‘మహిళా దినోత్సవం’ అన్నా, ‘శ్రామిక మహిళా దినోత్సవం’ అన్నా ఈ రోజు అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం. శ్రామిక మహిళా ఉద్యమం తన బలాన్ని, నిర్మాణాన్ని సమీక్షించుకోవాల్సిన రోజు. అయితే ఇది మహిళలకు మాత్రమే ప్రత్యేకించిన రోజు కాదు. మార్చి 8 అనేది శ్రామికులకు, రైతాంగానికి, కార్మిక వర్గానికి యావత్ ప్రపంచ కార్మిక వర్గానికి చారిత్రాత్మకమైన, మరుపురాని రోజు. మహిళా దినోత్సవం నాడు ప్రత్యేకించి శ్రామిక, రైతాంగ మహిళా సమావేళాలు నిర్వహించడం మీదే ఎందుకు దృష్టి పెడుతున్నాం? ఏ లక్ష్యం కోసం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామో ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1910 నుండి మహిళా సమానత్వం గురించి, మగవాళ్ళతో పాటు మహిళలకు కూడా రాజకీయ పాలనాధికారం గురించి తీవ్రమైన చర్చ మొదలయింది. అభివృద్ధి చెందిన దేశాలన్నింటా కార్మిక వర్గం శ్రామిక మహిళల హక్కుల గురించి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది. కానీ పెట్టుబడిదారులు శ్రామిక మహిళలకు హక్కులు ఇవ్వనిరాకరించారు. దాంతో అమెరికాలో సోషలిస్టులు మహిళలకు ఓటు హక్కు కోసం పట్టుబట్టి పోరాటాలు నర్విహించారు. 1909 ఫిబ్రవరి 28న శ్రామిక మహిళలకు రాజకీయ హక్కులు కల్పించాలనే డిమాండ్‌తో అమెరికా అంతటా ప్రదర్శనలు, మీటింగ్‌లు జరిగాయి. ఒకరకంగా చెప్పుకోవాలంటే ఇదీ ‘మహిళా దినోత్సవమే’. మహిళా దినోత్సవ నిర్వహణకు సంబంధించి చొరవ చేసింది అమెరికన్ మహిళా కార్మిక వర్గమే అని చెప్పుకోవచ్చు.
మహిళా ఐక్యతను పెంపొందించి
1910లో జరిగిన శ్రామిక మహిళల రెండవ అంతర్జాతీయ సదస్సులో క్లారాజెట్కిన్ అంతర్జాతీయ శ్రామిక దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం గురించి లేవనెత్తారు. మహిళలకు ఓటింగ్ హక్కు సాధించుకోవడం ద్వారా మహిళా ఐక్యతను పెంపొందించుకుని సోషలిజం సాధననను బలోపేతం చెయ్యాలనే నినాదంతో ప్రతి దేశంలో ప్రతి ఏడాది ఒకే రోజున ‘మహిళా దినోత్సవం’ నిర్వహించుకోవాలని సదస్సు పిలుపునిచ్చింది. ఈ కాలంలో మహిళలకు వయోజన ఓటు హక్కు కల్పించడం ద్వారా పార్లమెంటును మరింత ప్రజాస్వామికరించాలనే అంశం కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది. మొదటి ప్రపంచ యుద్ధానికంటే ముందు ఒక్క రష్యాలో మినహా అన్ని దేశాల్లోనూ కార్మికులకు ఓటు హక్కు ఉంది. కేవలం మహిళలు, మతిస్థిమితం లేని వాళ్లను మాత్రమే ఈ హక్కు నుండి మినహాయించారు. అదే సందర్భంలో పెట్టుబడిదారి సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్ది దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్య అవసరాలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. ఫ్యాక్టరీలలో, వర్క్‌షాపులలో, ఆఫీసులలో పని చేయడానికి మహిళల అవసరం ఏటికేటికీ పెరుగుతూ వచ్చింది. పురుషులతో సమానంగా మహిళలూ పని చేసి దేశ సంపద పోగు చేయడంలో తమవంతు కృషి చేశారు. అయినా మహిళలకు ఓటు హక్కు లేదు.
