కొచ్చి : కేరళ యువతులు డ్రైవింగ్ నేర్చుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. గత సంవత్సరం కేరళలో సుమారు 11 లక్షల మంది డ్రైవింగ్ లెర్నింగ్ లైసెన్స్ (ఎల్‌ఎల్) పొందగా వారిలో 40శాతం మంది మహిళలే ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో ఎల్‌ఎల్ పొందుతున్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ఎల్‌ఎల్ పొందిన మహిళల సంఖ్యలో గోవా రెండో స్థానంలో ఉంది. అక్కడ ఎల్‌ఎల్ తీసుకున్న వారిలో 33శాతం మంది మహిళలే. అయితే ఉత్తరప్రదేశ్‌లో వీరి సంఖ్య అత్యంత తక్కువగా 5శాతం, బీహార్‌లో 3శాతం మాత్రమే ఉంది. విద్య, ఆర్థిక స్వాతంత్య్రం కారణంగా కేరళలో ఎక్కువ మంది మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడంపై మక్కువ చూపుతున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. కేరళలో విద్యావంతులైన మహిళల సంఖ్య కూడా ఎక్కువే. ప్రజా జీవితంలో కూడా వారు చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. ఉద్యోగినులు ఎక్కువగా ద్విచక్ర వాహనాలు ఉపయోగిస్తున్నారు. యువతులే కాకుండా మధ్యవయస్కులైన మహిళలు కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని రవాణా శాఖ అధికారులు తెలిపారు.