సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరులో ఎంతో శ్రమ ఉంది

– ఈ మూడేండ్లలో 4612 మందికి రూ.25.69కోట్లు
– నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి
– ఒక్క సత్తుపల్లిలోనే రూ.100కోట్ల అభివృద్ధి
– జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
– జూన్‌ ఫస్ట్‌ నుంచే మనకు ఎన్నికల సంగ్రామం
– సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ-సత్తుపల్లి
ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసినంత మాత్రాన అది మంజూరు కాదని, ఆ మంజూరులో ఎంతో శ్రమ, కృషి దాగి ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్య స్పష్టం చేశారు. శనివారం స్థానిక లక్ష్మీప్రసన్న ఫంక్షన్‌హాలులో 145 మంది లబ్ధిదారులకు రూ.75లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సండ్ర మాట్లాడారు. సీఎంఆర్‌ఎఫ్‌పై కూడా కొందరు అజ్ఞానులు విమర్శలు చేయడం బాధాకరమన్నారు. అదొక హక్కంటూ హేళనగా మాట్లాతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పథకాన్ని గతంలో ఏ ప్రభుత్వమైనా ఇంత పెద్ద మొత్తంలో మంజూరు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఆయా ప్రభుత్వాల కాలంలో మీరెందుకు మంజూరు చేయించలేకపోయారంటూ మండిపడ్డారు. సీఎంఆర్‌ఎఫ్‌ అంటే అదో భరోసా, క్షతగాత్రులయి. చికిత్స కోసం ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ఊరట కలిగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద మనసుతో ఈ పథకాన్ని బాధిత కుటుంబాలకు అందిస్తున్నారని సండ్ర అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ పథకాన్ని అందిస్తున్నామన్నారు. ఇండ్ల పట్టాలిచ్చే కార్యక్రమం త్వరలో చేపట్టబోతున్నామన్నారు. జులై మొదటి వారంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమవుతాయన్నారు. జరుగుతున్న నిర్మాణాలు, మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలు ఆగస్టు చివరి నాటికల్లా పూర్తి చేసుకోవాలన్నారు.
ఈ మూడేండ్లలో 4612 మందికి రూ. 25.69కోట్లు
2019, ఫిబ్రవరి నుంచి 2023, మార్చి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 4612 మందికి రూ. 25.69కోట్లు సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరైందన్నారు. ఇదే కాకుండా నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ. 1000 కోట్ల అభివృద్ధి జరిగిందన్నారు. ఒక్క సత్తుపల్లిలోనే రూ. 100కోట్ల మేర అభివృద్ధి జరిగిందన్నారు. ఇదంతా కాగితాల పైన కాదని, క్షేత్రస్థాయిలో భూమిపై కనపడుతుందని సండ్ర స్పష్టం చేశారు. సత్తుపల్లి నుంచి సిద్దారం మీదుగా మర్లపాడు వరకు ఇంతకు ముందు రూ. 12.80కోట్లతో సింగిల్‌ రోడ్డుకు నిధులు మంజూరు చేయించగా ప్రస్తుతం దానిని డబుల్‌ రోడ్డుగా మార్చేందుకు మరో రూ. 27కోట్లను మంజూరు చేయించామని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు.
జూన్‌ ఫస్ట్‌ నుంచే మనకు ఎన్నికల సంగ్రామం మొదలు
జూన్‌ ఫస్ట్‌ నుంచే నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల సంగ్రామ వాతావరణం ఏర్పడనుందని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట జూన్‌ ఫస్ట్‌ నుంచి నెలాఖరు వరకు పలు రకాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమాలను మొక్కుబడిగా కాకుండా వినూత్నంగా ఉండేలా రూపకల్పన చేసుకోవాలన్నారు. తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి జరిగిన ప్రగతిని ఈ ఉత్సవాల ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్లి అర్థమయ్యేలా వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్‌ ఛైర్మెన్‌ కూసంపూడి మహేశ్‌, ఆత్మ ఛైర్మెన్‌ వనమా శ్రీనివాసుదేవరావు, ఎంపీపీలు లక్కినేని అలేఖ్య, పగుట్ల వెంకటేశ్వరరావు, పట్టణ, రూరల్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ఎస్కే రఫీ, యాగంటి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్‌, గ్రాండ్‌ మౌలాలి పాల్గొన్నారు.