అగ్గిలా రాజుకున్నాయి
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఆహార ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇంటిపట్టున ఉండే గృహిణులు కూడా ఇందుకు గల రాజకీయ కారణాలను అర్థం చేసుకుని దోపిడీని ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. తిరుగుబాట్లు, రోడ్లమీదకొచ్చి ప్రదర్శనలు చెయ్యడం, నిరసన తెలపడం నానాటికీ పెరిగిపోయింది. ఈ నిరసనలు ఒక్కో దేశం నుండి ఇంకో దేశానికి అగ్గిలా రాజుకున్నాయి. ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలన్నింటా ఇలాంటి ఉద్యమాలు నడిచాయి. మార్కెట్లలో షాపుల మీద పడి ధ్వంసం చేయడం, వ్యాపారస్తులను చితకబాదడం సాధారణమయింది. అయితే ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రయోజనం లేకుండా పోతుందని, పెరిగిన ధరలకు మూలకారణం ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ విధానాల్లో ఉందని శ్రామిక మహిళలు అర్థం చేసుకున్నారు. పరిస్థితుల్లో మార్పు రావాలంటే రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనీ, అందుకోసం మహిళలకు ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్ ముందుకొచ్చింది. దీని సాధనకై ప్రతి దేశంలో విధిగా మహిళా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలందరికీ ఈ హక్కుల సాధన సాధ్యం కావాలంటే ఉమ్మడి లక్ష్యంతో అంతర్జాతీయ సంఘీభావంతో ఉద్యమాలు నడపాలనీ, ఏటా శ్రామిక మహిళల నిర్మాణ బలాన్ని అంచనా వేసుకుంటూ సోషలిజం సాధన దిశగా ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలో మహిళా దినోత్సవం రోజున సమీక్షించుకోవాలని నిర్ణయం జరిగింది.
మనం తృప్తి పడకూడదు
మహిళా దినోత్సవ స్ఫూర్తితో చేసిన ఎన్నో పోరాటాల ఫలితంగా మహిళలకు ఓటు హక్కుతో పాటు పౌర హక్కులు కూడా లభించాయి. పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని హక్కులూ దక్కాయి. తమ జీవితాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునే అవకాశాలు మహిళలకు లభించాయి. అయితే హక్కులు సాధించుకోవడటంతోనే మనం తృప్తి పడకూడదు. ఆ హక్కులను ఎలా ఉపయోగ పెట్టుకోవాలనే మెళకువ సంపాదించుకోవాలి. ఓటు హక్కును స్వీయ ప్రయోజనాలకు, కార్మికవర్గ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకుంటేనే ఆ హక్కు మన చేతిలో వజ్రాయుధంగా మారుతుంది.
హింసలేని సమాజం రావాలి
మహిళలు హక్కులు సాధించుకొని వంద ఏండ్లు దాటి పోయింది. అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నాం. మహిళలు కూడా అన్ని రంగాల్లో మగవారితో సమానంగా శ్రమిస్తున్నారు, రాణిస్తున్నారు. అయితే అదే స్థాయిలో హింస, వివక్ష కూడా పెరిగిపోతోంది. ఇది అంతం కావాలి. మహిళలపై హింసలేని సమాజం రావాలి. కమ్యూనిజం వర్ధిల్లితేనే మహిళలకు మౌలికమైన సమానత్వం లభిస్తుంది’ అంటారు ప్రముఖ మహిళా ఉద్యమ నాయకురాలు కొల్లంతారు. కాబట్టి మహిళలంతా ఏకతాటిపై నిలబడి అలాంటి సమానత్వం కోసం ఉద్యమించాలి. అభ్యుదయ మహిళా సంఘాలన్నీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అలాంటి నినాదంతో పోరాటాలు రూపొందించుకోవాలి.
సమరశీలతకు అద్దం పట్టిన
1911 మార్చి 19న తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపారు. అంచనాలకు మించి జయప్రదమైంది. జర్మనీ, ఆస్ట్రియాలలో శ్రామిక మహిళా ప్రదర్శనలు సముద్రంలా పొటెత్తిపోయాయి. చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లో కూడా మహిళా సమావేశాలు జయప్రదంగా జరిగాయి. శ్రామిక మహిళల సమరశీలతకు అద్దం పట్టిన తొలి ప్రదర్శన ఇది. మగవాళ్లు ఇంటి పట్టున ఉండి పిల్లల్ని చూసుకునేవారు. వంటింటికే పరిమితమైన గృహిణులు తొలిసారిగా వీధికెక్కారు. 1913లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీకి మార్చారు. అప్పటి నుండి మార్చి 8 మహిళా దినోత్సవంగా, శ్రామిక మహిళల సమరశీలతకు గుర్తుగా మారింది.