– సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌లో 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. ఆ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏండ్లకు పెంచాలని కోరారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌లో చాలీచాలని వేతనాలతో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారిని క్రమబద్ధీకరణ చేస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ ప్రక్రియను చేపట్టకపోవడంతో ఉద్యోగులు నిరుత్సాహంతో ఉన్నారని తెలిపారు. తెలంగాణ విభజన తర్వాత టూరిజం కార్పొరేషన్‌కు 941 పోస్టులను కేటాయించారని పేర్కొన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో 183 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు.