలక్టోరల్‌ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో స్వాగతించింది. పాలక పార్టీకి అజ్ఞాత కార్పొరేట్‌ దాతలు నిధులు అందించేందుకు ఉద్దేశించిన, ఈ చిత్తశుద్ధి లేని, అనాలోచిత పథకం ఈ తీర్పుతో పూర్తిగా రద్దైందని పేర్కొంది. ఈ పథకం అవినీతిని చట్టబద్ధం చేస్తున్నందున ఎన్నికల బాండ్లను తమ పార్టీ ఆమోదించబోదంటూ ప్రారంభంలోనే సిపిఎం ప్రకటించిన విషయాన్ని పొలిట్‌బ్యూరో గుర్తు చేసింది. ఇతర పిటిషనర్లతో కలిసి సీపీఐ(ఎం) ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంలో సవాలు చేసింది. ఈ పథకానికి వ్యతిరేకంగా పిటిషన్‌లో పేర్కొన్న ప్రధాన వాదనలను సుప్రీంకోర్టు కూడా సమర్ధించినందుకు సంతోషంగా వుందని వ్యాఖ్యానించింది. పారదర్శకతకు, ఎలాంటి కళంకం లేని రీతిలో నిధులు అందించేందుకు, అందరికీ సమాన అవకాశాలు వుండేలా చూసేందుకు హామీ కల్పిస్తూ రాజకీయ, ఎన్నికల నిధులకు ఇప్పుడు సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం వుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది.