పెంబర్తి వద్ద హైడ్రామా

Hydrama at Pemberti– మాజీ మంత్రి ఎర్రబెల్లితో హైదరాబాద్‌కు మాజీ ఎమ్మెల్యే ఆరూరి పయనం
– పెంబర్తి వద్ద అడ్డుకున్న బీజేపీ నాయకులు,
– ఇరు పార్టీల మధ్య తోపులాట చిరిగిన రమేష్‌ చొక్కా..
– ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ మీటింగ్‌కు హాజరు
నవతెలంగాణ-జనగామ/హన్మకొండ
బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ బీజేపీలో చేరికపై బుధవారం హైడ్రామా నడిచింది. ఆయన కోసం బీజేపీ నేతలు చేజింగ్‌ పాలిటిక్స్‌ నడిపారు. కొంతకాలంగా బీఆర్‌ఎస్‌లో అసంతృప్తిగా ఉంటూ వరంగల్‌ పార్లమెంట్‌ స్థానానికి అధిష్టానం ఆమోదం తెలుపకపోవడంతో బీజేపీలోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విషయం తెలిసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆరూరిని బుజ్జగించే ప్రయత్నంలో బుధవారం హైదరాబాద్‌కు తీసుకెళుతుండగా జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ నాయకులు అడ్డుకొన్నారు. వాహనం నుంచి ఆరూరిని బయటకు లాగుతున్న క్రమంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నారు. దాంతో ఇరుపార్టీ నాయకుల మధ్య జరిగిన తోపులాటలో ఆరూరి రమేష్‌ చొక్కా చినిగింది.
హన్మకొండ హరిత హౌటల్లో కొందరు బీజేపీ అధినాయకులను కలిసిన ఆరూరికి వరంగల్‌ పార్లమెంట్‌ టికెట్‌పై హామీ రావడంతో బుధవారం ఉదయం తన నివాసంలో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలని ప్రకటించడానికి ఆరూరి రమేష్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దాంతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం కేసీఆర్‌, హరీశ్‌ రావు అప్రమత్తమై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మరికొంత మంది సీనియర్‌ నాయకులను విలేకరుల సమావేశానికి ముందే ఆరూరి రమేష్‌ నివాసానికి పంపించారు. వారిని చూసి ఆరూరి ఉద్వేగానికి గురయ్యారు. గతంలో మాదిరిగానే మళ్లీ మన పార్టీ నాయకులే నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తారని కన్నీరు పెట్టుకున్నారు. ఆరూరిని బలవంతంగా తమ వాహనాల్లో తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, బసవరాజు సారయ్యలతో ఆరూరి అనుచరులు వాగ్వాదానికి దిగారు. అయినా బలవంతంగా బీఆర్‌ఎస్‌ నాయకులు రమేష్‌ ను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
పెంబర్తి వద్ద తోపులాట..
మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఆరూరిని తీసుకొని ఎర్రబెల్లి దయాకర్‌ రావు, బసవరాజు సారయ్య హైదరాబాద్‌ వెళుతున్న క్రమంలో వారి వాహనాన్ని జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ నాయకులు దశమంత రెడ్డి, ఉడుగుల రమేష్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు అడ్డుకొన్నారు. వాహనం నుంచి రమేష్‌ను బలవంతంగా దింపి తమ వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. దాంతో బీఆర్‌ఎస్‌ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈ తోపులాటలో ఆరూరి చొక్కా చినిగింది. అయితే రమేష్‌ బీజేపీ వాళ్ల వాహనంలోకి ఎక్కకుండా తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని చెప్పారు. దాంతో బీజేపీ నాయకులు ఉడుగుల రమేష్‌.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి ఆరూరి రమేష్‌తో మాట్లాడించారు. తనను ఎవరూ బలవంతంగా తీసుకెళ్లడం లేదని, తన వ్యక్తిగత పనిమీద వెళుతున్నానని, మాట్లాడి వస్తానని ఆరూరి రమేష్‌ ఫోన్‌లో కిషన్‌రెడ్డికి సమాధానం ఇచ్చారు. అనంతరం వారంతా హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. కాగా, హైదరాబాద్‌లో కేసీఆర్‌తో ఆరూరి భేటీ అయ్యారు. ఈక్రమంలో ఆరూరి.. చివరికి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, బీజేపీ ఆగ్రనేత అమిత్‌ షాను కలవలేదని ప్రకటించారు. అయితే ఆయనకు వరంగల్‌ టికెట్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ కేటాయించలేదు. కడియం శ్రీహరి కూతురు కావ్యకి కేటాయించడం గమనార్హం.