భారత సైన్యంలో ఒక బెటాలియన్ కు నాయకురాలు

Once a cattle rustler, she is now the leader of a battalionఅడ్డంకులు ఎన్ని ఎదురైనా కలలు కంటూనే ఉంది. ఆ కలలను సాకారం చేసుకునేందుకు అనునిత్యం శ్రమించింది. ఆమే కల్నల్‌ సప్నా రానా. కల్నల్‌ అయ్యేందుకు ఆమె చేసిన ప్రయాణం అంత సులభమైనదేమీ కాదు. ఒక చిన్న పల్లెటూర్లో పుట్టి పెరిగిన ఆమె ఒకప్పుడు కుటుంబ పోషణ కోసం పశువులను కాసింది. ఇప్పుడు భారత సైన్యంలో ఒక బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తోంది. ఆమె సంకల్ప బలం గొప్ప విజయానికి ఎలా దారితీసిందో తెలుసుకుందాం…
భారత సైన్యంలో చేరి ఒక బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తుందని అసలు సప్నా రానా ఎప్పుడూ ఊహించలేదు. అసలు తన జీవితంలో ఇలాంటి కెరీర్‌ ఎంచుకోవాలనే ఆలోచనే ఆమెకు లేదు. ఇప్పుడు కల్నల్‌గా చరిత్ర సృష్టించిన ఆమె తన చిన్నతనంలో కుటుంబ పోషణ కోసం పశువులు కాసేది. బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణం చేస్తే డబ్బు ఖర్చు అవుతుందని, ఆ డబ్బు కూడా తన చదువుకు ఉపయోగపడుతుందని ఎంత దూరమైనా కాలినడకే నడిచింది. అటువంటి ఓ మారుమూల గ్రామంలో, పేద కుటుంబంలో పుట్టారు ఆమె. సప్నా ప్రారంభ జీవితం ఇలా ఎన్నో కష్టాలతో ముడిపడి ఉంది.
సివిల్‌ సర్వీస్‌ ఆమె మొదటి కల
చేస్తున్న ప్రయాణంలో ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ తన స్థాయికి మించిన కలలు మాత్రం కన్నది. ఆ కల నెరవేర్చుకోవడం కష్టమని తెలిసినా ప్రయత్నం చేయాలనుకుంది. సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక కావాలన్నది ఆమె తొలి కోరిక. ఆ లక్ష్య సాధన కోసమే ఎన్నో మైళ్లు కాలి నడకన ప్రయాణించింది. రూపాయి ఖర్చు పెడితే మళ్ళీ సంపాదించడం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. అందుకే కాళ్ళు బొబ్బలెక్కుతున్నా ప్రతి పైసా చాలా జాగ్రత్తగా ఖర్చుపెట్టేది. ఆ తపనే ఆమెను హిమాచల్‌ ప్రదేశ్‌ విశ్వవిద్యాలయం నుండి ఏంబీఏ పూర్తి చేసేలా చేసింది. అయితే అనుకోకుండా సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధం కావాలనుకున్న ఆమె మధ్యలో తన ప్రణాళికను మార్చుకోవల్సి వచ్చింది. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలో అవకాశం పొందింది.
గర్వంగా ఉంది
గృహిణి అయిన సప్నా తల్లి కృష్ణ ఠాకూర్‌ మాట్లాడుతూ ‘నాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. మా అమ్మాయి సప్నా చిన్నప్పటి నుండి బాగా చదివేది. చదువు విషయంలో అస్సలు రాజీపడేది కాదు. మాది ఒక చిన్న గ్రామం. ప్రపంచం ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. అలాంటిది నా కూతురు ఆ గ్రామ పంచాయితీ దాటి బయటకు వస్తుందని అస్సలు ఊహించలేదు. అయితే సప్నా తన 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత తన అన్నలతో కలిసి ఉన్నత చదువుల కోసం సోలన్‌కు వెళతానని పట్టుబట్టింది. మాకు చాలా భయం వేసింది. ఆడపిల్లను ఊరుకి దూరంగా పంపించేందుకు మొదట కాస్త కంగారు పడ్డాము. కానీ చదువు పట్ల ఆమెకున్న ఆసక్తి మమ్మల్ని ఒప్పించేలా చేసింది. ఇప్పుడు తనను చూస్తే చాలా గర్వంగా ఉంది’ అని ఆమె చెబుతున్నారు.
అనుకోకుండా వచ్చిన అవకాశం
కల్నల్‌ సప్నా తన కలలకు రెక్కలు వచ్చిన రోజులను గుర్తుచేసుకుంది ‘సోలన్‌లోని ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత నేను సిమ్లాలోని ఎంబీఏ డిగ్రీ కోసం హిమాచల్‌ ప్రదేశ్‌ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్‌ పొందాను. అప్పటి నుండే నేను సివిల్‌ సర్వీసెస్‌ కోసం ప్రిపేర్‌ అవ్వడం మొదలుపెట్టాను. కానీ మధ్యలో కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షకు హాజరయ్యాను. ఇది అసలు నా ఆలోచనల్లోనే లేదు. అనుకోకుండా ఓ ప్రయత్నం చేద్దామని వెళ్లింది. చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణకు ఎంపికయ్యాను’ అని చెప్పారు. అలా సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ను క్లియర్‌ చేసిన తర్వాత ఆమె 2003లో చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో చేరారు. 2004లో ఇండియన్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా నియమి తులయ్యారు. 41 ఏండ్ల ఈ అధికారి ప్రస్తుతం ఆర్మీ సర్వీస్‌ కార్ప్స్‌ (ఏఎస్‌సీ) బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. సప్నా ఈశాన్య ఆర్మీ అధికారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది.
ఖర్చులు తగ్గించుకునేందుకు
సప్నా తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు. ఇదే ఆమె పై చదువులు చదివేందుకు మంచి అవకాశంగా మారింది. కూతురు పై చదువుల కోరిక గురించి తెలుసుకున్న ఆమె తల్లే, తండ్రిని ఒప్పించింది. తర్వాత ఆమె తన పై చదువుల కోసం సోలన్‌కు వెళ్లింది. ‘అక్కడ హాస్టల్లో ఉంటే ఖర్చు ఎక్కువని ఒక చిన్న గది తీసుకొని తనే స్వయంగా వంట చేసుకునేది. బస్సులో ప్రయాణిస్తే డబ్బు ఖర్చు అవుతుందని కళాశాల నుండి చాలా దూరం నడిచి వచ్చేది’ అని తల్లి గుర్తు చేసుకున్నారు. ‘గ్రామంలో ఉన్నప్పుడు అప్పటికి ఇండ్లల్లో ఉండే స్త్రీలు చేసే పనులన్నీ సప్నా చేసేది. పశువుల కోసం మేత కోయడం, పశువులను మేపుకు రావడం, పాలు పితకడం, చపాతీలు చేయడం… ఇలా అన్ని పనులూ చేసేది. అలా ఇండ్లల్లో అన్ని పనులు చేసిన సాధారణ మా అమ్మాయి ఈ రోజు ఆర్మీలో కమాండింగ్‌ ఆఫీసర్‌ (సీఓ) అయ్యింది అంటే మేము ఊహించలేకపోతున్నాం’ అంటూ ఆ తల్లి గర్వంగా చెబుతున్నారు.