– ఇండియా కూటమి సభలో రాహుల్
– ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. శరద్ పవార్
ముంబయి : ఎన్నికల ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈవీఎంలను బీజేపీ తారుమారు చేసే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ముంబయి శివాజీ పార్కులో జరిగిన ఇండియా కూటమి ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాజు గారి ఆత్మ ఈవీఎంలు, కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ, సీబీఐలలో ఉన్నదని వ్యాఖ్యానించారు. అవి లేకుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో గెలవలేరని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వీవీప్యాట్లను కూడా లెక్కించాలని మేము గతంలో ఎన్నికల కమిషన్‌ను కోరామని, అయితే తమ డిమాండును ఆ సంస్థ అంగీకరించలేదని తెలిపారు. తమ పోటీ ప్రధానితో కాదని, ఓ శక్తితో అని రాహుల్ స్పష్టం చేశారు. ‘ఆయన ఓ ముసుగు. శక్తి (అధికారం) కోసం పనిచేస్తారు’ అని వ్యాఖ్యానించారు. అవినీతిపై ప్రధానికి గుత్తాధిపత్యం ఉన్నదని ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరాల్సిందిగా ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. శివసేన, ఎన్సీపీ చీలిపోయి అధికార కూటమిలో చేరతాయని అనుకున్నారా అని ప్రజలను ప్రశ్నించారు. ఆయా పార్టీల నేతల మెడల్ని నొక్కి పట్టి బీజేపీలో చేరేలా ఒత్తిడి తెచ్చారని అన్నారు. దేశ రాజధానిలో కొలువుదీరిన నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు శివాజీ పార్కును వేదికగా చేసుకున్నామని శివసేన (ఠాక్రే) నేత ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. బీజేపీ ఓ గాలి బుడగ వంటిదని అంటూ ఈసారి దాని గాలి తీసేస్తామని అన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఎన్సీపీ (పవార్) అధినేత శరద్ పవార్ తెలిపారు. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి గద్దె ఎక్కిన వారిని అధికారం నుండి తప్పించాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ దేశ భవిష్యత్తుకు ఆశాజ్యోతి అని డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.